Wednesday, April 24, 2024

నేను ఇక్కడి భూమినే… ఒక Rightful Anger and Agony

- Advertisement -
- Advertisement -

Poetry is the lifeblood of rebellion, revolution, and the raising of consciousness.
Alice Walker
ఒక కవి మనసు స్థిరంగా ఎప్పుడూ వుండదు.ఏదొక సామాజిక అనిశ్చితి మనసును తొలుస్తూ వుంటుంది. ఆ disturbanceని ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తం చేస్తారు.వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి వారి వ్యక్తీకరణను బట్టి ఇది వుంటుంది.ఒకరు లావాలా బద్దలయితే.. మరొకరు పూలచేతులతో చెంపదెబ్బ వేస్తారు. ఒకరు మామూలు మాటలతో ఏజ్యం ఆడుతూనే చివరికి చమత్కారంగా చురుక్కుమనిపిస్తారు.

శిలాలోలిత గారి కవితారీతి ప్రత్యేకమైనది.చాలా గంభీరమయిన విషయాన్ని మామూలు మాటలతో ప్రారంభించి చివరలో పాఠకుల్ని తన భావచిత్రాల జాలంలో తను చెప్పదలుచుకున్నది చెప్పడం, సున్నితంగా అర్థం చేయించడం వుంటుంది. చాలా మామూలు మాటలు… చేయి పట్టుకొని అలా తీసుకెళ్ళి, అకస్మాత్తుగా ఒక జిగేల్మనే కవితావాక్యంతో మిరుమిట్లు గొలిపి,మొత్తం కవిత అంతా వెలిగించడం ఆమె పద్దతి. గాలోడు కవితలో ‘ఏకం కావడం ఒక్కటే అంతిమ నినాదం’ అన్న ఆఖరి వాక్యం వెలుగులో ముందటి వాక్యాలు మెరవడం దీనికి ఉదాహరణ.అన్ని కవితలు ఇలాగే వుంటాయని కాదు గానీ చాలామటుకు ఆమె కవిత్వం ఇలాగే వుంటుంది.ఒక మొండివాడైన పిల్లాడు కూడా అమ్మలా చెప్పే ఈ మాటలు శ్రద్ధగా వినేటట్టు.
‘నేను ఇక్కడి భూమిని’ కవితా సంపుటిలో శిలాలోలిత గారు సామాజిక దురంతాలు అన్నీ తనలో మోస్తూ..

మసులుతూ..ఒక్కొక్క అక్షరంగా మలుపుతూ..తన గుండెలో మెదిలే ప్రతి విషయాన్ని నమోదు చేసే,వాఖ్యానం చేసే ప్రయత్నం చేసారు.ఆమె దృష్టిని దాటి పోని వస్తువు లేదనడం అతిశయోక్తి కాదు.కాకపోతే ఆమెది తనదైన స్త్రీత్వ దృష్టి.ప్రతి విషయమూ తన స్త్రీ దృక్కోణం నుంచే వ్యక్తపరుస్తుంది.స్త్రీ పక్షపాతి గానే మాట్లాడుతుంది.
స్త్రీ లోకమ్మీద ఈ లోకాన జరుగుతున్న ప్రతి అన్యాయం మీద తన న్యాయమైన వాదన వినిపిస్తుంది.కళ్లపడిన , తనని కదిలించిన ప్రతి సంఘటనను,ఆలోచనను, అనుభూతిని అక్షరంలోకి మార్చే విద్యను అనాయాసంగా ప్రదర్శిస్తుంది.
మొదటి కవితే ఆమె పుస్తకం లోకి అరికాళ్ల మాట ‘రక్తసిక్త పాదం’తో గా నడిచొచ్చింది.రైతులు చేసిన లాంగ్ మార్చ్‌ని ‘ఎర్ర సంతకమయి కదిలిన మహాసేనకే లాల్ సమామ్! లాల్ సలామ్ !’

