Saturday, December 7, 2024

మూసీ పునరుజ్జీవనంతో బాధెవరికి? మేలెవరికి?

- Advertisement -
- Advertisement -

నదుల వెంట నాగరికత విలసిల్లిందని మానవ వికాస చరిత్ర చెబుతోంది. నగరాలు నరక కూపాలై నదులను విషతుల్యం చేయడం మన కళ్లముందరి ఆధునిక వాస్తవం. పరిశ్రమల విష రసాయనాలు, మానవ వ్యర్థాలు, ఇతర మురుగుతో కాలుష్యమైన మూసీ దేశంలోనే అత్యంత విషపూరితమైన నదిగా, ప్రపంచం లోని పాతిక అతి కాలుష్య నదుల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రాజధాని హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే ఈ ప్రకృతి జల సంపదను దశాబ్దాల నిర్లక్ష్యంతో నాశనం చేసుకున్న హీనచరిత్ర మనది. దిగువ గ్రామీణ ప్రాంతాల్లో సగటు మనిషి జీవితాన్ని ఇది దుర్భరం చేస్తోంది. పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు కాలుష్యమై రసాయన అవశేషాలు పంటల నుంచి పాల వరకు విస్తరిస్తున్నాయి. చర్మవ్యాధుల నుంచి కేన్సర్ల దాకా, వింత జబ్బుల నుంచి గర్భస్రావాల దాకా… ప్రజాజీవితం అతలాకుతలమవుతోంది. కారణమేదైనా… మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని వ్యతిరేకించడం ఎందుకు? ఎలా జరగాలో డిమాండ్ చేయాలి, మంచే జరిగేలా ఒత్తిడి తెచ్చి సాధించాలి!

ప్రజా సమస్యల విషయంలో నిరసనలు, ఆందోళనలు, చివరకు ఉద్యమాలూ వస్తుంటాయి. వాటికి స్పందనగా ప్రభుత్వాల నుంచి విధాన నిర్ణయాలు, ఆ మేరకు ప్రకటనలు వస్తుండటం రివాజు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా జరుగుతున్న ఓ పరిణామంలో ప్రజలు, ప్రజాసమూహాలు, పౌర సమాజం, రాజకీయ పక్షాల స్పందన ఆశించిన రీతిలో లేకపోవడం బాధాకరం. వందేళ్ల కిందట నగరాన్ని నీళ్లతో ముంచెత్తిన ఓ ప్రకృతి విపత్తు తర్వాత… మానవ పరిష్కారంగా మూసీపై తొలి సంస్కరణ జరిగింది. నిజాం వినతి మేరకు ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చొరవతో… మూసీ, ఈసీలపై రెండు తాగునీటి తటాకాలను కట్టి, వరద ఉధృతిని కట్టడి చేశారు. హైదరాబాద్ -సికింద్రాబాద్‌ను వేర్పరుస్తూ నగరం గుండా సాగే మూసీపై వందేళ్లుగా ఏ సానుకూల మార్పు లేకపోగా, మన నిర్లక్ష్యం వల్ల పరిస్థితులు దిగజారాయి.

ఏమో? మళ్లీ వందేళ్ల దాకా ఎవరైనా ఇటువైపు దృష్టి పెడతారో, పెట్టరో తెలియదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసి, నదిని పునరుజ్జీవింపజేసే పనికి నడుం కట్టింది. కాలుష్య కాసారంగా మారిన మూసీని బాగు చేస్తామని, ప్రక్షాళనతో పునరుద్ధరిస్తామని, నీటిని శుద్ధిపరచి -పరిసరాలను మెరుగుచేసి పూర్వవైభవంతో నదిని పునరుజ్జీవింప చేస్తామనీ ప్రకటిస్తే… ఎవరికైనా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న సహజం! ప్రకటన వెలువడ్డ సమయం, సందర్భం, క్రమం పట్ల అభ్యంతరాలుండొచ్చు. తలపెట్టిన ప్రాజెక్టు విధానమో, అనుసరిస్తున్న పద్ధతో, ప్రతిపాదిస్తున్న అంశాలో నచ్చకపోవచ్చు. అప్పుడు, అంతే నిర్దుష్టంగా వాటిని ఎత్తిచూపి వ్యతిరేకించాలి తప్ప మొత్తం ప్రాజెక్టే తప్పనడం సరికాదు. కానీ, మూసీపై మాటలు మొదలైన నుంచీ కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇది కమీషన్ల కోసమేనని ఆరోపిస్తున్నారు. ‘ఇదా! మీ ప్రాధాన్యతా కార్యక్రమం?’ అని ప్రభుత్వాన్ని వారు నిలదీస్తున్నారు. అలా కాకుండా… ప్రతిపాదిత ప్రాజెక్టులో ఏది సబబో? ఏది కాదో? వివరంగా చెప్పాలి. అందుకు ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. మొత్తం ‘మూసీ పునరుజ్జీవన’ కార్యక్రమాన్ని వ్యతిరేకించడం సరికాదు.

