Saturday, July 27, 2024

రోహిత్ సేనకు ఊరట

- Advertisement -
- Advertisement -

Mumbai Indians beat Punjab Kings by 6 wickets

రాణించిన పొలార్డ్, హార్దిక్, ఆదుకున్న సౌరభ్, పంజాబ్‌పై ముంబై విజయం

అబుదాబి: రెండో దశ ఐపిఎల్ టోర్నమెంట్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు మంగళవారం ఓదార్పు విజయం లభించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా ముంబై కష్టపడాల్సి వచ్చింది. పంజాబ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లైన్‌తో బౌలింగ్ చేయడంతో ముంబైకి పరుగులు సులభంగా లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (8) విఫలమయ్యాడు. సూర్యకుమార్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించాడు.

అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ డికాక్ రెండు ఫోర్లతో 27 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన సౌరభ్ తివారి రెండు సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో హార్దిక్ పాండ్య, పొలార్డ్‌లు బ్యాట్‌ను ఝులిపించారు. ధాటిగా ఆడిన హార్దిక్ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పొలార్డ్ ఒక ఫోర్, మరో సిక్స్‌తో 15 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. బుమ్రా, పొలార్డ్, కౌల్టర్ నైల్, చాహర్, కృనాల్, పొలార్డ్ సమష్టిగా రాణించారు. దీంతో పంజాబ్ స్కోరు 135 పరుగులకే పరిమితమైంది. మార్‌క్రామ్ ఆరు ఫోర్లతో 42 పరుగులు చేశాడు. మిగతావారిలో కెప్టెన్ రాహుల్ (21), దీపక్ హుడా (28) మాత్రమే కాస్త రాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News