అని వాళ్లని అక్కున చేర్చుకున్న మానవ బంధాలు అన్నిటికి లాల్ సలామ్ చెబుతూ జీవితంలో ఆశను చిగురింపజేసుకున్నారు. / ‘ఎంతని ఓదార్చుకోవడం ఇలా !/ ఓదార్పులన్నీ ఓడిపోతున్న ఈ సందర్భంలో/ అన్ని తాత్వికతలు చెరిగిపోయి/ శూన్యమే మిగులుతోంది అంతటా -’ అని కొన్నేసిసార్లు నిస్పృహ చెందినా, డీలా పడినా మళ్లీ తమాయించుకొని…/ ‘కనిపించే వాళ్లతోనే యుద్దాలు చేసాం/ కనిపించని వాళ్లతో ఒక లెక్కా -/ జయం మనదే/ బతుకూ మనదే/ జాగురూకత మనదే/ ధైర్యం మనదే/ విజయం మనదే’ అని మరలా శక్తినీ,స్ఫూర్తిని కూడదీసుకుంటారు.సంభాళించుకుంటారు.

బాలికల పట్ల,స్త్రీల పట్ల జరుగుతున్న వివక్షకి, హింసకి, అత్యాచారాలకి కవయిత్రి ఎంతగా చలించిపోయారంటే దేశంలో జరిగిన ప్రతి సంఘటన ఒక ఆవేదనాత్మక కవితా రూపం పరవళ్లు తొక్కింది.క్రోధాగ్నిని కక్కింది.ఇంటా, బయటా జరుగుతున్న ఈ అమానవీయ ఘటనల పట్ల కన్నెర్ర చేసింది.వస్తువు అభివ్యక్తి రూపం తీసుకునేప్పుడు ఆయా విషయ సారాంశం ప్రస్ఫుటంగా,సూటిగా వ్యక్తమయ్యే కవితా రూపం తీసుకోవడం గమనార్హం. ఇది వస్తువు తన రూపాన్ని ఎన్నుకోవడమే తప్ప ప్రయత్నపూర్వకంగా జరిగింది కాదని అనుభవం గల పాఠకునికి ఇట్టే తెలిసిపోతుంది.దానికి సాక్ష్యంగా అనేక కవితలు ఈ పుస్తకం నిండా పొందుపరిచి వున్నాయి. ‘యస్మిన్’ అలాంటి కవిత. వస్తువుని నిర్వహించడం లోనూ, భిన్నశైలిని ప్రదర్శించడంలో ఈ కవిత సఫలమయ్యింది. బేటీ బచావ్, మృదులలు, నిప్పుల సేద్యం, ఏదైనా చేయాలి,

పగుళ్లు, కొత్త దేహపటం, ఆమె ఎక్కడ, సాధికార స్వరం, మనకు మనమే ఆయుధాలం, ప్రశ్నించే నువ్వెవరివసలు లాంటి కవితలు ఈ విషయాలను దట్టించి సంధించిన కవితలే. చిన్ని వయసులోనే అత్యాచారాలకు గురవుతున్న బాలికలు,వివాహ వ్యవస్థ లో లైంగిక హింసకు గురవుతున్న స్త్రీలు,వివక్షకు,అసమానతలకు గురవుతున్న తీరు, ఈ వికృత సమాజాన్ని ఎదుర్కోవలసిన అవసరత.. అన్నీ ఈ కవితల సారాంశాలు.
ఒక సామాజిక బాధ్యత గల స్త్రీ గా కూడా శిలాలోలిత గారు

