Tuesday, April 30, 2024

పాలమూరు సాకారమవుతున్న వేళ

- Advertisement -
- Advertisement -

పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా కరవు కాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బీడు భూముల్ని తడుపుకుంటూ కృష్ణమ్మ బిరబిరా తరలిరానుంది. పాలమూరు జిల్లా వాసుల దశాబ్దాల కల సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టినపట్టు విడవకుండా చేసిన పనుల ఫలితం ఇప్పుడు పాలమూరులో కనిపిస్తున్నది. పాలమూరు జిల్లాది ఉమ్మడి రాష్ట్రంలో ఒక విషాదగాథ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర.

ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా పొట్టచేత పట్టుకొని వలసల వెళ్ళినవారు, తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటుతో, ప్రభుత్వం చొరవతో సొంత ఊళ్లకు తిరిగివచ్చిన రైతులు, ఆ చివర నుంచి ఈ చివర వరకు పరచుకున్న పొలాలు, కళకళలాడుతున్న గ్రామాలే ఇందుకు నిదర్శనం.ఒక దశలో కేంద్రం ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను తిరస్కరించి ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కనపెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం పట్టువిడవకుండా ఇఎసి కోరిన విధంగా సమగ్రంగా ప్రాజెక్టు వివరాలను సమర్పించింది. పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35 లక్షల మంది నివసించే ఈ జిల్లాకు దేశంలోనే ఓ ప్రతేక గుర్తింపు ఉంది. కానీ సాగు నీటి ప్రాజెక్టులు మాత్రం కేంద్రం నిర్లక్ష్యం వల్ల దశాబ్దాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయింది. దశాబ్దాలు గడిచినా వలస సంకెళ్ల నుంచి వారికి విముక్తి దక్కలేదు. గతంలో చేదు చరిత్ర. కరవుతో, కడగండ్లతో, కష్టాలతో ఏండ్ల తరబడి సహవాసం చేసిన పాలమూరు మట్టి మనుషులకు కొత్త జీవితం అందించే పనిలో పడింది.

తెలంగాణలో సాగు, మంచి నీటికి ప్రత్యేక కార్యాచరణతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీడువారిన పాలమూరు పొలాలకు పచ్చని రంగేసే బాధ్యతను తలకెత్తుకుంది.పాలమూరు మొత్తం విస్తీర్ణం 43.73 లక్షల ఎకరాలు ఉంటే అందులో వ్యవసాయ యోగ్యమైన భూమి దాదాపు 35 లక్షల ఎకరాలు. సాగునీటి సౌకర్యం ఉన్న భూమి 4.5 లక్షల ఎకరాలు మాత్రమే. ఇందులో జూరాల కింద లక్ష 87 వేల ఎకరాలకు బదులు 30 వేల ఎకరాలే ఆర్‌డిఎస్. 2.5 లక్షల ఎకరాలకు బదులు 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే చెరువులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం మీద నికరంగా దాదాపు 2 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతున్నది. గత సీమాంధ్ర పాలనలో సాగునీరు అందించే ఆలోచనే లేని కారణంగా పాలమూరు ప్రజలకు బతుకు దెరువు కోసం వలసలే గతి అయ్యాయి. ఉమ్మడి పాలకులు అవలంబించిన, విధానాల వల్ల ప్రతిపాదిత భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు పథకాలు నిరంతరం ఫైళ్ళల్లో మగ్గుతూ వచ్చాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలమూరు ప్రజల కష్టం ఓ రణ నినాదమైంది. ఆ ఉద్యమ పోరు నుంచి ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇపుడు పాలమూరు భవితను మారుస్తున్నది.

పాలమూరు ప్రగతి రథానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సారథిగా మారి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడి బీడు భూములపై నీలు పారించడం కోసం ఉమ్మడి రాష్ట్రం లో అటకెక్కిన ప్రాజెక్టులను దశలవారీగా పునరుద్ధరించడ వల్ల శరవేగంగా పనులు జరుగుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను చుక్క నీరు పోకుండా వొడిసి పట్టుకోవాల్సిందేనని, అందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్టా నది మీది అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాల్సిందేనని, రాష్ట్ర విభజన చట్టంలో అపెక్స్ కౌన్సిల్ అనుమతి కొత్తప్రాజెక్టులకు తప్పనిసరి అయినందువల్ల ముందు చూపుతో అపెక్స్ కౌన్సిల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఈ ప్రాజెక్టు సర్వే, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) మూడు నెలల్లోనే సమర్పించే విధంగా ఆర్‌టి No. 69, తేదీ 1 ఆగస్టు 2014 ద్వారా ఇవ్వడం జరిగింది.

