Wednesday, November 30, 2022

మోడీపై గుజరాత్ మారణకాండ మచ్చ

- Advertisement -

పెళ్లి కొడుకు వీడే గానీ వేసుకున్న చొక్కా మాత్రం నేనివ్వలేదంటూ నరసింహ సినిమాలో రజనీకాంత్ అవసరం లేని అంశా న్ని చెప్పి గుట్టు రట్టు చేసిన దృశ్యం తెలిసిందే. అదే మాదిరి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అవసరం లేని అంశాన్ని చెప్పి నరేంద్ర మోడీ మీద ఉన్న గుజరాత్ మారణకాండ మచ్చ ను తిరిగి ప్రపంచానికి గుర్తు చేసిన తీరు మీద మీడియాలో మరోసారి చర్చ జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్ ఖషోగ్గీని టర్కీలోని ఇస్తాంబుల్‌లో 2018లో హత్య చేశారు. దాని వెనుక సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని గతం లో అమెరికా విమర్శించింది. సౌదీలో భిన్నఅభిప్రాయాలను, అసమ్మతిని అణచివేస్తున్నట్లు ధ్వజమెత్తింది.

ఖషోగ్గీ అమెరికా నివాసిగా ఉన్నందున అతని సన్నిహితురాలు, పౌరహక్కుల గ్రూపులు అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరుగుతున్నది.ప్రస్తుతం అతను దేశాధినేతగా ఉన్నందున అమెరికా చట్టాల ప్రకారం ఒక దేశాధినేతను అమెరికాలో విచారించే అవకాశం లేదని విచారణలనుంచి ప్రభుత్వపరంగా మాపు(మినహాయింపు) ప్రకటించినట్లు తాజాగా అమెరికా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే మాపు కోర్టును ప్రభావితం చేయదని, విచారించాలా లేదా అన్నది జడ్జి నిర్ణయానికే వదలి వేసినట్లు కూడా ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ పౌర హక్కుల బృందాలు ప్రభుత్వ చర్య మీద ధ్వజమెత్తాయి. ఖషోగ్గీకి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదని, గతంలో ఆంక్షల మాపు పొందిన వారిలో హైతీ నేత జీన్ బెర్ట్రాండ్ అరిసె్టైడ్, జింబాబ్వే నేత రాబర్ట్ ముగాబే, కాంగో నేత కబిల, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత పటేల్ పేర్కొన్నాడు.

వీరందరినీ పౌరహక్కులను హరించిన, జనాలను అణచివేసిన వారిగా అంతకు ముందు అమెరికా పేర్కొన్నది. వీసాల నిరాకరణ, ఆంక్షల వంటి చర్యలను ప్రకటించి అమలు జరిపింది. వారు దేశాధినేతలుగా అధికారానికి వచ్చిన తరువాత వాటి నుంచి మినహాయింపులు ఇచ్చింది. ఆ దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలు, నేతలతో అవసరాలు, అధికారికంగా వారు ఐరాస సమావేశాలకు అమెరికా రావాల్సిన అగత్యవంటి అంశాల కారణంగా కూడా ఆంక్షలను సడలించాల్సి వచ్చింది.కోర్టులో దాఖలైన దావా మంచి చెడ్డల జోలికిపోవటం లేదు. ఆంక్షలను మాపు చేసినప్పటికీ హత్య లో సౌదీ ఏజంట్ల పాత్రను అమెరికా ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నదని అమెరికా విదేశాంగశాఖ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. దానిలో రాజు పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. జర్నలిస్టు ఖషోగ్గీని హత్య చేయాలని ఎంబిఎస్‌గా పిలిచే మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశించినట్లు అమెరికా గూఢచార సంస్థలు తమ నివేదికల్లో పేర్కొన్నప్పటికీ సౌదీతో సంబంధాల అవసరాల రీత్యా ఎంబిఎస్ మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. హత్యకు ముందు 2017 నుంచి ఎంబిఎస్ సౌదీ రక్షణ,గూఢచార విభాగాల అధిపతిగా ఉన్నాడు. ఇటీవలనే ప్రధానిగా ప్రకటించారు. కుట్రకు ఎవరు పథకాన్ని రూపొందించినప్పటికీ దాని స్వభావం, జరిగిన తీరునుచూస్తే అతని అనుమతి లేకుండా జరిగేది కాదని సిఐఏ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

