Wednesday, July 17, 2024

ధరల అదుపు నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్నిటా వైఫల్యాలే

- Advertisement -
- Advertisement -

Oppositions in the Rajya Sabha flagged off central govt

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
రెండు కోట్ల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారా ?
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తారా ?
ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారుస్తారా?
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భర్తీ కాని 9 లక్షల ఉద్యోగాలు
రాష్ట్రాలతో సంప్రదించకుండా నియంతృత్వ విధానాలు
ఫెడరల్ స్ఫూర్తికి ప్రమాదం తెస్తున్న కేంద్రం
రాజ్యసభలో ప్రభుత్వాన్ని ఎండగట్టిన విపక్షాలు

న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ , ఉద్యోగాల కల్పన , వ్యవసాయదారుల ఆదాయం రెట్టింపు లక్షం లోను బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బుధవారం రాజ్యసభలో ప్రభుత్వంపై విపక్షాలు ధ్వజమెత్తాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ కేడర్ రూల్స్ మార్చడానికి ప్రతిపాదించడం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా దళాల పరిధి 50 కిమీ వరకు పెంచడానికి నిర్ణయించడం తదితర చర్యల ద్వారా రాష్ట్రాల హక్కుల్లో జోక్యం చేసుకుంటూ కేంద్రం అతిక్రమిస్తోందని విపక్షాలు ప్రభుత్వంపై దండెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు బుధవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చేసిన వాగ్దానంతో అనేక వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీ దాదాపు గంటసేపు పాల్గొని ఉండగా ఆయన సమక్షం లోనే ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ సంస్కరణలు,సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ఉపన్యాసాలు చేయడమే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. మీరు చేసింది తక్కువ.

ప్రచారం మాత్రం ఎక్కువ. మీరు ఒక అబద్ధం వెంట మరో అబద్ధం మాట్లాడుతున్నారు. మీ వైఫల్యాలను విపక్షాలు ఎత్తి చూపితే మీరు మతం ప్రమాదంలో పడిందని ఆరోపిస్తున్నారు అని ఖర్గే తీవ్రంగా మండి పడ్డారు. పెట్టుబడులు లేకపోవడంతో ఉద్యోగావకాశాలు కోల్పోతున్నాయి. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. మంచి రోజులు ఎక్కడ ? అని ప్రశ్నించారు. కొవిడ్ సంక్షోభంలో వలస కార్మికులకు వరంగా చెప్పుకునే గ్రామీణ ఉపాధి హామీ వంటి అనేక సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఉదహరించారు. ఆర్థిక రంగం లోను, మేక్ ఇన్ ఇండియా, స్వయం స్వావలంబన, చైనా పట్ల మన విధానం తదితర అన్ని రంగాల్లోను మీరు చెబుతున్నా ఒకదాని తరువాత ఒకటి విఫలమౌతున్నాయని పేర్కొన్నారు. 2014లో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవానికి రెండు కోట్ల ఉద్యోగాలు నష్టమయ్యాయి. రైల్వేల్లో ఉద్యోగాలు లేక బీహార్, ఉత్తరప్రదేశ్‌లో యువత రోడ్డున పడిందని ఖర్గే చెప్పారు. కేంద్ర ప్రభుత్వవిభాగాలలో తొమ్మిది లక్షల ఖాళీలు ఉన్నాయి. రైల్వేలో 15 శాతం, రక్షణ శాఖలో 40 శాతం, హోం మంత్రిత్వశాఖలో 12 శాతం ఖాళీలు ఉన్నాయని ప్రధాని మంత్రి కార్యాలయం ప్రకటించిందని గుర్తు చేశారు.

అయితే ఉద్యోగాల కల్పనకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. కేవలం ఉపన్యాసాలు ఇస్తున్నారని ఖర్గే ఆరోపించారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడుతూ దీన్ని ప్రధాని మోడీ వైఫల్యానికి స్మారకంగా ఎద్దేవా చేశారని, అయితే కరోనా సంక్షోభ సమయంలో అదే మీ ప్రభుత్వానికి పనిచేసిందని వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభ సమయంలో గ్రామాల్లో హామీ ఇచ్చిన ప్రకారం 150 పని దినాలు కాకుండా కేవలం 20 రోజులే పని అప్పగించారని విమర్శించారు. గత ఏడాది ద్రవ్యోల్బణం 14.23 శాతానికి చేరుకుందని, గత 12 ఏళ్లలో ఇది అత్యంత ఎక్కువని చెప్పారు. గత ఏడేళ్లలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సయిజ్ డ్యూటీని 275 శాతం వరకు ప్రభుత్వం పెంచిందని ఆరోపించారు. ప్రతిసారీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నా గత ఏడేళ్లలో ప్రభుత్వం రూ. 25 లక్షల కోట్లు ఆర్జించిందని చెప్పారు. మంచి రోజులు తెస్తామని ప్రభుత్వం చెబుతోందని కానీ వాస్తవానికి ధరలు విపరీతంగా పెరిగి, ద్రవ్యోల్బణం పెరుగుతుంటే మంచి రోజులెక్కడని ప్రశ్నించారు. 2014 లో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.414 ఉండగా, అది వెయ్యి రూపాయలకు పెరిగిందని, అంటే 117 శాతం పెరిగిందని విమర్శించారు.

