Wednesday, April 17, 2024

మోడీ… భయాలు!

- Advertisement -
- Advertisement -

స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని అంతుబట్టని ఓ భయం వెంటాడుతున్నట్లు వెల్లడి అవుతుంది. గత సంవత్సర కాలంగా జరిపిన పలు ఎన్నికల సర్వేలు బిజెపికి గట్టి పోటీ ఇవ్వగల రాజకీయ పార్టీగాని, కూటమి గాని లేవని స్పష్టం అవుతున్నది. అంతేకాదు, ప్రజాదరణతో ప్రధాని నరేంద్ర మోడీకి పోటీపడ గల నాయకుడు కూడా కనిపించడం లేదు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ‘ఇండియా’ కూటమి గత డిసెంబర్‌లో ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం గాలి బుడగ మాదిరిగా పగిలిపోయింది. చివరకు ఈ కూటమి ఏర్పాటులో కీలక సూత్రధారిగా వ్యవహరించిన నితీశ్ కుమార్ స్వయంగా బిజెపితో తిరిగి జతకట్టారు. మరో కీలక నాయకురాలు మమతా బెనర్జీ ఎవ్వరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో గాంధీ కుటుంబం సభ్యులు దశాబ్దాలుగా తమకు కంచుకోటలుగా ఉన్నటువంటి రాయబరేలి, అమేథిల నుండి పోటీ చేసేందుకు వెనకడుగు వేయడం ద్వారా ఒక విధంగా ఈ ఎన్నికల్లో విజయానికి ఆశవదులుకున్నట్లు వెల్లడి అవుతుంది. అయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం, అంతకు నాలుగు రోజుల ముందు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేయడం గమనిస్తుంటే బిజెపిని తెలియని ఎన్నికల భయం వెంటాడుతున్నట్లు వెల్లడి అవుతుంది. ఎన్‌డిఎ 400కు పైగా సీట్లు గెలుస్తుందని ఎంతో ధీమాగా చెబుతున్నా 2014, 2019 ఎన్నికల నాటి భరోసా ఆ పార్టీ అగ్రనాయకులలో కనిపించడం లేదు. ముఖ్యమంత్రులుగా పని చేసిన వారే సీట్ ఇవ్వకపోయేసరికి అస్త్రసన్యాసం చేస్తుండటం సరికొత్త పరిణామాలను వెల్లడి చేస్తున్నది. గత నెలలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ను అరెస్ట్ చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులను, ఇతర పార్టీలకు చెందిన నాయకులను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను చూపి బెదిరించి తమ పార్టీలో చేరేటట్లు వత్తిడి చేస్తున్నారు.

వారిని ఎన్నికలలో అభ్యర్థులుగా కూడా నిలబెడుతున్నారు. ఎప్పుడో బంధం తెంచుకున్న టిడిపి, అకాలీదళ్, బిజెడి వంటి పార్టీలను తిరిగి దగ్గరకు చేర్చుకునేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఒకటి, రెండు నియోజక వర్గాలకు మాత్రమే ప్రభావం చూపే చిన్న చిన్న పార్టీలను సైతం దగ్గరకు తీస్తున్నారు. ఒక్క సీటును కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమనే సంకేతం ఇస్తున్నారు. బహుశా మొదటిసారిగా బిజెపి అభ్యర్థుల జాబితాలో అత్యధికంగా ఇతర పార్టీల నుండి వచ్చిన ఫిరాయింపుదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు మాది ‘విలక్షణమైన’ పార్టీ అని గర్వంగా చెప్పుకునే బిజెపి నేతలు, ఇప్పుడు తమకు ఏదో విధంగా సీట్లు గెలవడమే ముఖ్యం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు బిజెపితో పొత్తుకోసం పలుప్రాంతీయ పార్టీలు ఆరాటం చెందుతూ ఉండెడివి. కానీ ఇప్పుడు బిజెపి అగ్రనాయకులు ఆ పార్టీల వెంటబడి పొత్తులకు ఆరాటం చెందుతున్నారు.

