Sunday, May 19, 2024

మోడీ, రాహుల్ సహా ఎవరికీ భయపడం

- Advertisement -
- Advertisement -

TRS

 

లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఉత్తమ్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు
పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చాం
సోషల్ మీడియాతో కెటిఆర్

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపాలిటీ శాఖ మంత్రి కెటి. రామారావు తేల్చి చెప్పారు. బిజెపిని చూసి కెటిఆర్ భయపడుతున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు ఉన్నట్లుగా టిఆర్‌ఎస్‌కు ఢిల్లీలో బాసులు లేరనీ, తెలంగాణ రాష్ట్రంలోని గల్లీల్లో ఉన్న ప్రజలే టిఆర్‌ఎస్‌కు బాసులని ఆయన చెప్పారు. ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పట్టణాభివృద్ధికి విడుదల చేసిన నిధుల కంటే అత్యధికంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు.

రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్,బిజెపిలకు చిత్తశుద్ధి లేదని కెటిఆర్ దుయ్యబట్టారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 600 మంది అభ్యర్థులను పోటీలో నిలిపిన బిజెపికి టిఆర్‌ఎస్‌ను విమర్శించే నైతిక హక్కు ఉందాని ఆయన ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌లో డిపాజిట్ కోల్పొయిన బిజెపికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు చివరివన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బిజెపి పూర్తిగా కనుమరుగై పోతుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రజలు ఆశీర్వదిస్తూ ప్రతిఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తూ అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ దరిదాపుల్లోకి బిజెపి, కాంగ్రెస్ వచ్చే అవకాశాలు లేవన్నారు.

జిల్లాపరిషత్ ఎన్నికల ఫలితాలు మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పునరావృతం అవుతాయనే ధీమాను కెటిఆర్ వ్యక్తం చేశారు. సోమవారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోషల్‌మీడియా ప్రతినిధుల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం నూతన మున్సిపాలిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి అవినీతి చీడ దులుపుతామని చెప్పారు. గతంలో వారానికి ఒకరోజు మున్సిపాలిటీల్లో తాగునీరు వచ్చేవనీ, నీటి కోసం బిందెలతో ప్రదర్శనలు చేసేవారని ఆయన గుర్తు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని, మంచినీళ్లు పుష్కలంగా వస్తున్నాయని చెప్పారు. మిషన్‌భగీరథతో ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతుందన్నారు.

గత సమైక్య పాలనలో ఉన్న సమస్యలు ఎలంగాణ రాష్ట్రంలో లేవని చెప్పారు.కాళేశ్వరం పూర్తి అయితే తెలంగాణ కోనసీమగా మారుతుందన్నారు. ఇప్పటివరకు తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలను 95 శాతం పరిష్కరించినట్లు కెటిఆర్ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం గెలిచిన అభ్యర్థులకు నూతన చట్టం పై శిక్షణ కార్యాక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్‌లో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి నూతన మున్సిపాలిటీ చట్టంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.

సోషల్‌మీడియాకు ప్రాధాన్యత ఉంది
ఉద్యమ కాలం నుంచి టిఆర్‌ఎస్‌చెందిన సోషల్‌మీడియా అత్యంత బాధ్యతా యుతంగా వ్యవహరిస్తోందని కెటిఆర్ చెప్పారు.ప్రజాబలం ఉన్న టిఆర్‌ఎస్‌కు సోషల్‌మీడియా మరింత బలం ఇచ్చిందన్నారు. ప్రధాన మీడియాకు సోషల్‌మీడియా ప్రత్యామ్నాయంగా ఉందని చెప్పారు. టిఆర్‌ఎస్ ఫేస్‌బుక్ ఖాతాలో 11లక్షలు, ట్విట్టర్‌లో 3.6 లక్షల ఫాలోవర్స్ ఉన్నారని ఆయన వెల్లడించారు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేందుకు సోషల్‌మీడియా గొప్పవేదికని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి సిఎం కెసిఆర్‌పై అభిమానంతో టిఆర్‌ఎస్ సోషల్‌మీడియా పనిచేస్తోందన్నారు. సోషల్‌మీడియా సైనికులు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ప్రజల అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకునే సాధనాల్లో సోషల్‌మీడియాకు అత్యంతప్రాధాన్యత ఉందన్నారు.

హుజూర్‌నగర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన సోషల్‌మీడియా ప్రతిపక్షాల దుష్ప్రచారాలను చిప్పికొట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుత మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాల సత్యప్రచారాన్ని సోషల్‌మీడియా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పరుషమైన పదాలను వాడకుండా విశ్లేషనలతో విపక్షాల కుటిల రాజకీయాలను తిప్పికొట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 16 లక్షల మంది టిఆర్‌ఎస్ ప్రతినిధులు ఉన్నారని ఆయన చెప్పారు. వీరందరిని సోషల్ మీడియాలో చైతన్యపర్చాలని కెటిఆర్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను ఆదేశించారు. సంక్రాంతి ముగ్గుల్లో కారుగుర్తును, పతంగులపై కెసిఆర్ ఫోటోలను సోషల్‌మీడియాలో మరింత ప్రచారం చేయాలని సూచించారు.

సోషల్ మీడియాకు గుర్తింపు
తెలంగాణ ఉద్యమకాలం నుంచి నేటివరకు టిఆర్‌ఎస్‌కు వేదికగా ఉన్న సోషల్‌మీడియా గులాబిసేనలకు పార్టీ పరంగా తగిన గుర్తింపు ఉంటుందని కెటిఆర్ హామీ ఇచ్చారు. సంస్కారవంతంగా సమాచారం ఇస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న సోషల్‌మీడియా గులాబిసేనలను ఆయన అభినందించారు. టిఆర్‌ఎస్ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జీలుగా దినేష్ చౌదరి, క్రిషాంక్, జగన్, సతీష్‌లను నియమిస్తున్నట్లు కెటిఆర్ ప్రకటించారు.

 

People are the boss of TRS
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News