Friday, March 1, 2024

కార్బన్ కట్టడికి గ్లోబల్ స్పందన అత్యవసరం

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : ప్రపంచస్థాయిలో వాతావరణ పరిరక్షణకు అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలి. గణనీయ రీతిలో కార్బన్ ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. దుబాయ్ వేదికగా ఆరంభమైన పర్యావరణ ప్రపంచ స్థాయి సదస్సు కాప్ 28లో ఆయన శుక్రవారం ప్రసంగించారు. కేవలం ఆషామాషీగా లేదా నామమాత్రంగా గ్లోబల్ వ్యర్థాల కట్టడికి దిగితే సరిపోదని, తులనాత్మక గణనీయ స్థాయిలో తగు విధంగా నియంత్రణ చర్యలకు దిగాల్సి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. వ్యర్థాల కట్టడి విషయంలో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంటుందని, గణాంకాలే ఈ విషయం స్పష్టం చేస్తున్నాయని ఆయన వివరించారు. భారతదేశ జనాభా ప్రపంచ జనాభాతో పోలిస్తే 17 శాతం ఉంది. అయితే వ్యర్థాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేవలం 4 శాతం కార్బన్ ఉద్గారాలే వెలువడుతున్నాయని వివరించారు. భారతదేశంలో ప్రజల ప్రాతినిధ్యంతో గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

దీనికి సంబంధించి ఇప్పటికే తమ దేశంలో గ్రీన్ క్రెడిట్ రూల్స్ వెలువరించినట్లు , ఈ ప్రక్రియతో ప్రజలలో సామూహిక రీతిలో పర్యావరణ వాతావరణ పరిరక్షణకు వీలేర్పడుతుంది. ప్రభుత్వ ప్రమేయం ద్వారా పర్యావరణ స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని వివరించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారతదేశ చర్యలకు కట్టుబడుతూ ఉంటామని తెలిపిన ప్రధాని 2028లో జరిగే కాప్ సదస్సు లేదా కాప్ 33 ఇండియాలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదించారు. కాప్ 28లో భాగంగా ఇక్కడ వివిధ దేశాధినేతల ఉన్నత స్థాయి ప్రాతినిధ్యపు భేటీలో ప్రధాని మాట్లాడారు. వాతావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచదేశాలకు ఇప్పుడున్న పరిస్థితులలో గత శతాబ్ధి తప్పిదాలను చక్కదిద్దుకునే సమయం లేదా చొరవ లేకుండా పోతోందని, ఇది చాలా ఆందోళనకరమైన విషయం అని ప్రధాని తెలిపారు. భూగోళ పరిరక్షణ దిశలో అత్యంత కీలకమైన ప్రతిపాదనను భారతదేశం తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా ప్రతి నివాసం ప్రతి పౌరుడు ఎప్పటికప్పుడు కార్బన్ ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకుంటూ , ఇదే సమయంలో కార్బన్ ఉద్గారాల వెలువడుతున్న తీరుతెన్నుల గురించి తెలుసుకుంటూ ఉంటారని,

కేవలం ఈ గ్రీన్‌కార్డు విధానానికి కట్టుబడితే వాతావరణ మార్పులను సరైన రీతిలో నియంత్రించేందుకు వీలేర్పడుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్ని కూడా ఈ పద్ధతిని పాటిస్తే వాతావరణ పరిరక్షణ విషయంలో సామూహిక భాగస్వామ్య ప్రక్రియకు దారితీస్తుందన్నారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు అటు పర్యావరణ పరిరక్షణకు మధ్య సరైన సమతూకత, సమన్వయం పాటించిందని తెలిపారు. ఇప్పుడు జరిగిన కాప్ ఆరంభ కీలక సదస్సులో ఈ సదస్సుకు అధ్యక్ష దేశం తరఫున సుల్తాన్ అల్ జబేర్‌తో పాటు ప్రధాని మోడీ, యుఎన్ తరఫు ప్రతినిధి సైమన్ స్టియిల్‌లు ఇద్దరే వేదికపై ఉన్నారు. వీరే మాట్లాడారు. గడిచిన శతాబ్ధ కాలంగా చూస్తే మానవాళిలోని అత్యల్ప శాతం వర్గం విచక్షణారహితంగా ప్రకృతి వనరులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీసింది. అయితే దీని దుష్ఫలితాలను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనం అనుభవించాల్సి వస్తోంది. మూల్యం చెల్లించుకోవల్సి వస్తోందని ప్రధాని తెలిపారు. ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ బాధిత ప్రాంతం అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్మూలన స్వీకరణల నడుమ సరైన సమతుల్యత ఉండాల్సి ఉంటుంది. ప్రగతి పనుల పేరిట తప్పనిసరిగా నిర్మూలనకు దిగాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో దీనిని సరిదిద్దుకునేందుకు సరైన విధంగా పునరుద్ధరణ అవసరం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన పరివర్తన ప్రక్రియ సముచితం సమ్మిళితం కావల్సి ఉందన్నారు. వాతావరణ మార్పుల కట్టడి విషయంలో సంపన్న దేశాలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు , అవసరం అయిన దేశాలకు అందించాల్సి ఉంటుందన్నారు. కార్బన్ జాడలను సంపన్న దేశాలు తమ వంతు బాధ్యతగా పూర్తి స్థాయిల్లో కట్టడి చేయాల్సి ఉంటుంది. కార్బన్ ఉద్గారాల నియంత్రణ విషయంలో ఈ దేశాలు 2052కు ముందే తగు చర్యలు తీసుకోవల్సి ఉంటుందని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News