పాదయాత్రతో డిమాండ్ పేరిగేనా?

ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏది తలపెట్టినా ప్రజలను భాగస్వాములు చేయడం వల్ల సత్ఫలితాలుంటాయి. మూసీ పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర కార్యక్రమం ఖరారైనట్టు వార్తలొస్తున్నాయి. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ మూసీ కాలుష్యానికి ప్రభావితులవుతున్న రైతులు, చేతి వృత్తులవారు, ఇతర కూలీలతో ఆయన మాట్లాడి వారి అభిప్రాయలు తెలుసుకుంటే ఇదొక మంచి ప్రయత్నమే! ‘నాయిన దసరాకు కొత్తబట్టలు కొనిస్తడా? కొనియ్యడా? అన్నంత వరకు అది సమస్యే! కానీ, కొనిస్తాను పద నీకు ఏం బట్టలు కావాలి? అని నిర్ణయం చెప్పాక బెట్టుచేయడం సరికాదు. వెంట వెళ్లి, ఏం బట్టలు కావాలో, డిజైన్ ఎలా ఉండాలో… ఎంపిక చేసుకోవడం పిల్లల బాధ్యత. ఇదీ అలాంటిదే. ప్రభుత్వం వెంట ఉండి మూసీ పునరుజ్జీవనం ఎలా జరగాలో పౌరులు, పౌరసమాజం, మేధావులు, ప్రజా సంఘాల చర్చించుకొని ప్రతిపాదనలు చేయాలి’ అన్న జియో సైంటిస్ట్ డాక్టర్ నక్కా సాయిభాస్కర్ మాటలు అక్షర సత్యాలు.

ఆయన మూసీ యాత్ర చేస్తున్నారిపుడు. వికారాబాద్ కొండల్లో పుట్టి మొత్తం 240 (రాజధాని నగరంలో 55) కి.మీ మేర ప్రయాణం చేసి సూర్యాపేట జిల్లా వాడపల్లి వద్ద కృష్ణాలో కలిసే ఉపనది మూసీ! కాలుష్యాన్ని అరికట్టడమే కాకుండా నగర సుందరీకరణతో పాటు బహుళప్రయోజనాలకుద్దేశించిన ఈ పథకం సమర్థ అమలుకు అందరి సహకారం అవసరం. ‘మూసీ రివర్ బెల్ట్ డెవలప్‌ంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డిసిఎల్) ప్రత్యేక విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమగ్రంగా ప్రాజెక్టును రూపకల్పన చేయడంతో పాటు డిజైన్లు ఇవ్వాల్సిందిగా టెండర్లు ఆహ్వానించి, రూ. 160 కోట్లు వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పబ్లిక్- ప్రయివేటు పార్టనర్‌షిప్ (పిపిపి) పద్ధతిన చేపట్టే ఈ సమగ్ర ప్రాజెక్టు కోసం అవసరమైతే రూ. 1.5 లక్షల కోట్ల మేర వ్యయ నిర్వహణకు సిద్ధమేనని ప్రకటించింది. మూసీ నీటిని శుద్ధి చేసి, బాపూఘాట్ వద్ద పెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు 200 ఎకరాల్లో గాంధీ విజ్ఞానాల అభివృద్ధి కేంద్రం, పర్యాటకాభివృద్ధి చేస్తామంటున్నారు.

