బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ఇద్దరు భేటీ అయి పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్యను మల్లు రవి కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీసీ, కులగణన, రిజర్వేషన్ల కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని.. కాంగ్రెస్ పార్టీలో చేరికపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మల్లు రవితో ఆర్. కృష్ణయ్య చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ మంగళవారం ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.