రాష్ట్రంలో 190 కేంద్రాలలో పరీక్ష నిర్వహణ
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు
ఉ.11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలి
బూట్లు వేసుకుని రావద్దు…చెప్పులతోనే రావాలి
గతేడాది అనుభవాల దృష్టా ఈసారి పక్కా ప్రణాళిక
మనతెలంగాణ/హైదరాబాద్ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం(మే 4) దేశవ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2025) నీట్ పరీక్ష జరుగనున్నది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22.7 లక్షల మంది హాజరుకానుండగా, రాష్ట్రం నుంచి నుంచి 72,507 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాల్లో 5,453 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నీట్ యుజి ప్రవేశ పరీక్ష నిర్వహణకు 190 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 62 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో 26 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
ఇంగ్లీష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెస్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. నీట్ పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల బయో మెట్రిక్ హాజరు తీసుకోవడానికి, సరిపడా బయో మెట్రిక్ మిషన్లను సమకూర్చారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా, ఒక పోలీస్ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను, మౌలిక సదుపాయాలైన తాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ల సమన్వయంతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. నీట్ యుజి పరీక్ష నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది.
ఈ ఏడాది 180 ప్రశ్నలు
నీట్ పరీక్షలో 180 ప్రశ్నలు ఉంటాయి. అన్ని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. 180 ప్రశ్నలలో 45 ప్రశ్నలు ఫిజిక్స్ సబ్జెక్టు నుంచి, 45 ప్రశ్నలు కెమిస్ట్రీ నుంచి, బాటనీ(బయాలజీ, జువాలజీ సబ్జెక్టులు) నుంచి 90 ప్రశ్నలు ఇస్తారు. ఒక తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గుతుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి.. కచ్చితంగా తెలిసిన సమాధానాలే రాయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పెన్ను పరీక్షా కేంద్రంలోనే ఇస్తారు
నీట్ యుజి పరీక్షకు పలు నిబంధనలు, ఆంక్షలను ఎన్‌టిఎ ఇప్పటికే ప్రకటించింది. అడ్మిట్ కార్డుతో పాటు పాస్ పోర్టు సైజు ఫొటో, ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. నీట్ పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును కేంద్రంలోనే ఇస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లనీయరు. ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్‌లు, హెయిర్ పిన్, హెయిర్ బ్యాండ్, తాయత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్లు, హెల్త్ బ్యాండ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ఎన్‌టిఎ స్పష్టం చేసింది.
డ్రెస్ కోడ్ నిబంధనలివే
నీట్ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. అబ్బాయిలైనా , అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్లు వేసుకోవద్దు. అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. స్లిప్పరు, తక్కువ హీల్ ఉండే సాండిల్స్ మాత్రమే వేసుకుని రావాలి. వ్యాలెట్, పౌచ్, గాగుల్స్, టోపీలు, హ్యాండ్ బ్యాగులు వంటివి తీసుకురావొద్దని ఎన్‌టిఎ తెలిపింది.
నకిలీ ప్రచారం చేస్తే చర్యలు: ఎన్‌టిఎ హెచ్చరిక
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యుజి పరీక్షను పకడ్బంధీగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఏర్పాట్లు చేసింది. గతేడాది నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణలతో తీవ్ర దుమారం నెలకొన్న నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఈసారి నీట్ యుజి నకిలీ ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. నీట్‌కు సంబంధించి ఏదైనా అనుమానాస్పద, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను గుర్తిస్తే వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేలా ఓ కొత్త ప్లాట్‌ఫాంను రూపొందించారు. ఈ పరీక్షకు సంబంధించి విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించే ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్‌టిఎ సూచించింది. నీట్ యుజి పరీక్ష పేపర్ యాక్సెస్‌ని క్లెయిమ్ చేసేలా అనధికార వెబ్‌సైట్‌లు/సోషల్ మీడియా ఖాతాలు; పరీక్ష కంటెంట్ యాక్సెస్‌కు సంబంధించి క్లెయిమ్ చేసే వ్యక్తులు; ఎన్‌టిఎ లేదా ప్రభుత్వ అధికారులమని చెప్పే వారికి సంబంధించి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను ఈ పోర్టల్ https://neetclaim.centralindia.cloudapp.azure.com/ ద్వారా నివేదించవచ్చని సూచించింది. ఈ ఫారమ్ చాలా సరళంగా ఉంటుందని, యూజర్లు తామేం గమనించారో, ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలిపేందుకు వీలుగా సంబంధిత ఫైల్‌ను సైతం అప్‌లోడ్ చేసే వీలుందని తెలిపింది. అనుమానాస్పద క్లెయిమ్‌లపై రిపోర్టు చేసేందుకు ఈ పోర్టల్ మే 4న సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఎటిఎ పేర్కొంది.