2021 ఫిబ్రవరిలో అమెరికా బహిర్గతపరచిన రహస్య పత్రాలలో జర్నలిస్టు ఖషోగ్గీని బందీగా పట్టుకు రండి లేదా అంతమొందించండన్న దానికి ఎంబిఎస్ ఆమోదం వుందని పేర్కొన్నారు. ఎంబిఎస్‌పై మాపు ప్రకటించటం ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను శిక్షించాలని చెబుతున్న అమెరికా, దాని మిత్రపక్షాల ప్రయత్నాలకు హాని కలిగిస్తుందని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. నిరంకుశ సౌదీ వత్తిడికి లొంగినట్లు విమర్శించారు. ఖషోగ్గి హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కొందరు సౌదీ అధికారుల మీద వీసా నిరాకరణ, ఇతర ఆంక్షలను అమలు జరుపుతున్నారు. హత్యలో సౌదీ రాజు పాత్ర గురించి విదేశాంగ శాఖ ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు. తన ఎన్నికల ప్రచారంలో సౌదీ రాజును ‘అంటరాని’ వాని జో బైడెన్ వర్ణించాడు. ఈ ఉదంతంలో అతన్ని జవాబుదారీగా చేసేందుకు చేయాల్సిందంతా చేస్తామని అమెరికన్లకు వాగ్దానం చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మారిన అంతర్జాతీయ పరిణామాల్లో రష్యాకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపమంటూ సౌదీకి వెళ్లి రాజును కౌగలించుకున్నాడు, చమురు ఉత్పత్తిని పెంచమని బతిమిలాడుకున్నాడు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. ఇప్పుడు విచారణ నుంచి మాపు చేసి మరోసారి ప్రసన్నం చేసుకోవాలని అమెరికా చూస్తున్నది. హత్య జరిగినపుడు సల్మాన్ ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. ఇప్పుడు దేశాధినేత, అతడిని ప్రభుత్వం శిక్షించేది లేదని జో బైడెన్ 2021 ఫిబ్రవరిలోనే చెప్పాడు.

సౌదీ రాజు సల్మాన్‌పై గూఢచార నివేదికలను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వ్యూహాత్మక భాగస్వామిపైచర్య తీసుకున్న సంప్రదాయం అమెరికాకు లేదని చెప్పాడు. ఇది కేసు మంచి చెడ్డల ప్రతిబింబం కాదు లేదా ఖషోగ్గీ హత్య మీద మా అభిప్రాయాలకూ ప్రతిబింబం కాదు, ప్రభుత్వ అధిపతిగా రాజు పాత్ర మీద, చట్టపరమైన పదవి మీద ఇక్కడి చట్టాల ప్రతిబింబమే అని తాజాగా వేదాంత పటేల్ చెప్పాడు. చట్టబద్ధ్దంగా ఖషోగ్గి కేసులో సౌదీ రాజును మరొక దేశంలో విచారించే అవకాశం లేదని అతని న్యాయవాదులు కోర్టులో చెప్పారు. దాని మీద కేసు విచారణ జరుపుతున్న వాషింగ్టన్ జడ్జి ఒకరు ఆదేశం జారీ చేస్తూ నవంబరు పదిహేడవ తేదీ అర్ధరాత్రిలోగా ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలంటూ బైడెన్ ప్రభుత్వాన్ని కోర్టు కోరారు. ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తూ సల్మాన్‌పై విచారణకు మినహాయింపు ఇచ్చామని, అది కోర్టు నిర్ణయం మీద ప్రభావం చూపదని పేర్కొన్నది.దాన్నే మరుసటి రోజు మీడియాకు వివరిస్తూ విలేకర్ల ప్రశ్నకు నరేంద్ర మోడీ మీద ఉన్న ఆంక్షలకు సైతం మాపువర్తింపు చేశామని వేదాంత పటేల్ చెప్పాడు.