సమస్యలు, వివాదాల కారణంగా పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులను ముందుకు నడిపించేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకున్నారు. జిల్లా గుండా కృష్ణా నది 300 కిలోమీటర్లు పారుతుంది. తుంగభద్రా నది కూడా ఈ జిల్లా సరిహద్దుగా పారుతుంది. అయినా జిల్లాలో తెలంగాణ ఏర్పడే దాకా ఈ దీన పరిస్థితి నెలకొన్నది. ఇంకా కొత్త ప్రాంతాలకు సాగు నీటి కోసం ప్రజలు ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నీటి గోసను ఉవ్వెత్తున లేచిన సందర్భంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు 2005లో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి అప్పటి సీమాంధ్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది. జిల్లా నాయకుల్లో దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. 2009 ఎన్నికల ముందు సర్వేల గురించి జిఒ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ముఖం చాటేసి అనేక సాకులు చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం జరుగుతుందని ఆదేశాలు ఇచ్చారు.

ఈ విధంగా మొత్తం పాలమూరు- రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులను అవమానపరచడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తుంగభద్రపై గండ్రేవుల జలాశయంతో పాటు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే నిమిత్తం 2013 ఆగస్టులో జిఒ ఇచ్చినా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాకుండా అడ్డుకున్నారు.
అయితే సర్వే పూర్తి అయి ప్రాజెక్టుల సమగ్ర నివేదిక తయారు చేసి పరిపాలనా అనుమతి ఇచ్చి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉండేది. ప్రజల ఓట్ల కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే ఉద్దేశంతో ఆ జిఒ జారీ అయిందే తప్ప అమలు చేద్దామన్న చిత్తశుద్ధ్ది గత ప్రభుత్వానికి లేదు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు కొందరు దుర్మార్గంగా కోర్టు కేసుల ద్వారా అడ్డుకొన్నారు. అయినా ప్రభుత్వం పట్టుదలతో పనులు చేసుకుంటూ వస్తున్నది.

ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక చెరువులున్నా కరవు జిల్లాగా, వలస జిల్లాగా మారడం ఒక విచిత్రం, విషాదం. పాలమూరు గోస తీర్చేందుకు ముఖ్యమంత్రి సాగునీటి వ్యూహంలో భాగంగా మిషన్ కాకతీయ కింద మహబూబ్‌నగర్ జిల్లా చెరువుల పునరుద్ధరణ అద్భుతంగా జరిగింది. పునరుద్ధరణ జరిగిన చెరువులను ఎత్తిపోతల పథకాలతో అనుసంధానం చేయడంతో వాటికి పూర్వవైభవం వచ్చింది.
ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం కృష్ణా జలాలను జూరాల నుండి లక్ష క్యూసెక్కుల నీరు క్రిందికి ప్రవహిస్తున్న దశలో 25 రోజులలో 70 టిఎంసిల నీటిని ఎత్తిపోసి 3 జలాశయాల్లో నింపి వాటి ద్వారా దాదాపు మహబూబ్ నగర్ జిల్లాలో 7 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30,000 ఎకరాలు మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగు నీరు, పరిశ్రమల అవసరాలకు నీరు, జంట నగరాలకు, దారి పొడవునా గ్రామాలకు మంచి నీరు అందనుంది.

ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి, పోరాడి అనుమతులు సాధించామని, ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుతం. ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాటిలేదని నిరూపించుకుంది. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు సిద్ధమైంది. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల వెట్న్‌క్రు ముహూర్తం ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 16వ తేదీన దీనిని ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద స్విచ్ ఆన్‌చేసి ప్రారంభిస్తారు. 2 కి.మీ దూరంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిఎత్తిపోత జరగనుంది. సమైక్య పాలనలో దశాబ్దాల పాటు పక్కనపెట్టిన పెండింగ్ ప్రాజెక్టులను స్వరాష్ట్రంలో శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని ప్రతి పల్లెకు తాగు నీరు, సాగు నీరు అందనుంది. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుంది, సిఎం కెసిఆర్ సాగునీటిపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమయింది.

తీగల అశోక్ కుమారు
7989114086

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News