Friday, June 9, 2023

సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసి అనుమతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసి) అనుమతి మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. ఈ మెడికల్ కాలేజీలో 100 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లో మొత్తం తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. వీటిలో ఇటీవల అసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసి అనుమతులు రాగా, తాజాగా అనుమతి ఇచ్చిన సిరిసిల్ల మెడికల్ కాలేజీతో కలిపి ఎన్‌ఎంసి అనుమతులు పొందిన వైద్య కళాశాలలు ఆరుకు చేరాయి. సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను చేపట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఫర్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (ఎంఎఆర్‌బి) అనుమతులను ఇచ్చింది.

ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ను ప్రారంభించుకొని, 100 ఎంబిబిఎస్ సీట్లకు అడ్మిషన్లను స్వీకరించనున్నారు. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి, సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు కె. తారక రామారావు సిరిసిల్ల జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్‌ని కేటాయించడంతోపాటు అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News