భరోసా కావాలి

నగరం గుండా మూసీ ప్రవహిస్తున్న 55 కి.మీ మేర, ఇరువైపులా 55 మీటర్ల చొప్పున బఫర్ జోన్‌గా ప్రకటించి ఖాళీచేయిస్తున్నారు. దురాక్రమణలే అయినా సుదీర్ఘకాలంగా ఉంటున్నారనే కారణంగా కనీస న్యాయానికి ఒక ప్రాతిపదిక పెట్టుకున్నారు. వేల కొలది నిరుపేద కుటుంబాలే కాక మూసీతీరంలో కొన్ని వేల భవన నిర్మాణాలు, వందలాదిగా ఖాళీ స్థలాలున్నాయి. అవి తొలగిస్తున్నపుడు.. ప్రత్యామ్నాయంగా నిర్వాసితులకు ‘డబుల్ బెడ్రూం’ ఇళ్లు ఇస్తున్నామని, వాణిజ్య భవనాలు, స్థలాలు కోల్పోతున్నవారికి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆధునిక అభివృద్ధి కార్యక్రమాల పర్యవసానాల్లో ఇదొకటని తెలిసిందే! ఇచ్చే నష్టపరిహారం ఎంత న్యాయబద్ధంగా ఉందో ప్రజాసంఘాలు, పౌరసమాజం గమనించాలి. జీవనోపాధులతో కూడిన చోట నిర్వాసితుల్ని చేసి, ఇంకెక్కడో ఇళ్లు ఇస్తామంటారా? అని కొన్ని రాజకీయ పక్షాల వారు ప్రశ్నిస్తున్నారు. అంతకన్నా, ఇళ్లు ఇస్తున్న చోట ఉపాధి అవకాశాలు మెరుగుకోరడం సహేతుకంగా ఉంటుంది.

ఎన్నికలప్పుడు ఇచ్చిన ‘ఆరు హామీలు’ అమలు చేయకుండా పక్కకు నెట్టి, మూసీ సుందరీకరణకు తొందర మీకు ప్రాధాన్యతాంశమైందా? అని విపక్ష పార్టీల వారు విమర్శిస్తున్నారు. ప్రజాధనం నుంచి వెచ్చించేది పెద్దగా ఉండదని, పిపిపి పద్ధతిలోనే ఈ ప్రాజెక్టు వ్యయం ఉంటుందని సర్కారు వారు చెబుతున్నారు. ఈ అంశాలపై చర్చ జరగాలి. ప్రయివేటు భాగస్వామ్యంతో మూసీ పునరుజ్జీవన కార్యక్రమం చేపడితే… పెట్టుబడులకు ఎవరు ముందుకు వస్తున్నారు? వారు ఏంత వ్యయం చేస్తారు? ఏమాశిస్తారు? ప్రతిగా ప్రభుత్వం ఏం ఇస్తుంది? ఇలాంటి విషయాల్లో మరింత స్పష్టత అవసరం.

నీటి శుద్ధితో సర్వం సాధ్యం

‘నగరపాలక సంస్థ చేసే తడిచెత్తా, పొడిచెత్త నిర్వహణలాగే మూసీ ప్రక్షాళన చేస్తే, ఇక అంతకన్నా చెత్త మరోటుండదు’ అని సీనియర్ జర్నలిస్ట్ చెన్ను శివప్రసాద్ చేసిన వ్యాఖ్య కర్తవ్యబోధ చేస్తుంది. తడిచెత్త, పొడిచెత్త నిర్వహణకు వేర్వేరుగా రెండు చెత్తబుట్టలు సరఫరా చేసే మహానగర సంస్థ తరపున, ఆ చెత్త సమీకరణకు వచ్చే వాహన సిబ్బంది రెండు బుట్టల్ని ఒకే చోట గుమ్మరించుకొని పోతారు. మూసీలోకి వచ్చే మురికి నీటి శుద్ధి చర్యలూ అలాగే ఉంటున్నాయి. నగర శివారుల్లో రోజూ సగటున రెండు వేల మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డి) మురుగు ప్రవహిస్తూ నదిలోకి వస్తుంటే, సుమారు 800 ఎంఎల్‌డి మురుగును మాత్రమే సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టిపి) ల ద్వారా శుద్ధిచేసి, ఈ నీటిని మూసీలోకి వదులుతున్నారు. అదే సమయంలో, మిగతా 1200 ఎంఎల్‌డి మురుగును శుద్ధి చేయకుండానే మూసీలోకి వదులుతున్నారు. ఎక్కడోచోట రెండు కలిసిపోతున్నాయి.