గత రెండు ఎన్నికలలో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందేందుకు అవసరమైన సీట్లు కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాలలో అసహనం కనిపిస్తున్నది. ఆ పార్టీ ఎక్కడ తలెత్తుకు తిరుగుతుందో అనే భయం వ్యక్తం అవుతుంది. చివరకు నోటాతో పోటీ పడే ఓట్లు మాత్రమే గల ఆంధ్రప్రదేశ్‌లో సైతం అక్కడ అధికారంలో ఉన్న వైసిపి మీదకన్నా కాంగ్రెస్‌పై ఎక్కువగా విమర్శలు గురిపెట్టారు. అంతేకాదు, కాంగ్రెస్‌తో ఎవ్వరు చేతులు కలిపేందుకు సిద్ధ్దమవుతున్న వారి పట్ల కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు సైతం ఆయన నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకోవడమే కారణాన్ని అందరికీ తెలుసు. కాంగ్రెస్‌తో చేతులు కలపకపోతే తనను దర్యాప్తు ఏజెన్సీలు ఏమీ చేయవని కొందరు బిజెపి నేతలు రాయబారం నడిపారని స్వయంగా కేజ్రీవాల్ చెప్పారు. ఆయన మాటలను బిజెపి నేతలు ఎవరూ ఖండించనే లేదు. ఎందుకంటే, బిజెపికి దాదాపు సగం సీట్లలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ప్రాంతీయ పార్టీలను దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించో, మరో విధంగానో దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పుంజుకోవడం అంటే బిజెపికి బలహీనం కావడం అవుతుంది.

అందుకనే కాంగ్రెస్ ఉనికిని తట్టుకోలేకపోతున్నారు. ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను ఎన్నికల సమయంలో స్తంభింపచేసి రోజువారీ ఖర్చులకు సైతం ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడేటట్లు చేయగలిగారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీపై రాజకీయంగా బిజెపి ఎంతగా పోరాటం చేస్తున్నా, తీవ్రమైన చర్యలకు దిగకపోవడానికి కారణం ఆమె కాంగ్రెస్‌ను దూరంగా ఉంచడమే. కేజ్రీవాల్, మాయావతి, అసదుద్దీన్ ఒవైసి వంటి వారు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల ఓట్లను చీల్చి బిజెపి అభ్యర్థుల గెలుపుకి పరోక్షంగా సహకరిస్తూ వచ్చారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు కుదుర్చుకొంటే, బిజెపి నుండి వచ్చిన వత్తిడుల కారణంగా బి ఎస్‌పి అధిష్టానం వెనుకడుగు వేసిందని, అందుకనే ఆ పార్టీ నుండి బైటకు వస్తున్నానని తెలంగాణ అధ్యక్షునిగా పని చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం.కేజ్రీవాల్ ఎన్నికలలో పెద్ద ఎత్తున అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా గోవా, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పలు సీట్లను కోల్పోవలసి వచ్చింది.
కానీ ఇప్పుడు కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో సీట్లు సర్దుబాటు చేసుకోవడం

బిజెపికి ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా సాధారణ ప్రజల సాధికారికతకు దారితీసే విధంగా పరిపాలన అందించడంలో కేజ్రీవాల్ పరోక్షంగా ప్రధాని మోడీకి నిత్యం సవాల్ విసురుతున్నారు. భావోద్వేగ అంశాలలో, భారీ పథకాల అమలులో, అంతర్జాతీయంగా తిరుగులేని నాయకుడని ప్రచారం కల్పించుకోవడం ద్వారా బలమైన నాయకుడిగా మోడీని ప్రజలు గుర్తిస్తున్నా, సుపరిపాలన విషయంలో ఆశాభంగం కలిగిస్తున్నారు. ముఖ్యంగా మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించడంలో, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో ఆయన ప్రభుత్వం చెప్పుకోదగిన కృషి చేయలేకపోతున్నది. అదే సమయంలో దేశంలో ఆర్థ్ధిక అసమానతలు పెరిగిపోతున్నాయి. భారత దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా వెలుగొందుతున్నా సాధారణ ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలలో చెప్పుకోదగిన మార్పు రావడం లేదు. అయితే, కేజ్రీవాల్ దేశ రాజధాని ఢిల్లీలో పేద ప్రజలకు మేలైన విద్య, వైద్య సదుపాయాలు అందించడం ద్వారా తిరుగులేని ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు. మొదటిసారిగా గత నెల రోజులుగా బిజెపి కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో పాటు, ఈ సందర్భంగా జరిగిన ఆర్థిక లావాదేవీలు బహిర్గతం చేయడం ఒక విధంగా

