Saturday, April 20, 2024

పురపోరులో తేలిపోయిన విపక్షాలు

- Advertisement -
- Advertisement -

municipal-elections

హైదరాబాద్: పురపోరు ఎన్నికల్లో అప్పుడే ప్రతిపక్ష పార్టీలు తేలిపోయాయి. ఎన్నికలు జరుగుతున్న అన్ని వార్డులకు అభ్యర్దులను కూడా నిలబెట్టలేని దుస్థితిలో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్‌తో పాటు బిజెపి ఉండడం విశేషం. ఇక టిడిపి, వామపక్షాలు అయితే మరీ దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. కనీసం సగంలో సగం మంది అభ్యర్ధులను కూడా బరిలోకి దించలేకపోయాయి. ప్రస్తుతం మొత్తం 3,052 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే సుమారుగా ఎనభై వార్డులను కైవసం చేసుకున్న అధికార టిఆర్‌ఎస్ పార్టీ మరో 2,972 వార్డుల్లో అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ 2,616 మంది అభ్యర్ధులను నిలపగా, బిజెపి నుంచి 2,313 మంది అభ్యర్ధులు, టిడిపి నుంచి 347 మంది, వామపక్షాల నుంచి ౩43 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

ఈ అభ్యర్ధులంతా తమ అదృష్టాన్ని ఈ నెల 22న జరిగే పోలింగ్ ప్రక్రియలో పరీక్షించుకోబోతున్నారు. రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ తామే ప్రత్యమ్నాయం అంటూ పదేపదే కమలనాధులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదని తెలుస్తోంది. వాస్తనానికి బిజెపికి గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఆ పార్టీ చాలా బలంగా కనిపిస్తుంది. కానీ పురపోరులో మాత్రం పట్డణ ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో అభ్యర్ధులను నిలబెట్టకపోవడం విస్మయం కలుగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం 3,052 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా ఆ పార్టీ కేవలం 2,313 మందిని మాత్రమే అభ్యర్ధులను బరిలోకి దింపగలిగింది. వీరిని నిలపడం కూడా ఆ పార్టీకి పలు వార్డుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది. కొన్ని వార్డుల్లో అయిచే చివరి నిమిషం వరకు అభ్యర్ధులను ఖరారు కూడా చేయలేకపోయింది.

ఫలితంగా బరిలో నిలిచిన స్వతంత్య్ర అభ్యర్ధులకు కూడా పార్టీ పక్షాన బి ఫారాలను అందజేసినట్లుగా వినిపిస్తోంది. ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి కూడా బిజెపి రాష్ట్ర నేతలపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అన్ని వార్డుల్లో అభ్యర్ధులను నిలపకపోవడానికి గల కారణాలు ఏమిటని ఆయన పార్టీ నేతలను కూడా నిలదీసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కూడా పలు వార్డుల్లో అభ్యర్ధులను బరిలోకి దింపలేకపోయింది. ఆ పార్టీ కేవలం 2,616 వార్డులకు మాత్రమే అభ్యర్ధులను బరిలో నిలిపింది. దీంతో పోలింగ్ ప్రక్రియ కంటే ముందుగానే దాదాపు ఐదారు వందల వార్డుల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ముందుగానే ఓటమిని అంగీకరించినట్లు అయినందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు మాసంలోనే నిర్వహించాలని శతవిధాలుగా యత్నించింది. అయితే కోర్టుల్లో పలు కేసుల కారణంగా దాదాపు ఐదు మాసాల ఆలస్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

అయినప్పటికీ కాంగ్రెస్, బిజెపి పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్ధులను రెడీ చేసుకోకపోవడం పట్ల ఆయా పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న బలహీనతలను తెలియజేస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు బలమైన పార్టీగా ముద్రపడిన టిడిపి కూడా పురపోరులో దయనీమైన పరిస్థితినే ఎదుర్కొన్నది. మొత్తం స్థానాలకు కాదు…కదా కనీసం సగంలో సగం మంది అభ్యర్ధులను కూడా నిలబెట్టలేకపోయింది.

ఇక వామపక్షాలది కూడా అదే పరిస్థితి. కాగా మజ్లిస్ పార్టీ మాత్రం ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్న వార్డులను ఎంచుకోని పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ 276 వార్డుల్లో అభ్యర్ధులను బరిలో నిలబెట్టగలిగింది. మొత్తం మీద రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలు బయటకు మాత్రం కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్దంగా కనబడుతోంది. ఇందుకు ఆయా పార్టీలు అన్ని వార్డులకు అభ్యర్ధులను నిలబెట్టకపోవడమేనని తెలుస్తోంది.

municipal elections in telangana 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News