Wednesday, November 30, 2022

యమహా నగరి.. ఔషధపురి

- Advertisement -

వచ్చే నెలాఖరులో ప్రారంభానికి సిద్ధం
రాష్ట్రానికి తలమానికంగా నిలవనున్న ఔషధ నగరి
18,304 ఎకరాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు
మొదటి దశలో 7,212 ఎకరాలు అందుబాటులోకి
రూ.64వేల కోట్ల పెట్టుబడులు వస్తాయనిఅంచనా 
ఏటా రూ.58వేల కోట్ల ఎగుమతులు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మరో ఖ్యాతిని దక్కించుకోబోతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీకి రాష్ట్రం తలమానికంగా నిలువబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో వేలాది ఎకరాల్లో చేపట్టిన ఫార్మాసిటీ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. అన్ని కుదిరితే వచ్చే నెలాఖరులోగా ఫార్మాసిటీ ప్రారంభం కానుంది. ఈ మేరకు శరవేగంగా సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఔషధ, పరిశోధన సంస్థలకు సంబంధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎకో సిస్టంను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు.

ఔషధ రంగంలో హైదరాబాద్ నగరానికి ఇప్పటికే ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశీయ ఔషధ ఉత్పత్తుల్లో మూడో వంతు మన రాష్ట్రం నుంచే ఉన్నందున భాగ్యనగరానికి ఫార్మా క్యాపిటల్‌గా ఖ్యాతి లభించింది.ఈ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలోకి తీసుకవెళ్లాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫార్మా సిటిని అభివృద్ధి చేస్తోంది. ఫార్మాసిటీ మొత్తం విస్తీర్ణం 18,304 ఎకరాలు కాగా మొదటి దశలో 9,212 ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6,719 ఎకరాల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులను కూడా పూర్తి చేసింది. మిగిలిన భూముల సేకరణ వివిధ దశల్లో ఉండగా, భూ సేకరణకు సంబంధించి గ్రామసభల నిర్వహణ ప్రక్రియ కూడా ముగిసింది. కాగా ఫార్మా రంగం ద్వారా రాష్ట్రానికి రూ.64వేల కోట్ల పెట్టుబడుల అంచనా…. ఇక వార్షిక ఎగుమతులు 58వేల కోట్ల మేర ఉంటుందని భావిస్తున్నారు. తద్వారా 5.60 లక్షల మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని అంచనా వేస్తోంది.

కాగా నగరంలో ఇప్పటికే దాదాపుగా 300 ఫార్మా కంపెనీలు ఔషధాలను తయారు చేస్తున్నాయి. ఇందులో చాలా కంపెనీలు యుఎస్‌ఎఎఫ్‌డిఎ గుర్తింపు పొంది అమెరికా, ఐరోపా దేశాలతో పాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫార్మా రంగంలో మరింత అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో పర్యావరణ హిత పరిశ్రమలను నెలకొల్పడానికి అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం ముచ్చెర్లలో ఫార్మాసిటీని అభివృద్ధి చేస్తున్నది. ఇందులో ఔషధ, పరిశోధన సంస్థలకు సంబంధించి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రం కూడా ఈ ఫార్మాసిటీని నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)గా ఇప్పటికే గుర్తించింది. పర్యావరణ అనుమతులు సైతం మంజూరయ్యాయి. స్థలాల కేటాయింపు కోరుతూ 200లకుపైగా ఔషధ, పరిశోధన సంస్థలు టిఎస్‌ఐఐసికి దరఖాస్తు కూడా చేసుకున్నాయి. నిమ్జ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మన రాష్ట్రం ప్రపంచ ఔషధ హబ్‌గా మారనుంది.

450 కంపెనీల ఆసక్తి
కాగా పార్మా సిటీపై అనేక దేశ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో నిర్మించే ఫార్మా సిటీ కోసం ఫార్మా కంపెనీలు ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ కంపెనీలు నిరీక్షిస్తున్నాయి. చైనా కంటే చౌకగా ఫార్మా సిటీలో యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌గా పిలిచే బల్క్ డ్రగ్స్ పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తి చేయవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జైడస్ వంటి హేమాహేమీ కంపెనీలు ఇప్పటికే ఫార్మా సిటీలో తమ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు పోటీపడుతున్నాయి. కామన్ ఎస్‌టిపిలు, సమస్త మౌలిక వసతుల కల్పన, త్వరగా అనుమతుల మంజూరు ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఫార్మా సిటీలో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి వ్యయం 25 నుంచి 30 శాతం తగ్గుతుందని పారిశ్రామిక వేత్తలు అంచనా వేస్తున్నారు.

దీంతో ఫార్మా సిటీలో తమ యూనిట్లు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన 450 ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాస్తవానికి బల్క్ డ్రగ్స్ తయారీలో కాలుష్య పదార్ధాలు ఎక్కువగా వెలువడుతుంటాయి. వీటి నియంత్రణలో ఏమాత్రం విఫలమైనా పరిసర ప్రాంతాలు నివాస యోగ్యం కాకుండా పోతాయి. అందుకే ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేటప్పుడే అధికారులు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టిపి) ఏర్పాటు వంటి కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు ఇది పెద్ద కష్టం కాదని తెలుస్తోంది. అయితే చిన్న కంపెనీలకు ఇది తలకు మించిన భారంగా మారునుందని సమాచారం. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి చిన్న కంపెనీలకు సైతం ఊతమిచ్చే విధంగా తగు నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు మొదలుపట్టినట్లుగా కూడా తెలుస్తోంది.

విదేశీ కంపెనీలతో ఒప్పందాలు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గత అమెరికా పర్యటన సమయంలో పలు ఫార్మా సిటీలు తమ పెట్టుబడులను ఫార్మాసిటీలో పెట్టనున్నట్లు ప్రకటించాయి. దీనికి సంబంధించి ఒప్పందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఇటీవల లండన్ పర్యటనలో కూడా ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. దీంతో అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే ఫార్మాసిటీపై దృష్టిని పెట్టాయని తెలుస్తోంది.

Pharma City begin soon in Mucherla

Related Articles

- Advertisement -

Latest Articles