Friday, March 29, 2024

సంక్షోభంలో ఓయో హోటల్స్!

- Advertisement -
- Advertisement -
Oyo-Hotels 
భారత్, చైనాలో వేలాది మందిని ఇంటికి పంపిస్తున్న సంస్థ

న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ భారత్, చైనాలలో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించి వేస్తోందని ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన వర్గాలు అంటున్నాయి. దీంతో సాఫ్ట్ బ్యాంక్ గ్రూపునకు చెందిన సంస్థల్లో అతిపెద్ద స్టార్టప్ అయిన ఈ సంస్థలో సంక్షోభం పెరుగుతోందనే దానికి ఇది సంకేతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఓయో హోటల్స్‌కు చైనాలో 12 వేల మంది ఉద్యోగులు ఉండగా, భారత్‌లో కూడా పది వేలకు పైగానే సిబ్బంది ఉన్నారు. పని తీరు సమర్థవంతంగా లేదన్న సాకుతో చైనాలోని 12 వేల మందిలో 5 శాతం మందిని ఓయో ఇప్పటికే తొలగించిందని, భారత్‌లోని సిబ్బందిలో 12 శాతం మందిని ఇదే కారణంపై తొలగిస్తోందని ఆ వర్గాలు అంటున్నాయి.

భారత్, చైనాలలో తమ వ్యాపారాలను పునర్నిర్మాణం చేయడంతో పాటుగా, సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించుకునే పనిలో ఓయో ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ వర్గాలు తెలిపాయి. కాగా ఈ విషయమై ఓయో ప్రతినిధిని సంప్రదించగా ఆయన వెంటనే స్పందించడానికి నిరాకరించారు. సాఫ్ట్ బ్యాంక్ గ్రూపులోని పలు కంపెనీలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటిలో వుయ్ వర్క్, స్లాక్ టెక్నాలజీస్, ఉబర్ టెక్నాలజీస్ ప్రధానమైనవి. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కంపెనీల షేర్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. మిగతా కంపెనీలు కూడా పెద్దగా లాభాలను తెచ్చి పెట్టడం లేదు. ఇప్పుడు ఓయో పునర్యవస్థీకరణ ఈ గ్రూపు యజమాని మసయోషి సన్ కి తలనొప్పిగా మారింది.

దీనికి తోడు చైనాలో హోటల్ యజమానులు కాంట్రాక్ట్ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ ఓయో కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నిజానికి ఓయో భారత్, చైనాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఈ హోటళ్లలో కస్టమర్ల పట్ల సిబ్బంది ప్రవర్తన బాగా ఉండడం లేదంటూ కస్టమర్లనుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో దాని ప్రతిష్ఠ మసకబారింది. ఈ రెండు దేశాల్లో ఓయోకు 20 వేలకు పైగా హోటళ్లు ఉండడం గమనార్హం. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఓయో ఒక రాత్రికి నాలుగు డాలర్లు తక్కువ ధరకే హోటల్ గదులను అందిస్తూ వచ్చింది.

హోటల్ యజమానులకు కచ్చితమైన ఆదాయాన్ని అందిస్తామన్న హామీలతో అది హోటళ్లలో గదులను ముందే తమ కోసం అట్టిపెట్టే విధంగా వాటితో ఒప్పందాలు కూడా చేసుకుంది. అయితే ఆ ఒప్పందాలను అది ఉల్లంఘించడమే హోటళ్ల యజమానులు ఆందోళనలకు దిగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ ఓయోలో ఇప్పటివరకు1.5 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఓయో మార్కెట్ విలువ దాదాపు పది బిలియన్ డాలర్ల కు చేరుకుందని ఓ అంచనా.

Oyo is firing thousands of staff across China and India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News