హతుడు ఖషోగ్గీ అమెరికా పౌరుడు గనుక అతని సన్నిహితురాలు, ఇతర హక్కుల సంస్థ అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసే అవకాశం వచ్చింది. గుజరాత్ మారణకాండలో అమెరికా పౌరులెవరూ మరణించనందున అక్కడి కోర్టులో మోడీపై కేసులను దాఖలుచేసే అవకాశం లేదు. గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండ నివారణలో సిఎంగా నరేంద్ర మోడీ విఫలం కావటమే గాక దాడులను ప్రోత్సహించినట్లు విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. దాని గురించి అమెరికాలోని హక్కుల సంఘాలు చేసిన వత్తిడి మేరకు ప్రభుత్వం 2005 నుంచి 2014వరకు అమెరికా సర్కార్ మోడీ అధికారిక పర్యటనతోపాటు పర్యాటక, వాణిజ్య వీసాలను కూడా నిరాకరించింది. తమ విదేశాంగశాఖ భారత మానవహక్కుల కమిషన్, ఇతర భారత స్వతంత్ర సంస్థల సమాచార ప్రాతిపదికగా ఒక వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నది. 2014లో మోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన కొద్ది గంటల్లోనే దేశాధినేతగా ఉన్నందున బరాక్ ఒబామా ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టాడు. తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు.2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ఆ హోదాలో తొలిసారి అమెరికా వెళ్లటానికి ముందు గుజరాత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు గాను విచారించాలంటూ దాఖలైన ఒక కేసులో అమెరిక ఫెడరల్ కోర్టు నరేంద్ర మోడీకి సమన్లు జారీ చేసింది.

అదే ఏడాది అక్టోబరులో నరేంద్ర మోడీతో సహా ఇతర దేశాధినేతలను అమెరికా కోర్టులో విచారించేందుకు మాపు ఉందని, తమ ప్రభుత్వం దానికే కట్టుబడి ఉందని నాటి ఒబామా సర్కార్ కోర్టుకు తెలిపింది. 2015 జనవరిలో న్యూయార్క్ కోర్టు ప్రభుత్వ వైఖరిని సమర్ధిస్తూ కేసును కొట్టివేసింది. ఇప్పుడు సౌదీ రాజు మీద కేసును కూడా అదే విధంగా కొట్టివేసే అవకాశం ఉంది.సిఎంగా ఉన్నపుడు మోడీకి వీసా నిరాకరించిన అమెరికా నిర్ణయాన్నినాడు అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం తప్పు పట్టింది. తమ దేశంలో చట్టబద్ధంగా ఒక రాష్ట్రానికి ఎన్నికైన సిఎంకు వీసా నిరాకరణ పద్ధతి కాదని 2005లోనే స్పష్టం చేసినప్పటికీ అమెరికా ఖాతరు చేయలేదు. నరేంద్ర మోడీ వీసా నిరాకరణకు వత్తిడి చేసిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ అమెరికన్ కమిషన్ సంస్థ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్) ఎన్‌ఆర్‌సి పేరుతో భారత ప్రభుత్వం ముస్లింలను వేధిస్తున్నదంటూ దానికి కారకులైన ‘ముఖ్యనేతలందరి’ మీద ఆంక్షలు విధించాలని 2019లో డిమాండ్ చేసింది. దానిలో ఎవరి పేర్లనూ ప్రస్తావించలేదు. అది నరేంద్ర మోడీ, అమిత్ షాల గురించే అన్నది స్పష్టం. గుజరాత్ సిఎంగా నరేంద్ర మోడీ రాజధర్మాన్ని పాటించాలని నాటి ప్రధాని వాజ్‌పేయి హితవు చెప్పిన సంగతి తెలిసిందే.

