Monday, March 4, 2024

రైల్వే ఉత్పత్తి కేంద్రంతో ఉపాధి మెరుగు : ప్రధాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారతీయ రైల్వేలు ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌లో కాజీపేట గర్వించదగిన భాగస్వామిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ, పిఓహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ.6.109 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణంతో కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. తయారీ యూనిట్ నెలకు దాదాపు 200 వ్యాగన్‌లను ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం.. ‘సబ్కా సాథ్, సబ్ కా వికాస్’ కేంద్ర విధానమని ప్రధాని వివరించారు.

భారత్ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో తెలంగాణ ప్రజలదే కీలకపాత్ర అని అన్నారు. దేశ చరిత్రలో ఒక స్వర్ణయుగాన్ని చూస్తున్నామని, దేశ పురోగతిలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన అనుసంధానoపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అనేక సంవత్సరాలుగా వేలాది ఆధునిక కోచ్‌లు, లోకోమోటివ్‌ల ఉత్పత్తితో భారతీయ రైల్వేలు తయారీ రంగంలో నూతన శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ మాట్లాడుతూ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. గతి శక్తి పథకంలో భాగంగా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక నుంచి అమలు వరకు ప్రతి దశను సరైన రీతిలో చట్టబద్దంగా, సమన్వయం మరియు కమ్యూనికేషన్‌తో చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఫలితంగా ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారి అనుసంధానం 5,000 కిలోమీటర్లకు చేరుకుందని చెప్పారు. దేశంలో రహదారులు, రైల్వే రవాణా రంగాలు కొద్ది సంవత్సరాలుగా పెద్ద అభివృద్ధిని సాధించాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్టును 160 ఎకరాల్లో రూ.521 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఏడాదికి 2400 వ్యాగన్లను తయారు చేయాలని భావిస్తున్నారని తెలిపారు. రైల్వేశాఖ హైదరాబాద్-, యాదాద్రి ఎంఎంటిఎస్ ప్రాజెక్టును రూ. 350 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయ ప్రామాణిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు..
వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోసేవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత భద్రకాళి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఎంపి బండి సంజయ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్‌జైన్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News