Monday, April 29, 2024

స్కామ్ లా… స్కీములా?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలనపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
అవినీతికి కళ్లెం వేశాం.. దేశాన్ని దారికి తెచ్చాం
వారికి ఆ ఒక్క కుటుంబం తప్పితే పేదలు పట్టలేదు
11వ స్థానపు దేశాన్ని ఐదో స్థానంలోకి తెచ్చాం
ద్వారకాలో అతి పొడవు తీగల వంతెనకు ప్రారంభం
తరువాత సముద్ర గర్భంలోని శ్రీకృష్ణ మహానగర దర్శనం

దేవభూమి ద్వారకా : కాంగ్రెస్ పార్టీ తన శక్తినంతటిని కేవలం ఒకే ఒక్క కుటుంబం బాగుకు వెచ్చిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే కేవలం ఏక కుటుంబం అనే పద్థతిలో సాగుతోందని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాలో ఆదివారం ఆయన పలు ప్రాజెక్టుల ప్రారంభం, పనులకు పునాదిరాయి వేసిన తరువాత జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో భారీ స్కామ్‌లు సాగాయి తప్పితే పనులు జరగలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పది సంవత్సరాలలో అవినీతికి కళ్లెం వేసినట్లు, ప్రజా ఉపయుక్త పనులను చేపట్టినట్లు వివరించారు. కాంగ్రెస్‌ది ఫ్యామిలీ సెంటిమెంట్ల వైఖరి.

తమ ప్రభుత్వానిది కేవలం ప్రజా కేంద్రీకృత విధానం అని తేల్చిచెప్పారు. ద్వారక ప్రాంతంలో నిర్మించిన దేశ అతి పొడవైన తీగల వంతెన సుదర్శన సేతు ఆరంభం కీలకంగా మారింది.ఒకా, బెట్ ద్వారకా నడుమ ఈ వంతెన ఏర్పాటైంది. ఎన్నో ఏండ్లు దేశ పాలన సాగించిన పార్టీ నేతలకు సామాన్యుల బాధలు తీర్చాలనే చిత్తశుద్ధి, ధృఢసంకల్పం లేదని విమర్శించారు. అంకితభావం, ఉద్ధేశం లేకపోవడంతో సామాన్యుడి పరిస్థితి దుస్థితికి దారితీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏకైక కుటుంబం కోసం ఎప్పుడూ ఆలోచించే పార్టీకి దేశ పాలనా పగ్గాలు వచ్చినా? దేశ ప్రజలకు ఏమున్నది గర్వకారణం, వారి హయాంలో దేశానికి ఒరిగిందేమున్నది? అని ప్రశ్నించారు. ఒక్క కుటుంబం ధ్యాసలో సాగిన పార్టీ చివరికి ప్రజల ఆకాంక్షలను గాలికొదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎప్పుడూ ఐదేళ్లు తమ పాలన సాగించడంపైనే ఆలోచన ఉండేది. ఈ క్రమంలో స్కామ్‌లను కప్పిపుచ్చుకోవడంపై ఆలోచన ఉండేదని తెలిపారు. విస్తారిత దేశం ప్రజానీకపు కలలను తీర్చాలనే సంకల్పం కాంగ్రెస్‌కు ఏ కోశానా లేదని, దీనితో దేశం ఆర్థికంగా ప్రపంచ స్థాయిలో 11వ స్థానంలో నిలిచిందని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత భారతదేశం ఐదవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, త్వరలో మరింత గణనీయ ఆర్థిక శక్తి అవుతుందని తెలిపారు.

ముందుగా స్కామ్‌లకు కళ్లెం వేశాం
తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడికక్కడ స్కామ్‌లకు కళ్లెం వేయడం జరిగింది. దీనితో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు వీలేర్పడింది. దీనితోనే దేశ ప్రగతి పయనం సాధ్యం అయిందన్నారు. పలు రకాల మౌలిక సాధనాసంపత్తులను సమకూర్చుకోవడం ద్వారా ఇప్పుడు ఇక్కడ ద్వారకలో ఇటువంటి సుదీర్ఘ కేబుల్ వంతెనను సొంతంగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడు వెలిసిన వంతెన అత్యంత ప్రత్యేకమైనది. విశిష్ట నమూనా , ఇరువైపులా పాదచారుల దారి వెంబడి శ్రీకృష్ణుడి చిత్తరువులు, భగవద్గీత శ్లోకాలు పొందుపర్చారు.

తాను ఆరు సంత్సరాల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసినట్లు ,ఇప్పుడు దీనిని జాతికి అంకితం చేసినట్లు తెలిపారు. ఇది కృష్ణార్పణం వంటిదన్నారు. తమ తరహా అంతా కూడా మోడీ గ్యారంటీ అని చెపితే చేయడం , చేసేదే చేయడం అని ప్రకటించారు. గతంలో ప్రజాధనం అంతా పనుల పేరిట లూఠీ అయ్యేది. స్కామ్‌లు తప్పితే పనులు సాగకుండా పడి ఉండేవని తెలిపారు. ప్రతి పైసా పనికి అరపైసా అంతకు మించి మోసాలు జరిగేవని , వీటిని ముందుగా తాము నివారించామని, ఇందువల్లనే ఏ పని తలపెట్టినా అది సాధ్యమైనంత త్వరగా అత్యంత ప్రామాణికంగా రూపుదిద్దుకోవడం జరుగుతోందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News