చేవ వున్న కవిత్వం రాసారు.కరోనా కాలపు మిత్తవని, ఆపదని కవిత్వంగా మలచారు. దేశంలో చెలరేగుతున్న అప్రజాస్వామిక పోకడలను ఎండగట్టారు. ‘ఇప్పుడు మనుషులెవరని ప్రశ్న/ ఇప్పుడు ఉనికి ఏమిటని ప్రశ్న/ ఇప్పుడు నువ్వెవరని, నేనెవరని ప్రశ్న/ ఇన్ని ప్రశ్నల మధ్య – అనుమానాల మధ్య/ ఒకే ఒక్క జవాబు -/ నేను మనిషిని/ నేను ఆకాశాన్ని/ నేను ఇక్కడ గలగల పారుతున్న సెలయేరును/ నా ఉనికి ఇదే/ నేనే ఈ భూమిని, ఇక్కడి భూమిని’ /అనే ఈ rightful anger వెనుక,agony వెనుక వర్తమాన పరిస్థితి పట్ల కవిలో ఎగసిపడే అసహనం వుంది.తన ఉనికి ప్రశ్నార్థకం కావడం పట్ల ఆశ్చర్యము, విచారము వుంది.కాళ్ల కింద నేల కదలడం పట్ల,నేల నీది కాదు అనే ఉనికిని చెరిపివేసే రాజ్య దుర్భుద్ది పట్ల నిరసన,ఆగ్రహం, వేదన వుంది.ఈ ఉపమల వెనుక తాను నడచిన భూమి, తొడిగిన ఆకాశం నాదే..నేనే అనే నిర్భయ ప్రకటన వుంది.తన సమూహాన్ని తనే ప్రతిఫలించడం వుంది.ఈ నిర్భీతి దేశంలో ఎన్నడూ బయటకి రాని ఎందరో ముస్లిం స్త్రీలు చేసిన షాహీన్ బాఘ్ ఉద్యమ ప్రతిఘటనలో కనిపించింది. ఎందరితోనో తిరుగుబాటు సాహిత్యం రాయించింది.’నేను ఇక్కడ భూమిని’ అనే ఈ కవిత,పుస్తకానికి శీర్షికగా పెట్టిన ఈ కవిత NRC,CAA మీద నిరసన,ఆగ్రహం ప్రకటించిన మళయాళీ కవి Ajmal khan రాసిన Native Son and Mother Land కవితని,డోగ్రి కవయిత్రి పద్మ సచ్ దేవ్ రాసిన కవితలని గుర్తుకు తెచ్చింది.ప్రాంతమేదయినా, సంస్కృతి ఏదైనా కవుల హృదయ స్పందనలు, భావోద్వేగాలు ఒకటే అని ఈ ప్రతిఘటనాత్మక కవిత్వం నిరూపించింది.

స్త్రీ శీర్షికతో 1 నుండి 9 కవితలు రాసారు. ఒక్కొక్క కవిత ఒక్కొక్క స్త్రీ జీవిత సందర్భం. దేనికదే ప్రత్యేకం. స్త్రీ- 8 చదవండి. / ‘సహ ప్రేమికులై/ సహ జీవికలై/ సహజంగా నడవాలె గాని/ సమాన బరువు మోయాలె గాని/ ఎలపట దాపట గిత్తల్లా కాదు/ సమాజపు బండి అప్పుడు తిరగబడక తప్పదు. / విరిగి తునాతునకలైన బండితో/ ఏ వ్యవసాయదారులూ/ బతుకు సేద్యం చేయలేరు’/ అనడంలో స్త్రీ వాద అసలు సూత్రం కనపడుతుంది. పురుషులలోని పురుషాధిక్యత ను ఎదుర్కోవడానికి సమస్య పట్ల సమదృష్టి వుండాలని చెప్పే ఈ విధానం వల్లనే మార్పు సాధ్యం. తమ ఆత్మ గౌరవం కాపాడుకుంటూనే స్వీయ కౌటింబిక అరమరకల్ని ఇటువంటి అవగాహనా పటిమ,సమ్యక్ దృష్టి, కార్యదక్షతతో సరిచేసుకోవచ్చునని ఒక మార్దవ అనునయ స్వరంలో చెప్పే ప్రయత్నం చేసారు.

