Home తాజా వార్తలు పల్లె కళకళ…. పట్నం వెలవెల…

పల్లె కళకళ…. పట్నం వెలవెల…

సంక్రాంతికి సొంతూరుకు వెళుతున్న వలస జీవులు
ఖాళీగా దర్శనం ఇస్తున్న నగర రహదారులు

People went to village for Sankranthi
మనతెలంగాణ,సిటీబ్యూరో: నగరానికి వలస వచ్చిన ప్రజలంతా సంక్రాంతి పండుగ కోసం సొంతూరు బాట పట్టడంతో నగర రహదారులన్నీ చిన్న బోయాయి. నిత్యం రద్దీతో రోడ్డుపై జానెడు జాగా లేకుండా కళకళలాడే రాజధాని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వరుస సెలవు రావడంతో ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు ఇళ్ళకు ప్రయాణం అయ్యారు. వాహనాల రద్దీతో కనిపించే ఖైరతాబాద్ జంక్షన్, పంజాగుట్ట,అమీర్‌పేట,ఆబిడ్స్, నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్, బేగంపేట, మల్కాజిగిరి, దిల్‌షుక్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కాచిగూడ, ముషీరాబాద్, అశోక్‌నగర్, కూకట్‌పల్లి,బాలానగర్, హైటెక్ సిటీ, మెహదీపట్నం. లంగర్‌హౌజ్, చాంద్రాయణగుట్ట, ఐఎస్‌సదన్, కర్మన్‌ఘాట్, సాగర్ రింగ్‌రోడ్డు, వంటి పలు ప్రాంతాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఎల్‌బినగర్, నుంచి సూర్యాపేట, నల్గొండ,ఖమ్మం, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరళి వెళ్ళారు. వారంతా సొంతూరు వెళ్ళేందుకు ప్రైవేట్ సుమోలు, ఇన్నోవాలు, టెంపో ట్రాక్స్ వంటి వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వాహన దారులు గతంలో కంటే మూడింతలు పెంచి ప్రయాణికులను ముక్కు పిండి చార్జీలు జేబులో వేసుకుంటున్నారని మండి పడుతున్నారు. ఎక్కే ముందు ఒక మాట, దిగిన తర్వాత మాట మార్చి పండగ సీజన్ కావడంతో రేట్లు పెరిగాయని పేర్కొంటూ ఖచ్చితంగా అడిగినంత ఇవ్వాల్సిదే అని నిలదీస్తున్నట్లు వెల్ల డిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను సమయానికి నడిపిస్తే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అదే విధంగా సంస్థ కూడా లాభాల బాటలో పరుగులు పెడుతుందని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. జనం అంతా ఊళ్ళకు చేరుకున్నాక ప్రత్యేక బస్సుల నడిపిస్తామని ఆగమేఘాల మీద బస్సులను బయటకు తీసి 20 నుంచి 30 మంది ప్రయాణికులకు నింపుకుని అదరాబాదరగా నడుపుతూ, జనం ఉన్న చోట బస్సులు ఆపకుండా పోతూ పండగ పేరుతో బస్సులు నడిపిస్తే ప్రజలు ఆదరించడం లేదని ప్రకటలను చేసిన చేతులు దులుపుకుంటున్నారని విమర్శిస్తున్నారు. నియమి నిబంధనలు లేకుండా ఇష్టాను సారంగా బస్సులు నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు.