Sunday, December 3, 2023

జోరుగా నామినేషన్ల పర్వం

- Advertisement -
- Advertisement -

రెండో రోజు 157 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 139 అభ్యర్థులు
బాన్స్‌వాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ దాఖలు
మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నామినేషన్
గోషామహల్‌లో బిజెపి అభ్యర్థిగా రాజాసింగ్ నామినేషన్
జడ్చర్లలో తొలి ట్రాన్స్‌జెండర్ నామినేషన్ దాఖలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు 139 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. 119 నియోజకవర్గాల్లో తొలి రోజు వంద మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించగా.. శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 139 మంది అభ్యర్థులు 157 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఒకవైపు పార్టీలు బి -ఫామ్ ఇచ్చిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా.. మరోవైపు సీట్లు దక్కని ఆశావహులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శాసనసభ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో.. అభ్యర్థులు నామినేషన్ల వేసేందుకు బలగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలిరోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండో రోజూ 139 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పార్టీ శ్రేణులతో రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బిజెపి అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. హంగు ఆర్భాటం లేకుండా.. ద్విచక్ర వాహనంపై వచ్చి నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లాలో ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఇదివరకే.. మూడు నామినేషన్లు రాగా.. ఈ రోజు నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు వేశారు.

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా.. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నామినేషన్ వేశారు. పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో నామినేషన్ పత్రం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ వేశారు. హనుమకొండ జిల్లాలో రెండోరోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. వరంగల్ పశ్చిమ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్రెడ్డి నామినేషన్ వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా కోరం కనకయ్య నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి తొలి నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ అనుచరులతో కలిసి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తరఫున నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అర్మూర్ నియోజకవర్గంలో డొంకేశ్వర్ మండలానికి చెందిన న్యాలపట్ల ప్రణయ్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జుక్కల్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రజ్ఞకుమార్ నామినేషన్ వేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
జడ్చర్లలో ట్రాన్స్ జెండర్ నామినేషన్ దాఖలు..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం నుంచి తొలి ట్రాన్స్‌జెండర్ నామినేషన్‌ను దాఖలు చేశారు. శనివారం జడ్చర్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ట్రాన్స్ జెండర్ మాత జానకమ్మ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా జానకమ్మ మాట్లాడుతూ.. తమ హక్కుల కోసం అసెంబ్లీలో పోరాడేందుకు గాను జడ్చర్ల నియోజకవర్గ బరిలో నిలిచానని వెల్లడించారు.
6, 8వ తేదీల్లో భారీగా నామినేషన్లు ..
శాసనసభ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు.. ముహూర్తాల మీద నమ్మకాలున్న వారు అందుకు అనుగుణంగా సంసిద్ధమవుతున్నారు. సోమ, బుధవారం (6,8వ తేదీలు) మంచి రోజులని.. ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సోమవారం భారీగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకున్నారు.
2018లో 2,644 నామినేషన్లు దాఖాలు..
2018 శాసనసభ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు నమోదయ్యాయి. ఈ దఫా అభ్యర్థులు వారి నేరాల చిట్టాను స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఆ నేరాల వివరాలను మూడుసార్లు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని పేర్కొంది. ఒకవేళ అభ్యర్థి జైలులో ఉన్న పక్షంలో అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో నామపత్రాలు పంపాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలను ప్రారంభించి.. రెట్టింపు వేగంతో దూసుకువెళ్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Nomination 2

Nomination 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News