హైదరాబాదు ని ముంచెత్తిన వరదల నేపథ్యంలో రాసిన ’మనసు కురుస్తోంది’ కవిత పొదుపైన మాటల్లో పదునుగా/ రాజ్యాన్ని నగ్నంగా ఎలా చూపెట్టవచ్చో చూయించింది./ ‘వెయ్యికాళ్లతో నీళ్లు/ ముంచెత్తుతున్నాయి./ శరీరపు మట్టిగోడలు/ కూలిపోతున్నాయి./ ఆకలి కాగడాలా కోరలు చాస్తూ/ మండుతోంది./ చెరువులు ఇళ్లల్లో ఈదుతున్నాయి./ ఎప్పటికీ వలలో చిక్కని/ పెద్దచేపలు బాజాప్తాగా/ తిరుగుతున్నాయి.’ / ఒక్క పదమూ పక్కకు జరపడానికి వీల్లేని ఈ కవిత రూపంలో చిన్నదైనా సారంలో మిన్నది.దీనికి వివరణలు,వాఖ్యానాలూ చేసి కవితను చిన్నబుచ్చలేము.
Howard Nemerov అన్నట్లు ’It may be said that poems are in one way like icebergs: only about a third of their bulk appears above the surface of the page.’ ఈ మాటలు ఈ కవితకు చాలా బాగా వర్తిస్తాయి.చెప్పినదాని కంటే చెప్పనిదే ఎక్కువ.ఆ అనుభూతి భారాన్ని,కన్నీళ్ల చిక్కదన వేదనని మన మీద మోపే కవితే ఇవి.

ఈ పుస్తకం నిండా తన చుట్టూ వున్న మనుషుల గురించి, కనుమరుగయిన మనుషుల గురించి తలచి వారి మానవీయ జీవికను బొమ్మ కట్టిన కవితలు వున్నాయి. పసిప్రాయంలోనే కామాంధుల పాలపడిన ఆసీఫా గురించి ‘చావుపాట’లో కనిపించని నొప్పితో విలవిలలాడినా.. చావెప్పటికీ పరిష్కారం కాదని, ‘మెదడే శత్రువు’ కవితలో వి6 యాంకర్ రాధికారెడ్డి మృతికి బాధపడ్డా…‘శిఖరం నేల రాలింది’ అని ధైర్యం ఒరలోంచి నీ నెత్తుటి విత్తనాలు మొలకెత్తుతూనే వుంటాయి అని గౌరీ లంకేష్ మరణాన్ని తలపోసినా…‘గాయాల వర్షంలో అతడు’ అని అలిశెట్టి ప్రభాకర్ స్మృతి ని తలుచుకున్నా…అరుణోదయ రామారావుని స్వేచ్ఛ కోసం రెక్క విప్పిన ’పక్షిపాట’గా భావించినా..సగభాగాన్ని కోల్పోయిన ఒంటరి వృక్షంలా అతడు అని తనలో సగభాగం రాజ్యలక్ష్మిగారు లేని దేవిప్రియ గారిని ’ ఆమె లేని అతడు’ అని నిట్టూర్చినా.. మనిషిని బంధించామనుకుంటారు/ప్రశ్నను బంధించగలరా? అని వరవరరావు గారిని గోడల్ని,ఊచల్ని దాటి ’ రెపరెపలాడే జెండా’ అని ఆయన ధృడ సంకల్పానికి సంఘీభావం తెలిపినా..అనుకోని దుఃఖం నుంచి, ’గాజుగోడ’ల్ని బద్దలు కొట్టి బయటపడాలని ఆర్. ఎమ్.ఉమామహేశ్వరరావు ని కోరుకున్నా..’ నాన్న కోసం’ ’నాన్నా’అని నాన్నను కలవరించినా.. కత్తి మహేష్ గురించి అనుకున్న వెంటనే అతని ’ మాటల ప్రతిధ్వని’ తనలో వినిపించినా..కవికి మరణం లేదు అని ’ సైదాచారి స్మృతి గీతం’ రాసినా…ఆయా వ్యక్తులలో అజరామరంగా నిలిచే ఆదర్శాలకు,ఆచరణకు ఆకర్షితమై వారి ఫలవంతమైన జీవన మార్గాన్ని,వారి ఉత్తమ మానవ సంవేదనల్ని నమోదు చేసారు. తనను ఆవరించివున్న మేలిమి మానవుల మిసిమి తలపులని ఈ రీతిగా అక్షరబద్ధం చేసి వాటికి ఏదొక మేరకు శాశ్వతత్వాన్ని ఇవ్వబూనడం అరుదైన విషయం.తన పక్కన సంచరించే స్నేహసమూహాలను ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం ఒక తడిహృదయం వున్న కవికే సాధ్యం.

