Friday, April 19, 2024

రాష్ట్రమంతటా పల్లె దవాఖానాలు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు విజయవంతమైన నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానాలు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. జవవరి నాటికి మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో 331 బస్తీ ద వాఖానాలు పని చేస్తున్నాయని, వీటిని 500కు పెంచాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని చెప్పారు. అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలలో పల్లె దవాఖానాల్లో వైద్యుల నియామకాలకు కసరత్తు మొదలైందని చెప్పారు. కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో శు క్రవారం మంత్రి మానిటరింగ్ హబ్‌ను ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమం త్రి కెసిఆర్ రాష్ట్రంలో ప్రాథమిక వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలోని 887 పిహెచ్‌సిల్లోని సిసి కెమెరాలు ఏర్పాటు చేసి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలకు అనుసంధానం చేసినట్లు చెప్పారు. దీని ద్వారా ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా పిహెచ్‌సిలను పర్యవేక్షించే అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో వరదలు, డయేరియా వంటి ఎపిడమిక్ ఔట్ బ్రేక్ కలిగిన సమయంలో ఉన్నతాధికారులు పిహెచ్‌సి వైద్యులకు సలహాలు సూచనలు ఇస్తారన్నారు. డాక్టర్లు ఆయా పీహెచ్‌సీలోని ఫార్మసీ, ల్యాబ్‌ను మాటనిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటల్‌తో సంప్రదించి అవసరమైన సమయాలలో పిహెచ్‌సిలలో స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సీసీ కెమెరాలతో సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు.

ఇలాంటి వ్యవస్థ దేశంలో తొలిసారి..

దేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి అనుసంధానించే వ్యవస్థ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా రెండు వైపుల వీడియో కాల్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అవసరమైన సమయంలో ఆన్‌లైన్ విధానంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించానికి వీలు ఉంటుందన్నారు. దాంతో శిక్షణ కోసం వైద్యులు,సిబ్బంది హైదరాబాద్‌కు రావలసిన అవసరం తప్పుతుందని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. పిహెచ్‌సిలలో వైద్యులను నియమించడంతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు అందజేస్తున్నామని వివరించారు.

43 పీహెచ్‌సీలకు రూ.67 కోట్లతో కొత్త భవనాలను మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 372 పీహెచ్‌సీల మరమ్మతలను రూ.43.18 కోట్లతో పనులు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 4,500 సబ్ సెంటర్లలో 2,900 కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తామని అన్నారు. 1,239 సబ్ సెంటర్ల కొత్త భవనాలకు మంజూరు చేశామని, ఒక్కోదానికి రూ.20 లక్షల ఖర్చు చేస్తున్నామన్నారు. అన్నింటికి కలిపి మొత్తంగా రూ.247 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. 1,497 సబ్ సెంటర్లను 59 కోట్లతో మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు.

మునుగోడు ఎన్నికతో వైద్యుల నియామకాలు ఆలస్యం

మునుగోడు ఎన్నికతో ఎన్నికల కోడ్ కారణంగా డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైందని మంత్రి తెలిపారు. 969 వైద్యుల పోస్టులకు ఇప్పటికే మెరిట్ జాబితా ప్రకటించామని, వారం పది రోజుల్లో నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 150 నుంచి 200 మంది వైద్యులు ఉన్నత చదువుల కోసం సెలవులో వెళ్లారని, కొత్త వైద్యుల నియామకాలు పూర్తయితే అన్ని పిహెచ్‌సిలకు వైద్యులు అందుబాటులోకి వస్తారని చెప్పారు.

రాష్ట్రంలో పెరిగిన గిరిజన రిజర్వేషన్లకు అనుగుణంగా కొత్త రోస్టర్ రూపొందించి నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. పల్లె దవాఖానాల కోసం 1,569 పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతుందని తెలిపారు. అలాగే బోధనాసుపత్రుల్లో 1,165 స్పెషలిస్టు వైద్యుల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలలో పనిచేయడానికి ఎంబిబిఎస్ వైద్యులు అందుబాటులో లేకుంటే ఆయుష్ వైద్యులకు అవకాశం ఇస్తామని తెలిపారు. ఎంబిబిఎస్, ఆయుష్ వైద్యులూ లేకుంటే బిఎస్‌సి నర్సింగ్ చేసిన అవకాశం ఇస్తామని అన్నారు.

