Tuesday, April 30, 2024

గంగిరెద్దు ఎంపిలా… గర్జించే ఎంపిలా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: అధికారంలోకి రాకముందు 420హామీలు ఇచ్చి గుండు గీసి గుండుసున్నా పెట్టిన కాంగ్రెస్ పాలనపై రైతులను, ప్రజలను ‘మార్పు బాగుందా.. ?’ అని ప్రతి బిఆర్‌ఎస్ కార్యకర్త అడగాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూల్ జి ల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్‌రెడ్డి అ ధ్యక్షతన జరిగిన ఈ సన్నాహక సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ..కెసిఆర్ గొప్పతనం గుంపు మేస్త్రీ పనితనాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420కిపైగా హామీలిచ్చి వంద రోజులు కావస్తున్నా వాటిని అమలు చేసే దిక్కు లేదని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మబలికి మార్చి 9 సమీపిస్తున్నా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. మార్చి 17తో వారు చెప్పిన వంద రోజులు పూర్తవుతాయని, అప్పుడు కాంగ్రెస్ బొందలు తొవ్వడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి ఒక్క నోటిఫికేషన్ వేయకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఆ ఉద్యోగాలన్నీ తామే ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని భర్తీ చేయకపోతే ఉద్యమిస్తామన్నారు. ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను చూపి పబ్బం గడుపుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కెసిఆర్ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిగా చరిత్రలో శాశ్వతంగా నిలిచారని… చరిత్ర పుటల్లో ఉంటారన్నది రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ‘కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో బొంద పెడతామని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నీకంటే పెద్ద తీస్మార్‌ఖాన్‌లకే ఆ పని కాలేదని బుడ్డర్ ఖాన్ నువ్వెంత’ అని అన్నారు.

కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు, రైతులు తప్పు చేశామన్న భావనను బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారని అన్నారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల పాటు వంద కిలోమీటర్ల స్పీడుతో ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేశామని.. 24 ఏళ్ల పాటు కారు 100 కి.మీ. వేగంతో జోరుగా వెళ్లిందని, ప్రస్తుతం సర్వీసుకు మాత్రమే వెళ్లిందని, మళ్లీ తిరిగి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. సాగు, తాగునీరు, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించిన చరిత్ర ప్రజల కళ్ల ముందు ఉందన్నారు. అడ్డిమార్ గుడ్డి దెబ్బతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని దుయ్యబట్టారు. నల్గొండలో జరిగిన సభ రాజకీయ సభ కాదని, రైతాంగానికి సంబంధించిన బతుకు దెరువు సమస్య సభ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా జలాలను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు (కెఆర్‌ఎంబి) చేతిలోకి పెట్టిన దగుల్బాజీ సిఎం రేవంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా కెఆర్‌ఎంబికి కృష్ణా జలాలను అదించే హక్కులను కల్పించలేదని చెప్పిన రేవంత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కృష్ణా జలాలను తాగునీటి అవసరాల కోసం కెఆర్‌ఎంబికి లేఖ రాయమని చెప్పడం దీనికి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. కృష్ణా జలాలను కేంద్రానికి తాకట్టు పెట్టి విద్యుత్, సాగు, తాగునీటి కోసం కేంద్రం నుంచి అనుమతి తీసుకునే దుస్థితి కల్పించారని దుమ్మెత్తి పోశారు. కెఆర్‌ఎంబికి బాధ్యతలు అప్పజెప్పి కృష్ణా పరివాహక ప్రాంత రైతాంగానికి ముఖ్యంగా కరువుతో అల్లాడిన ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాలకు తీవ్ర అన్యాయం చేశారని, రైతులను జాగృతం చేసి ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించని బిజెపి, కాంగ్రెస్‌లకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదన్నారు. కోటి 24 లక్షల గ్యాస్ కనెక్షన్‌లకు రాయితీ కల్పించాలని, కోటి 5 లక్షల మీటర్ల కనెక్షన్లు ఉన్న ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడేమో ఫ్రీ కరెంట్ అన్నారని, ఇప్పుడేమో కొందరికే అంటున్నారని ఎద్దేవా చేశారు. కోటి 6 లక్షల మంది మహిళలకు చేయూత పథకం కింద రూ.2500లు ఇవ్వాలని, ఇవన్నీ వంద రోజుల్లో అమలు చేస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చి విస్మరించారని, వారికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. ్రఅధిష్టానం కనుసన్నల్లో ఉండే గంగిరెద్దు ఎంపిలు కావాలా, హక్కుల కోసం గర్జించే కెసిఆర్ సారధ్యంలోని ఎంపిలు కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లిలో గల్లా పట్టి తెలంగాణ హక్కుల కోసం అడిగే ధైర్యం గులాబీ జెండాకు మాత్రమే ఉందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నచ్చడం లేదని, వడ్డానం ఉండకూడదని అసెంబ్లీ సాక్షిగా చెబుతున్న రేవంత్‌రెడ్డి వారి ఇంటిలో పెళ్లి జరిగితే మాత్రం అందరికీ వడ్డాణాలుండాలంట అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా గెలిచి సెక్రటేరియట్‌కు వచ్చిన సిఎం రేవంత్ లంకె బిందెలు ఉంటాయని అనుకున్నా అవి ఏవీ లేవని చెప్పడం ఆయన గతంలో చేసే పనులకు దర్పణంగా అభివర్ణించారు.

అందెశ్రీ రాసిన తెలంగాణ గీతంలో గోల్కొండ ఖిల్లా, చార్మినార్ ప్రస్తావన ఉంటే పర్వాలేదంట కానీ రాష్ట్ర ముద్రలో మాత్రం చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉండకూడదని చెప్పడం వారిలోని అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని ఆయన దుయ్యబట్టారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ టికెట్ ఎవరికి ఇచ్చినా అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు ముక్తాకంఠంతో హామీ ఇచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో మాజీ ఎంఎల్‌ఎలు గువ్వల బాలరాజు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జెడ్‌పి చైర్‌పర్సన్ శాంతకుమారి, సాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు బైకాని శ్రీనివాసయాదవ్ ప్రసంగించారు. అంతకుముందు అచ్చంపేటలో గువ్వల బాలరాజు అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News