మోడీ ప్రభుత్వానికి ఊహించని దెబ్బ అని చెప్పవచ్చు. ఎప్పుడైనా కార్పొరేట్ సంస్థలు అధికార పార్టీకి ఎక్కువగా విరాళాలు ఇవ్వడం సాధారణ అంశమే అయినప్పటికీ, అత్యధికంగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారిలో దేశంలో సంపన్నమైన టాటా, రిలయన్స్, అదానీ, బిర్లా వంటి కంపెనీలు కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు గురయినవి, వివాదాస్పద ఆర్ధిక లావాదేవీలకు పాల్పడినవి ఉండటంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మికంగా రాజీనామా చేయడం కలకలం రేపింది. అందుకు నిర్దిష్టమైన కారణం వెలుగులోకి రాకపోయినప్పటికీ అత్యున్నత స్థాయిలో అంతా సవ్యంగా లేదని వెల్లడి అవుతుంది. తమిళనాడులో అన్నాడిఎంకె పొత్తుకు దూరంగా ఉండటం, ఒడిశాలో ఎంతగా ప్రయత్నం చేస్తున్నా బిజెడి పొత్తుకు రాకపోవడం వంటి పరిణామాలు సహితం అసహనానికి గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపీలను చీల్చి, ఆ పార్టీలలోని ఎంఎల్‌ఎలు, ఎంపిలు దాదాపు అందరూ తమ వద్దకు వచ్చేటట్లు చేసుకున్నా ప్రజా సానుభూతి మాత్రం భిన్నంగా ఉన్నట్లు ఆందోళన చెందుతున్నారు. బీహార్‌లో నితీశ్ కుమార్‌ను తిరిగి దగ్గరకు చేర్చుకున్నా

ఈ ప్రక్రియలో ఆయన ప్రజలలో అపఖ్యాతి చెందడం ఎన్‌డిఎకు ఓ విధంగా ఇబ్బందికర పరిణామమే. 2019లోనే చట్టం తీసుకొచ్చినా ఇప్పుడు ఎన్నికల ముందు అకస్మాత్తుగా పౌరసత్వ సవరణ చట్టం అమలుకు ఉపక్రమించడం సైతం కేవలం పశ్చిమ బెంగాల్‌లో ఉనికి కాపాడుకోవడం కోసమే అని తెలుస్తున్నది. కానీ ఈ ప్రక్రియలో ఇప్పటివరకు తిరుగులేని విధంగా ఎదుగుతూ వచ్చిన ఈశాన్య రాష్ట్రాలలో ప్రతికూలత ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం రాజకీయంగా ఏమేరకు ఉపయోగకారి అన్న అంశంలో సహితం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ అంశం ఎక్కువగా ఉపయోగకరంగా ఉండే ఉత్తరాది రాష్ట్రాలలో ఇప్పటికే బిజెపికి గరిష్ట సంఖ్యలో సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటిని కాపాడుకోవడమే సవాల్‌గా పరిణమించింది. మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో గత ఎన్నికలలో గెలుపొందిన సీట్లలో ఏమేరకు నష్టపోయినా వాటిని ఎక్కడ భర్తీ చేసుకోవాలి అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అందుకనే అయిష్టంగానే టిడిపి,

జెడిఎస్ వంటి పార్టీలతో చేతులు కలపక తప్పడంలేదు. తెలంగాణలో అయితే ఇప్పటి వరకు ప్రకటించిన 15 మంది అభ్యర్థులలో ముగ్గురు మినహా యితర పార్టీలనుండి వచ్చినవారే. మొన్నటి వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించి, సీటు ఇవ్వకపోయే సరికి కాంగ్రెస్‌లో చేరి కీలక పదవి పొందిన జితేంద్ర రెడ్డి వంటి వారిని చూస్తుంటే ఫిరాయింపుదారులతో బిజెపి సరికొత్త సమస్యలు ఎదుర్కొనక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News