Saturday, September 14, 2024

సింగపూర్ పెట్టుబడులకు సాదర స్వాగతం:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

భారతదేశం ఎల్లవేళలా సముచిత, ఆదర్శనీయ పెట్టుబడుల విడిది అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మిత్రదేశం సింగపూర్‌లో రెండు రోజుల పర్యటనకు ప్రధాని మోడీ బుధవారం ఇక్కడికి వచ్చారు. ఇండియా సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యం, స్నేహం మరింత ఇనుమడింపచేసుకునేందుకు మోడీ ఈ పర్యటన తలపెట్టారు. భౌగోళికంగా అత్యంత కీలకమైన ఈ ఆగ్నేయాసియా దేశం నుంచి భారత్‌కు భారీ పెట్టుబడులను రాబట్టుకునేందుకు ప్రధాని యత్నిస్తారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు సింగపూర్‌లో పర్యటించే ప్రధాని మోడీ పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. సింగపూర్‌లోని మూడు తరాల నాయకత్వ శ్రేణులతో ముచ్చటిస్తారని భారత అధికార వర్గాలు తెలిపాయి. సింగపూర్‌కు తన ఆగమనాన్ని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమాల్లో ఫోటోతో పాటు పొందుపర్చారు. సింగపూర్‌కు మోడీ వెళ్లడం ఇది ఐదోసారి.

భారతదేశంలో సంస్కరణలు, ప్రత్యేకించి యువశక్తి ప్రతిభాపాటవాలు , అపార మానవ వనరులు వంటివి భారత్‌ను సర్వదా పెట్టుబడుల కేంద్రం చేస్తున్నాయని మోడీ తెలియచేసుకున్నారు. ఇరు దేశాల మధ్య విస్తృత సాంస్క్రతిక సంబంధాలను ఆశిస్తున్నట్లు వివరించారు. బ్రూనేలో తమ అధికారిక పర్యటనను ముగించుకుని, అక్కడి నుంచి మోడీ సింగపూర్‌లో వాలారు. లయన్ సిటీ సింగపూర్‌కు చేరిన ప్రధానికి అక్కడి హోం , న్యాయ వ్యవహారాల మంత్రి కె షణ్ముగం సాదర స్వాగతం పలికారు. ఇక్కడ ప్రధాని మోడీ ఉత్తేజభరిత కార్యాచరణ స్థాయి చర్చల అజెండా ఖరారు అయిందని ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాని మోడీకి గురువారం పార్లమెంట్ ఆవరణలో అధికారిక స్వాగతం పలుకుతారు. తరువాత ఆయన దేశాధ్యక్షులు థర్మన్ శణ్ముగరత్నంను కలుసుకుంటారు. వీరి మధ్య చర్చలు జరుగుతాయి. గతంలో ప్రధాని మోడీ 2018లో సింగపూర్‌కు వెళ్లారు. ఇప్పుడు ప్రధాని వెంట విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

సింగపూర్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు లూంగ్, గో ఛోక్ టాంగ్‌ను కూడా ప్రధాని కలుస్తారు. మోడీ పర్యటన దశలో సెమీకండక్టరు రంగంలో మానవ వనరుల నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఎంఒయులపై సంతకాలు జరుగుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. సింగపూర్‌కు చెందిన సంస్థల ద్వారా భారతీయ యువతకు సరైన నైపుణ్యం కల్పించడం, వారికి రిక్రూట్‌మెంట్లు ఉండటం వల్ల ఇకపై భారతీయ యువతరానికి సింగపూర్ ప్రధాన అవకాశాల వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News