దీన్ని 2013లో నరేంద్ర మోడీ తిరస్కరించటమేగాక తాను రాజధర్మాన్ని పాటిస్తున్నట్లు వాజ్‌పేయికి చెప్పారని అన్నారు.‘ఒక నిర్ణీత రాజధర్మం ఉంది, దాన్ని మీరు అనుసరిస్తున్నారని’ అన్నట్లుగా మోడీ వర్ణించారు. నరేంద్ర మోడీ 2014 లో దేశాధినేత పదవిలోకి వచ్చినందున అంతకు ముందు విధించిన ఆంక్షలను మాపు చేసింది తప్ప శాశ్వతంగా ఎత్తివేసిందా లేదా అన్నది స్పష్టం కాలేదు. ఇప్పుడు ఖషోగ్గీ ఉదంతంలో సౌదీ ఏజంట్ల పాత్ర గురించి పునరుద్ఘాటిస్తున్నట్లుగానే గుజరాత్ మారణకాండలో సంఘపరివార్ సంస్థల గురించి కూడా అమెరికా గత వైఖరినే పునరుద్ఘాటిస్తుందా? గుజరాత్ ఉదంతాలపై మోడీ ఇంతవరకు క్షమాపణ చెప్పటం లేదా విచారం వ్యక్తం చేయలేదు. ఆ ఉదంతాల్లో ఒక మానభంగం కేసులో శిక్షలు పడిన వారిని కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఇటీవల గుజరాత్ సర్కార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2002 నాటి ఉదంతాలకు నరేంద్ర మోడీ జవాబు చెప్పాల్సిన అవసరంలేదని 2012లో సుప్రీంకోర్టు చెప్పింది.

తరువాత కూడా అమెరికా ఆంక్షలను కొనసాగించింది. తన మీద ఆంక్షల కోసం వత్తిడి తెచ్చిన యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ ప్రతినిధులు 2016లో భారత పర్యటనకు అనుమతి కోరగా చివరి క్షణంలో మోడీ సర్కార్ తిరస్కరించింది. ఈ అనధికార నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మోడీ సర్కార్, సంఘ పరివార్ సంస్థల తీరుతెన్నుల మీద ఆ సంస్థ ఎప్పటికప్పుడు తన నివేదికల్లో విమర్శలు చేస్తూనే ఉంది. వాటి మీద అమెరికా సర్కార్ అవుననీ, కాదని చెప్పదు. కానీ అవసరమైనపుడు వాటి ఆధారంగా గతంలో అనేక దేశాల వారి మీద ఆంక్షలు విధించింది. చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను తన వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నందున నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు మోడీ అమెరికా వీసా భద్రంగా ఉంటుంది అని 2016 జూన్ రెండున గార్డియన్ పత్రిక విశ్లేషణలో పేర్కొన్నారు.వేదాంత పటేల్ స్పందనలో నరేంద్ర మోడీ పేరు ప్రస్తావన తేవటంపై అధికారికంగా ఇది రాసిన సమయానికి కేంద్ర ప్రభుత్వం లేదా బిజెపి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ ప్రస్తావన కావాలని చేశారా లేక యథాలాపంగా చెప్పారా అన్నది పక్కన పెడితే గతంలో ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీ తనను కశ్మీరు వివాదంలో పెద్ద మనిషిగా ఉండమని కోరినట్లు చేసిన తీవ్ర ఆరోపణ మీద కూడా మోడీ మౌనం దాల్చారు. స్పందిస్తే మరింత విస్తృత చర్చకు దారితీస్తుందన్న జాగ్రత్త దాని వెనుక ఉంది. ఇప్పుడూ దాన్నే అనుసరిస్తున్నారా? అనుమానం ఎందుకు!

ఎం కోటేశ్వరరావు
8331013288

Related Articles

- Advertisement -

Latest Articles