శిలాలోలిత గారి కవిత్వం గురించి చెపుతూ నరేష్కుమార్ సూఫీ ‘అదొక సామూహిక దుఃఖ ప్రకటన.పదునైన రాళ్లని ఒరుసుకుంటూ పారే నదీ ప్రవాహం.కోపాన్ని, ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని ఇంత సున్నితంగా వెలిబుచ్చడం అందరికీ సాధ్యం కాదు‘ అనడం మంచి పరిశీలన. చివరలో వాహెద్ భాయ్ ’ కొత్త తలుపులు తెరిచే కవిత్వం’ అంటూ ఆశ్చర్యపరిచారు.శిలాలోలిత గారి కవిత్వంలో భావచిత్రాలను మిగతా భారతీయ కవయిత్రి కమలాదాస్ తోనూ,విదేశీ కవయిత్రులు మార్గరెట్ అట్వుడ్ ,మాయ ఏంజిలో లాంటి కవయిత్రుల కవితలతో సోదాహరణంగా వివరించారు.ఆశ్చర్యంగా ఆయన ఎన్నుకున్న శిలాలోలిత గారి కవితా పంక్తులు, నేను ఎన్నుకున్న కవితా పంక్తులు సుమారుగా ఒకటే అవడం కవుల ఆలోచనల wave length రమారమి ఒకటిగానే వుంటుందని సూచిస్తుంది.

ఆమె ధోరణి జలపాత సవ్వడి కాదు.ప్రశాంతంగా ప్రవహించే నది. నదిలో అలజడులు ఉండవని కాదు.అన్నింటిని దాచుకొని ఎన్నడూ ఎండిపోని కవితానది.తనలోని తడి తను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న ప్రతి మట్టిరేణువుకు అంటించడం తన సహజాతం. James Liddy ‘ The poet has a peculiar duty; he/ she has to create other poets.We can not let talent die without walking ‘అని అనినదానినే శిలాలోలిత గారు తనదైన తరహాలో ఇలా అన్నారు./ ‘కొత్త నీటికీ/ కొత్త బతుకులకీ/ కొత్త ప్రేమమయ లోకాలకీ/ మనం కాక ఇంకరవరు పూనుకుంటారు?’/ తనలో అంతర్నిహితంగా ప్రజ్వరిల్లే దీపజ్వాలని తన ముందు తరాల నుంచి తాను అందుకున్నట్లే..తర్వాతి తరాలకు ఆ దివిటీని అందించాల్సిన బాధ్యత వెన్నంటి వుంది కాబట్టే ఈ మాటలు అనగలిగారు.ఆ జ్వాల, ఆరని జ్వాలగా ప్రతి ఒక్కరిలో వెలగాలని ఆమె కోరుకుంటున్నారు.
When truth has no burning, then it is philosophy. When it gets burning from the heart, it becomes poetry. —– Muhammad Iqbal

పుస్తకం : నేను ఇక్కడి భూమిని
కవయిత్రి : శిలాలోలిత
ప్రచురణ : కవి సంగమం
వెల : 150/-
లభ్యత : నవోదయ బుక్ హౌస్
నవ తెలంగాణ బుక్ హౌస్
ప్రజాశక్తి బుక్ హౌస్
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ స్టోర్స్

పి.శ్రీనివాస్ గౌడ్
9949429449

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News