Wednesday, June 19, 2024

సంకీర్ణం నరేంద్రుడికి కత్తిమీద సామే!

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో ఈసారి బిజెపి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి కమలం పార్టీకి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కొత్త కాదు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాడటం అందరూ చూశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా అద్భుతంగా నడిపారన్న పేరు వాజ్‌పేయి తెచ్చుకున్నారు. అయితే నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా కొత్త. సంకీర్ణ ప్రభుత్వంలో తప్పకుండా కొన్ని ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఉండి తీరతాయి. ఈ ఒడిదుడుకులు, ఒత్తిళ్లను నరేంద్ర మోడీ భరించకతప్పదు. అవసరమైతే పాత నిర్ణయాలపై పునరాలోచన కూడా నరేంద్ర మోడీ చేయక తప్పదు.

తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బిజెపి పార్టీ నాయకులకు షాక్ ఇచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం కమలం పార్టీకి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి సీట్లు రాకపోవడమే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు రావాలి. అయితే కమలం పార్టీ 240 సీట్లు దాటలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనివార్యంగా ఎన్‌డిఎ కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ, నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జెడి(యు) పై కమలం పార్టీ ఆధారపడక తప్పడంలేదు. 2001లో నరేంద్ర మోడీ తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత రాజకీయంగా ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2001 నుంచి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ తనకు తాను స్వంతంగా మెజారిటీ సాధించడంలో ఏ ఎన్నికల్లోనూ విఫలం కాలేదు. 2014 అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో కమలం పార్టీ స్వంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించింది. అయితే నరేంద్ర మోడీ హవాకు తాజా లోక్‌సభ ఎన్నికలే బ్రేకులు వేశాయి.

త్వరలో మోడీ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఒక పార్టీ లేదా ఒక నాయకుడితో నడిచేది కాదు. ఎన్‌డిఎ కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాల మద్దతుతో నడవాల్సిన అనివార్య పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దీంతో తప్పకుండా కొన్ని ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఉండి తీరతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, సదరు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడానికి అవసరమైన నైపుణ్యాల విషయంలో నరేంద్ర మోడీ ఈసారి అగ్నిపరీక్ష ఎదుర్కోబోతున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో గతంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలను స్వంతం చేసుకున్న సందర్బాల్లో సదరు గెలుపునకు కారణాలు ఆయన రాజకీయ చాతుర్యం, నైపుణ్యమేనన్న ప్రచారం ఉధృతంగా సాగింది. లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఆయన ఎదుర్కొంటారన్న పేరు మోడీ తెచ్చుకున్నారు. అయితే గత పదేళ్లుగా నరేంద్ర మోడీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భాగస్వామ్య పక్షాలు ఒత్తిడి తీసుకువస్తే సదరు నిర్ణయాలపై పునరాలోచన చేయవచ్చు.

అవసరమైతే నరేంద్ర మోడీ వెనక్కి తగ్గవచ్చు. సంకీర్ణ ప్రభుత్వంలో ఇవన్నీ సాధారణ విషయాలే. గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు పేదలకు, అలాగే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఏమాత్రం అనుకూలం లేవన్నది అందరి మాట. 2014 నుంచి సంపద, ఆదాయాల్లో పెద్ద ఎత్తున అసమానతలు పెరిగాయి. నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగింది. యువతకు టెంపరరీగా సైన్యంలో ఉద్యోగాలు ఇవ్వడానికి అగ్నిపథ్ పథకం తీసుకువచ్చింది నరేంద్ర మోడీ సర్కార్. నిరుద్యోగ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతకు ఉదాహరణే అగ్నిపథ్ పథకం. పేద వర్గాలకు ఐదు కిలోల ఉచిత రేషన్ ఇస్తే చాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాలు భావించాయి. అయితే ప్రజలు తమకు ఉద్యోగాలు కావాలని అడిగారు. చదువుకున్న యువతకు కొలువులు కల్పించాలని కోరారు. అయితే జనం ఆవేదనను మోడీ సర్కార్ పట్టించుకోలేదు. అంతేకాదు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి.

జిఎస్‌టి విధానంతో రాష్ట్రాల ఆదాయం తగ్గింది. అన్నదాతల సమస్యలను బిజెపి ప్రభుత్వాలు గాలి కొదిలేశాయన్న విమర్శలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా రైతులు ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ మద్దతు ధరకు ఇప్పటివరకు చట్టబద్ధత కల్పించలేదు. నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల ప్రచారంలో గత పదేళ్లకాలంలో తమ ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా ప్రయోజన కార్యక్రమాల గురించి ఎక్కడా చెప్పలేదు. అంతేకాదు రాబోయే ఐదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తాము నిర్దేశించుకున్న లక్ష్యాల గురించి కూడా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ముస్లిం వ్యతిరేక ప్రచారమే తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని నరేంద్ర మోడీ బలంగా నమ్మారు. అదే నమ్మకంతో ఆయన ముందుకెళ్లారు. అయితే ముస్లిం వ్యతిరేకత ఎక్కడా వర్క్ అవుట్ కాలేదు. కిందటిసారి ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 79 సీట్లు ఇచ్చిన ఉత్తరప్రదేశ్‌లోనూ ముస్లిం వ్యతిరేక అంశం ఓట్లు రాల్చలేకపోయింది. పైపెచ్చు బలహీన వర్గాలు సమాజ్‌వాదీ పార్టీ వైపు పోలరైజ్ అయ్యాయి. అంతిమంగా ఉత్తరప్రదేశ్‌లో బిజెపి సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఏమైనా ఈసారి భాగస్వామ్య పక్షాలతో మంచీ చెడూ చర్చించి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లారు నరేంద్ర మోడీ.

ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News