ఇక శుద్ధి చేసి ఏం ఉపయోగం? మరొక ఇబ్బంది ఏమంటే… మురుగునీటి కాలువలు, వర్షపు నీటి కాలువలు వేర్వేరుగా ఉండాలి. కానీ, సరైన నిర్వహణా మరమ్మతులు లేక జంట నగరాల్లో సుమారు యాభై శాతం వర్షపు నీటి డ్రెయిన్లు, మురుగునీటి డ్రెయిన్లతో కలిసిపోయాయి. విడిగా ఉంటే, ఏ శుద్ధీకరణ అవసరం లేకుండానే వర్షపు నీరు నేరుగా మూసీలోకి వెళుతుంది. మురుగుతో కలిసిపోవడం వల్ల, ఎస్‌టిపిల ద్వారా శుద్ధి చేయాల్సిన మురుగు పరిమాణం పెరిగి శుద్ధీకరణ భారమవుతోంది. సుమారు పాతిక ఎస్‌టిపిలు మాత్రమే పని చేస్తున్నాయి. మరో 40 ఎస్‌టిపిల వరకు సిద్ధమవుతున్నాయి. కనీసం వంద ప్లాంట్ల అవసరం ఉంటుందనే ఉద్దేశంతో మరో 30 ఎస్‌టిపిలు ఏర్పరచుకునే కసరత్తు సాగుతోంది.

జన్మస్థానం నుంచి మొదలైతేనే..

‘మూసీ సుందరీకరణ’ కన్నా ‘మూసీ ప్రక్షాళన’ అర్థవంతమైన పదబంధం. కాలుష్యం తొలగించి, నీటిని శుద్ధిపరచకుండా సుందరీకరణ అసాధ్యం. ‘మూసీ ప్రక్షాళన’ కన్నా ‘మూసీ పునరుజ్జీవనం’ మరింత ప్రజాస్వామ్యయుతమైన ప్రతిపాదన. ఇది జరగాలంటే, ప్రాజెక్టు కింద చేపట్టే పనులు, నగరం గుండా మూసీ ప్రవహించే 55 కి.మీ కే పరిమితం చేస్తే ఉపయోగం లేదు. మూసీ జన్మస్థానమైన వికారాబాద్ గుట్టల నుంచి మొదలవాలి. ఏడాది పొడుగూ నదిని సజీవంగా ఉంచే సహజ వనరులను సంరక్షించాలి.

విధాన నిపుణులు దొంతి నర్సింహారెడ్డి చెప్పినట్టు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ‘మూసీ క్యాచ్‌మెంట్ ఏరియా అథారిటీ’ ఏర్పాటు చేయాలి. ‘రాజధానికి మేం గోదావరి నుంచి తాగునీరు తెస్తున్నాం కనుక హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలతో పనేలేదు, అందుకే ‘జీవో త్రిబుల్ వన్’ అవసరం లేదు’ అన్న ఇదివరకటి ప్రభుత్వ వాదనే డొల్ల! వివిధ దశల లిఫ్టుల ద్వారా అపార విద్యుత్ వినియోగంతో నగరానికి తెస్తున్న గోదావరి జలాలను మూసీలో పారిస్తామనే ప్రస్తుత ప్రభుత్వ వాదన కూడా అర్థం లేనిదే! లండన్ గుండా ప్రవహించే థేమ్స్ నది, సియోల్ గుండా సాగే చుంగే చాన్ ఉపనది పునరుజ్జీవనం మనకొక పాఠం కావాలి.

దిలీప్‌రెడ్డి

సమకాలీనం

(రచయిత పొలిటికల్ అనలిస్ట్,
‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News