గాంధీ, ఉస్మానియాలకు తగ్గిన ఒపి

పీహెచ్‌సిలు, బస్తీ దవాఖానాలలో మెరుగైన ప్రాథమిక వైద్యం అందుబాటులోకి రావడంతో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ వంటి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిందని మంత్రి చెప్పారు. పిహెచ్‌సీలలో ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైందని తెలిపారు. 2019లో ఉస్మానియా హాస్పిటల్‌లో 12 లక్షలు ఓపీ ఉంటే.. ఈ ఏడాది 5 లక్షలకు తగ్గిందన్నారు. అలాగే గాంధీలో 6.5 లక్షల నుంచి 3.70 లక్షలకు, నిలోఫర్‌లో 8 లక్షల నుంచి 5.5 లక్షలకు, ఫీవర్ హాస్పిటల్‌లో 4 లక్షల నుంచి 2 లక్షలకు ఒపి తగ్గిందని వివరించారు.

ఫలితంగా ఆయా ఆసుపత్రుల్లో సర్జరీలు,ఇతర స్పెషాలిటీ వైద్య సేవలు పెరిగాయని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో థైరాయిడ్ సహా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.పిహెచ్‌సిలలో వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి 24 గంటల్లో ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌కు ఎన్‌ఎబిఎల్ అక్రిడియేషన్ తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేసినట్లు మంత్రి వివరించారు.

కేంద్రం మెడికల్ కాలేజీ ఇస్తామంటే నేనే వెళ్లి కలుస్తా

కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా… తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటామని, అందుకోసం తానే స్వయంగా వెళ్లి ఎవరిని కలవమంటే వారిని కలుస్తానని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకుంటారా..? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలకు సంబంధించిన తెలంగాణ నుంచి ప్రతిపాదనలు రాలేదని చెబితే, ఆ పత్రాలు చూపించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది మరిన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నామని, ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు మెడికల్ కాలేజీ ఇస్తామంటే తానే స్వయం వెళ్లి కలుస్తానని తెలిపారు.

ప్రజలకు సేవ చేశానన్న సంతృప్తి కలిగింది

వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పాటు ప్రజలకు సేవ చేయడం సంతృప్తిని ఇచ్చిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తాను వైద్యారోగ్య శాఖ మంత్రి ఏడాది పనితీరుపై ప్రోగ్రెస్ కార్డును మీడియా ముందు ఉంచుతానని చెప్పారు. తాను వైద్యారోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి నెలా అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా క్యాలెండర్ రూపొందించుకున్నామని అన్నారు. తద్వారా ఆసుపత్రుల్లో ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పిహెచ్‌సికి వచ్చిన మహిళలతో మాట్లాడిన మంత్రి

రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో మానిటరింగ్ హబ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి పలు పిహెచ్‌సీలలో వైద్యులు, రోగులతో నేరుగా మాట్లాడారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పిహెచ్‌సి, సూర్యాపేట జిల్లా అంబేద్కర్‌నగర్, సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్ పీహెచ్‌సీ వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లాలోని పీహెచ్‌సీలో వైద్యాధికారితో పాటు అక్కడికి వచ్చిన రోగులతోనూ మాట్లాడి అక్కడి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసున్నారు. హరిత, అన్నపూర్ణ అనే పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

డాక్టర్‌గారు మిమ్మల్ని ఎలా చూశారు…? మందులు ఇస్తున్నారా..? పరీక్షలు రాస్తున్నారా..? అని రోగులను అడిగారు. అలాగే వైద్యులతో మాట్లాడుతూ ఆయా పీహెచ్‌సీలలో రోజుకు ఎంత ఓపీ ఉంటుంది…? ఈరోజు మధ్యాహ్నానికి ఎంత ఒపి నమోదైంది..? అని అడిగారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి కె.చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతామహంతి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేష్‌రెడ్డి, టివివిపి కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

ఇన్ఫెక్షన్ కంట్రోల్ మ్యానువల్ ఆవిష్కరణ

ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు తీసుకోవలసని చర్యలపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు రూపొందించిన ఇన్ఫెక్షన్ కంట్రోల్ మ్యానువల్‌ను మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డాక్టర్ రాజారావును మంత్రి సన్మానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News