Tuesday, October 15, 2024

ఆర్టికల్ 370 ఎత్తివేత అక్రమం : షెహ్‌బాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ మరోసారి ఐరాస వేదికపై కశ్మీర్‌పై తన పాత పాటే అందుకుంది. పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ కశ్మీర్ విషయాన్ని, అందులోనూ ప్రత్యేకించి ఆర్టికల్ 370ని ప్రస్తావించారు. భారతదేశంలో జమ్మూ కశ్మీర్ ఎన్నికల నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రధాని ఈ కీలక విషయాన్ని లేవనెత్తడం కలకలం రేపింది. ఐరాస సర్వప్రతినిధి సభ 79వ సదస్సులో పాక్ ప్రధాని శుక్రవారం మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌లో తిరిగి ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా భారతదేశం జమ్మూ కశ్మీర్ వివాదంపై శాంతియుత పరిష్కారానికి తమతో చర్చలకు రావల్సి ఉందని కూడా పిలుపు నిచ్చారు. కశ్మీర్ విషయాన్ని పాకిస్థాన్ పదేపదే ప్రస్తావించడం సాధారణమే అయింది. అయితే ఇప్పుడు పాక్ నేత అత్యంత కీలకమైన ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం , ఇదే కశ్మీర్‌కు రక్ష అని తెలియచేయడం వివాదాస్పదం అయింది.

ఆర్టికల్ 370 , హిజ్బుల్ ఉగ్రవాది బుర్హన్ వనీ విషయాలను ఆయన తమ 20 నిమిషాల ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశం పాకిస్థాన్‌తో సంప్రదింపులు జరపాలనుకుంటే, శాంతియుత పరిష్కారం కోరుకుంటే ముందుగా , దీనికి ప్రాతిపదికగా ఆర్టికల్ 370 తిరిగి తీసుకురావల్సి ఉంటుందని పాక్ నేత స్పష్టం చేశారు. 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో పలు ఏకపక్ష, అక్రమ నిర్ణయాలకు దిగిందని షరీప్ మండిపడ్డారు. ఈ తప్పిదాలను భారత్ ఇకనైనా చక్కదిద్దుకుని తీరాలి. ఈ విధంగా వ్యవహరిస్తేనే చర్చలకు , శాంతికి దారి ఏర్పడుతుందని , లేకపోతే ఇంతే సంగతులు అని కూడా పరోక్షంగా హెచ్చరించారు. ఐరాస భద్రతా తీర్మానాలు, కశ్మీరీల ఆకాంక్షలకు అనుగుణంగానే భారత ప్రభుత్వం స్పందించి తీరాల్సిందే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News