Monday, June 17, 2024

బిజెపి హయాంలో ప్రజల జీవితాల్లో పురోగతి లేదు

- Advertisement -
- Advertisement -

దేశ ఆర్థిక వ్యవస్థ శీఘ్రంగా వృద్ధి చెందుతోందని అంటారు
ప్రజల జీవితాల్లో మార్పే లేదు
మోడీవి ‘అబద్ధాలు, బూటకపు వాగ్దానాలు
ప్రియాంక గాంధీ ఆరోపణ

ఫతేగఢ్ సాహిబ్/ పాటియాలా : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ శీఘ్ర గతిని వృద్ధి చెందుతుంటే ప్రజల జీవితాల్లో పురోగతి ఎందుకు లేదని ఆమె నిలదీశారు. ఫతేగఢ్ సాహిబ్ కాంగ్రెస్ అభ్యర్థి అమర్ సింగ్‌కు అనుకూలంగా ప్రియాంక పంజాబ్‌లో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ ‘అధికారం కైవసం చేసుకోవడానికి ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు, బూటకపు వాగ్దానాలు చేస్తున్నారు’ అని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంపై ప్రియాంక విరుచుకుపడుతూ, దేశంలో 70 కోట్ల మంది యువజనులు నిరుద్యోగులుగా ఉన్నారని, నిరుద్యోగిత 45 ఏళ్లలో అత్యధికమని అన్నారు.

మోడీ హయాంలో ప్రభుత్వ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ‘ఆర్థిక వ్యవస్థ శీఘ్ర గతిని వృద్ధి చెందుతోందని ఆయన (మోడీ) వేదికలపై ప్రగల్భాలు పలుకుతుంటారు. ఆర్థిక వ్యవస్థ అంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లయితే, దేశంలో పురోభివృద్ధి ఉన్నట్లయితే, మీ (ప్రజల) జీవితాల్లో పురోగతి ఎందుకు లేదని అడగాలని అనుకుంటున్నాను. మీ పిల్లలు ఎందుకు ఉపాధి పొందడం లేదు?’ అని ఆమె అన్నారు. ‘మరి ద్రవ్యోల్బణం మరీ ఎక్కువగా పెరిగింది ఎందుకు? దేశంశీఘ్రంగా పురోగమిస్తుంటే ఉక్కు ఫ్యాక్టరీలు ఎందుకు మూత పడుతున్నాయి? జిఎస్‌టి విధింపు ద్వారా పరిశ్రమన ఎందుకు దుర్బలం చేస్తున్నారు?

మధ్య తరగతి కోసం, మీ వెసులుబాటు కోసం ఒక్క పథకం కూడా లేదు. పురోగతి టివిలో మాత్రమే కనిపిస్తోంది. కాని మీ జీవితాలు పురోగమించడం లేదు’ అని ప్రియాంక అన్నారు. బిజెపి ప్రజలను ఏమాత్రం గౌరవించడం లేదని ఆమె ఆరోపించారు. ‘వారు మీ సమస్యల గురించి మాట్లాడరు. ద్రవ్యోల్బణం కట్టడికి, నిరుద్యోగిత తగ్గింపునకు తాము ఏమి చేస్తున్నామో వారు చెప్పరు’ అని ఆమె విమర్శించారు. ‘భద్రంగా ఉన్నామని పంజాబ్‌లో మహిళలు ఎందుకు భావించడం లేదో వారు చెప్పరు. పంజాబ్‌లో అంత అధికంగా డ్రగ్ సమస్య ఎందుకు ఉందో వారు చెప్పరు’ అని ప్రియాంక దుయ్యబట్టారు. ప్రజల గురించి మాట్లాడేది తమ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నొక్కిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News