Friday, April 26, 2024

టీమిండియా ప్రతీకారం

- Advertisement -
- Advertisement -

second ODI

 

రాహుల్ మెరుపులు రాణించిన ధావన్, కోహ్లి
స్మిత్ పోరాటం వృథా
రెండో వన్డేలో భారత్ ఘన విజయం
సిరీస్ సమం

రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 11తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య ఆదివారం బెంగళూరు వేదికగా చివరి వన్డే జరుగనుంది. ఇందులో గెలిచే జట్టుకు సిరీస్ దక్కుతుంది. ఇక, శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్షఛేదనలో ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. మరోవైపు టాప్ ఆర్డర్ రాణించడంతో భారత్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడంలో సఫలమైంది. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ లోకేశ్ రాహుల్‌లు అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్ (98) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు. మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన రాహుల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

శుభారంభం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లు మలుచుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఈ జోడీని వెనక్కి పంపేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. ఇటు ధావన్, అటు రోహిత్‌లు అద్భుత సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. కిందటి మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ధావన్ ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. రోహిత్ కూడా అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును 50 పరుగులు దాటించారు. కానీ, 44 బంతుల్లో ఆరు ఫోర్లతో 42 పరుగులు చేసిన రోహిత్‌ను ఆడమ్ జంపా వెనక్కి పంపాడు. దీంతో 81 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

ధావన్ సెంచరీ మిస్
రోహిత్ ఔటైనా ధావన్ తన జోరును కొనసాగించాడు. అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లి అండగా నిలిచాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను మరింత పటిష్టపరిచారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో ఆడారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకవైపు ధావన్, మరోవైపు కోహ్లి అడపాదడపా బౌండరీలతో స్కోరును పరిగెత్తించారు. అద్భుత ఫామ్‌లో ఉన్న ధావన్ ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ముందుకు సాగాడు.

కోహ్లి కూడా అద్భుత ఆటను కనబరిచాడు. ఇదే క్రమంలో ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ధాటిగా ఆడుతూ సెంచరీ దిశగా అడుగులు వేసిన ధావన్ కీలక సమయంలో వికెట్‌ను పారేసుకున్నాడు. 90 బంతుల్లోనే ఒక సిక్స్, మరో 13 ఫోర్లతో 96 పరుగులు చేసిన ధావన్‌ను రిచర్డ్‌సన్ ఔట్ చేశాడు. దీంతో ధావన్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ మరోసారి నిరాశ పరిచాడు. 17 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.

కోహ్లి కెప్టెన్సీ ఇన్నింగ్స్
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ కోహ్లి తనపై వేసుకున్నాడు. మరోవైపు లోకేశ్ రాహుల్ కూడా మెరుపులు మెరిపించాడు. ఇద్దరు కలిసి స్కోరును పరిగెత్తించారు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఆరు ఫోర్లతో 78 పరుగులు చేసి ఔటయ్యాడు.

రాహుల్ విధ్వంసం
మరోవైపు అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్ రాహుల్ ఈసారి కూడా మెరుపులు మెరిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో కనువిందు చేశాడు. రాహుల్ మెరుపులు మెరిపించడంతో స్కోరు వేగం పుంజుకుంది. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రాహుల్ చూడచక్కని షాట్లతో అలరించాడు. అతన్ని ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెలరేగి ఆడిన రాహుల్ 52 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో 80 పరుగులు చేశాడు. ఇక, రవీంద్ర జడేజా 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు 340 పరుగులకు చేరింది.

స్మిత్ పోరాటం
తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి వన్డేలో అజేయ శతకంతో చెలరేగిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈసారి విఫలమయ్యాడు. 15 పరుగులు మాత్రమే చేసి షమి బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 20 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ అరోన్ ఫించ్, సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తమపై వేసుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇద్దరు కుదురుకుని ఆడడంతో టీమిండియాకు మరోసారి చేదు అనుభవం తప్పదా అనిపించింది. కానీ, 3 ఫోర్లతో 33 పరుగులు చేసిన ఫించ్‌ను రవీంద్ర జడేజా వెనక్కి పంపాడు. దీంతో 62 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఫించ్ ఔటైనా స్మిత్ తన పోరాటం కొనసాగించాడు.

అతనికి లబూషేన్ అండగా నిలిచాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ జోడీని ఔట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కుదురుగా ఆడుతున్న ఈ జంటను జడేజా విడగొట్టాడు. లబూషేన్ 4 ఫోర్లతో 46 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 102 బంతుల్లో ఒక సిక్సర్, మరో 9 ఫోర్లతో 98 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రమాదకరంగా కనిపించిన స్మిత్‌ను కుల్దీప్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో స్మిత్ రెండు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తర్వాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. చివర్లో రిచర్డ్‌సన్ (24), అష్టన్ అగర్ (25) కొద్ది సేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో షమి మూడు, కుల్దీప్, సైని, జడేజా రెండేసి వికెట్లను పడగొట్టారు.

 

India won the second ODI
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News