అలాగే కాయధాన్యాల ధర 60 శాతం, కూరగాయల ధరలు 80 శాతం పెరిగాయని ఉదహరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడంపై కూడా ఖర్గే ప్రభుత్వంపై దాడి చేశారు. 2013 లో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా దాదాపు 13.5 లక్షల మంది ఉద్యోగాలు పొందుతుండగా, 2021 లో ఆ సంఖ్య 9 లక్షలకు దిగజారిందని ధ్వజమెత్తారు. లాభాలతో పురోగతిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణకు గురయ్యాయని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియా ( స్వదేశీ తయారీ ) నినాదం ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ తయారీ, పరిశ్రమల రంగాల్లో ప్రగతి క్షీణించిందని, తయారీ రంగంలో వృద్ధి ఏటా 14 శాతం ఉంటుందని చెప్పినా, వాస్తవానికి మైనస్ 7.2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నహామీ ఏమైందని ప్రశ్నించారు. ఇది నెరవేరిందా ? రాష్ట్రపతి ప్రసంగంలో ఈ ప్రస్తావన లేనేలేదని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను మొదట్లోనే వెనక్కు తీసుకుని ఉన్నట్టయితే దాదాపు 700 మంది రైతుల ప్రాణాలను నిలబెట్టేవారయ్యేవారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కొంతమంది బిజెపి , ఆర్‌ఎస్‌ఎస్ నేతలు రైతునాయకులను మావోయిస్టులుగా, ఉగ్రవాదులుగా ఖలిస్థానీలుగా చిత్రీకరించారని విమర్శిస్తూ లఖింపూర్ సంఘటనను ఉదహరించారు.

మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా తనయుడే నలుగురు రైతుల మృతికి కారకుడని, మొదట ఆ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు సాగుతున్నందున మంత్రి ప్రభావం దానిపై ఉంటుందని ఆరోపించారు. ఆకలి సూచికలో కూడా మొత్తం 116 దేశాల జాబితాలో భారత్ 101 స్థానంలో ఉండడం ప్రస్తావిస్తూ పేదలకు రేషన్ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనే మార్చి వరకు పొడిగించారని ఆరోపించారు. దేశంలోని వివిధ వర్గాల ఆదాయాల్లో వ్యత్యాసాలను పేర్కొంటూ దేశంలోని ఒక శాతం మంది మాత్రమే మొత్తం సంపదలో 22 శాతం పొందుతుండగా, తొమ్మిది శాతం మంది 35 శాతం, మధ్యతరగతిలో 40 శాతం మంది 30 శాతం ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు. అలాగే అట్టడుగున ఉన్న 50 శాతం మంది కేవలం 13 శాతం మాత్రమే ఆదాయం పొందగలుగుతున్నారని వివరించారు.ఇలాంటి వ్యత్యాసాలను తొలగించి, అనేక అభివృద్ధి ప్రణాళికలను చేపట్టే ప్లానింగ్ కమిషన్‌ను ప్రభుత్వం రద్దు చేసిందని తీవ్రంగా ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం పట్ల మన ప్రభుత్వ విధానాన్ని ఎత్తిచూపుతూ మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తూ ఇళ్లు , వంతెనలు నిర్మిస్తూన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

2013 లో చైనా నుంచి రూ. 3. 08 లక్ష కోట్ల విలువైన దిగుమతులు జరగ్గా, 2021 నాటికి అవి రూ. 7.20 లక్షల కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. 2013 లో చైనాతో మన వాణిజ్య లోటు రూ. 2.70 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 5.25 లక్షల కోట్ల వరకు ఉండడాన్ని ప్రస్తావించారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దయిన తరువాత ఉగ్రవాద సంఘటనలు దాదాపు 500 వరకు జరిగాయని వివరించారు. ఈ సందర్భంగా అధికార వర్గం నుంచి ఖర్గే నిరసనలు ఎదుర్కొన్నారు. దేశంలో షెడ్యూల్డు కులాలు, తెగలు, క్రిస్టియన్లపై అనేక దాడులు జరిగాయని ఆరోపించారు. 2016 నుంచి 2020 వరకు ఎస్‌సిలపై దాడులు 30 శాతం పెరగ్గా, ఎస్‌టిలపై దాడులు 26 శాతం పెరిగాయని వివరించారు. ప్రభుత్వం ఎప్పుడూ సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అని నినాదం ఇస్తుంటుందని, కానీ ప్రతి ఒక్కరూ దెబ్బతిన్నారని వ్యాఖ్యానించారు. డిఎంకె ఎంపి తిరుచ్చి శివ ఆల్‌ఇండియా సర్వేస్ రూల్స్ మార్పు ప్రతిపాదనను తీవ్రంగా విమర్శించారు.ఈ రూల్స్‌కు సంబంధించి ప్రభుత్వం ఫత్వా జారీ చేస్తోందని తృణమూల్ ఎంపి సుఖేందు శేఖర్ రాయ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News