Friday, March 29, 2024

యదేచ్ఛగా కృష్ణాజలాల దోపిడీ

- Advertisement -
- Advertisement -

ఒకవైపు ఎపి, మరోవైపు కర్ణాటక
మహారాష్ట్రలో 126 టిఎంసిలు వృథా
కర్ణాటక 288 టిఎంసిల జల దోపిడీ
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రేక్షక పాత్ర
కడియం శ్రీహరి ఫిర్యాదులు బుట్టదాఖలు
కృష్ణాజలాల్లో తెలంగాణకు తీవ్రనష్టం

More krishna water used by Andhra and karnataka

మన తెలంగాణ/ హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష ధోరణి, పొరుగు రాష్ట్రాల జలదోపిడీల మూలంగా అత్యంత కీలకమైన కృష్ణానదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం, అన్యాయం జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్, మరోవైపు కర్ణాటక రాష్ట్రాల జల దోపిడీలు, మహారాష్ట్రలో కృష్ణానదీ జలాలు వౄధాగా అరేబియా సముద్రంలో  కలుస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగునీటి సదుపాయాలు కల్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత జరుగుతున్నా కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కే.ఆర్.ఎం.బి)గానీ, కేంద్ర జల సంఘం (సి.డబ్లు.సి)గానీ కృష్ణానదీ జలాల వినియోగంలో ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రానికి ఎంత తీవ్రమైన నష్టం వాటిల్లుతుందో& ఈ సమస్యను ఎలా పరిష్కరించాలోననే అంశాలపై దృష్టి పెట్టిన పాపానపోలదని తెలంగాణ నీటిపారుదల శాఖలోని సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కృష్ణానదీ జలాల్లో జరుగుతున్న జల దోపిడీలను అరికట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు లేఖలు రాసినా& చెప్పులరిగేలా కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగినా గడచిన ఏడున్నర సంవత్సరాల్లో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోవడం బాధాకరమని అధికారలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బచావత్ అవార్డును తుంగలోతొక్కిన ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలోని భారీ ప్రాజెక్టులకు ఏటా 140 టీ.ఎం.సీ.లను తరలించుకుపోవడమే కాకుం డా హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో మరో 25 టీ.ఎం. సీ.ల నీటిని అదనంగా వాడుకొంటూనే ఇవి చాలవన్నట్లుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తూ కృష్ణానదీ జలాలన్నింటినీ రాయలసీమ ప్రాజెక్టులకు తరలించేందుకు వాయువేగంగా పనులు జరుగుతున్నప్పటికీ కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆపలేకపోతోంది. పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకు ఏటా లెక్కాపత్రం లేకుండానే సుమారు 180 టీ.ఎం.సీ.ల కృష్ణానదీ జలాలు తరలిపోతున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటి వాడకంపై వాస్తవిక లెక్కలు తేల్చేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద గేజింగ్ యంత్రాలను ఏర్పాటు చేయమంటే కృష్ణా బోర్డు నిమ్మకునీరెత్తినట్లుగా మౌనంపాటిస్తున్నదేగానీ గేజింగ్ ఏర్పాట్లు చేయలేదని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న జస్టీస్ బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమ ప్రాంతానికి తుంగభద్ర హై లెవెల్ కాల్వ, లోలెవెల్ కాల్వలు, పెన్నా నదీ జలాలను వినియోగించుకోవాల్సి ఉంది. కానీ ఆచరణలో అమలుకు నోచుకోవడంలేదు.
శాటిలైట్‌లకు కూడా అంతుచిక్కని కర్ణాటక జల దోపిడీ
కృష్ణానదీ జలాలను అడ్డగోలుగా వాడుకోవడం, బచావత్ అవార్డులకు తిలోదకాలిచ్చి, శాటిలైట్‌లకు కూడా అంతుచిక్కకుండా నీటిని అడ్డగోలుగా వాడుకోవడంలో కర్ణాటక ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్య్వహరిస్తోంది. ప్రతి ఏటా సుమారు 288 టీ.ఎం.సీ.ల కృష్ణా జలాలను కర్ణాటక అక్రమంగా వినియోగించుకుంటోంది. నిబంధనల ప్రకా రం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 మీటర్లకు పరిమితం చేయాల్సి ఉండగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం 524 మీటర్లకు ఆల్మట్టి డ్యాం ఎఫ్.ఆర్.ఎల్.ను నిర్మించింది. ఆ మేరకు నీటిని నిల్వ చేస్తూనే ఉంది. ఆల్మట్టి డ్యాం నుంచి కర్ణాటక ప్రభుత్వం ఏటా 195 టీ.ఎం.సీ.ల నుంచి 225 టీ.ఎం.సీ.ల నీటిని వినియోగించుకొంటోంది. ఆల్మట్టి జలాశయం నుంచి 193.5 టీ.ఎం.సీ. లనే వాడుకోవాల్సి ఉంది. వర్షాకాలంలో వరదల సీజన్‌లో ఒక జలాశయం ఒకటిన్నర సార్లు నిండుతుందని, ఆ మేరకు నీటి వాడకం ఉంటుందని ఆ అధికారులు వివరించారు. ఇక కృష్ణా పొడవునా అక్రమంగా పంపులు, మోటార్లు పెట్టుకొని నీటిని అక్రమంగా వాడుకొంటున్నారని, నదీపైన మోటార్లు బిగించుకొన్న వారికి కర్ణాటక ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్తును కూడా ఇస్తోందని తెలిపారు. అంతేగాక కృష్ణానదిపైన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అనేక రోడ్డు బ్రిడ్జిల కింద చెక్ డ్యాంలు నిర్మించారని, ఈ చెక్ డ్యాంలు పైకి కనిపించవని, శాటిలైట్‌ల ద్వారా ఫోటోలు తీయాలని ప్రయత్నించినా బ్రిడ్జిలు కనిపిస్తాయేగానీ చెక్ డ్యాంలు కనిపించవని ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. 2003వ సంవత్సరంలో అప్పటి భారీ నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి ఫోటో లు, వీడియోలను చిత్రీకరించి సాక్షాధారాలతో సహా కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారని, దాదాపు 19 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కేంద్ర జల సంఘం అధికారులు ఇప్పటికీ ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకొన్న పాపానపోలేదని ఆ అధికారులు వివరించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును, బ్రిడ్జిల కింద ఉన్న చెక్‌డ్యాంలను చిత్రీకరించడానికి తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి అధికారుల బృందంపై అప్పట్లో కర్ణాటక పోలీసులు, రైతులు కూడా తిరగబడి భౌతికదాడులు కూడా చేసిన విషయాలను కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఆ ఫిర్యాదులన్నీ బుట్టదాఖలయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలా ఆల్మట్టి డ్యాం నుంచి అదనంగా వాడుకోవడమే కాకుండా వదరలు ప్రారంభమైన నాటి నుంచి కృష్ణానది నుంచి తుంగభద్ర బేసిన్ ఆయకట్టుకు నీటిని తరలిస్తూ కర్ణాటక జల దోపిడీకి పాల్పడుతూనే ఉంది. అదేవిధంగా వేల సంఖ్యలో మోటార్లు, పంపులు, బ్రిడ్జీల కింద నుంచి చెక్‌డ్యాంల నుంచి రకరకాల పద్దతుల్లో ఏకంగా 288 టీ.ఎం.సీ.ల నీటిని కర్ణాటక అక్రమంగా కృష్ణానదీ జలాలను వాడుకుంటోందని ఆ అధికారులు వివరించారు.
వృథా జలాలు వినియోగంలోకి రావా?
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల జల దోపిడీలు ఇలా వుండగా మహారాష్ట్రంలో అత్యంత విలువైన కృష్ణానదీ జలాలు వృధాగా అరేబియా సముద్రంలో కలుస్తున్నా యి. ఆ నీటిని నదిలోకి మళ్ళించే ప్రయత్నం ఎవ్వరూ చేయడంలేదనే విమర్శలు దశాబ్దాలుగా ఉన్నాయి. మహారాష్ట్రలో కృష్ణానది కి ఉప నది అయిన కోయినా నదిపై ఉన్న జల విద్యుత్తు కేంద్రం నుంచి డా సుమారు 126 టీ.ఎం.సీ.ల అత్యంత విలువైన నదీజలాలు వృధాగా అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. జల విద్యుత్తు కేంద్రం నుంచి బయటకు వచ్చిన నీరు టేల్‌రేస్ ద్వారా ఒక లోయలోకి వెళ్ళి అక్కడి నుంచి అరేబియాలో కలుస్తుంది. అలా కాకుండా కోయినా జలాలను కూడా తిరిగి నదిలోనికి కలిసేటట్లుగా టేల్‌రేస్ దారిమళ్ళిస్తే కృష్ణాజలాలపై ఆధారపడిన భాగస్వామ్య రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ పనిని చేపట్టాలని కేంద్ర జల సంఘానికి తెలంగాణ నాయకులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేందం ఆ ఊసే ఎత్తలేదని అధికారవర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. దేశాన్ని పాలించిన యు.పి.ఏ ప్రభుత్వంగానీ, ఇప్పటి ఎన్.డీ.ఏ. ప్రభుత్వంగానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏ ఒక్క పనినీ చేపట్టకపోవడం విచారకరమని అంటున్నారు. కోయినా జల విద్యుత్తు కేంద్రం నుంచి వృధాగా అరేబియా సముద్రంలో కలిసే నీటిని నదిలోనికి మళ్ళించడానికి అయ్యే ఖర్చులను దామాషా ప్రకారం భాగస్వామ్య రాష్ట్రాలకు అప్పజెబుతూనే ఆ నీటిని కూడా బచావత్ అవార్డు ప్రకారం పంపకాలు చేయాలని, దాని మూలం గా సమస్య పరిష్కారమవుతందని కూడా గతంలో నీటిపారుదల శాఖాధికారులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు కూడా కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖకు, కేంద్ర జల సంఘానికి కూడా విజ్ఞప్తి చేశారు. కానీ ఆ విన్నపాలన్నీ బుట్టదాఖలు ఆయ్యయని, ఇప్పటి వరకూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు కూడా ఈ కీలకమైన జలదోపిడీలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించలేని దయనీయ పరిస్థితిలో ఉందని ఆ అధికారులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News