Tuesday, December 10, 2024

విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను మాకు అప్పగించండి

- Advertisement -
- Advertisement -

బ్రిటన్ ప్రధానితో నరేంద్ర మోడీ
జి20 సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో మోడీ భేటీ
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో మోడీ సమావేశం
బ్యాంకులకు వేలాది కోట్లు ఎగవేసిన మాల్యా, నీరవ్ మోడీ
టెక్నాలజీలో సన్నిహిత సహకారానికి ఆత్రుతగా ఉన్నాం

రియో డి జనీరో : ఆర్థిక నేరగాళు విజయ్ మాల్యా, నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ను కోరారు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జి20 సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవుతున్నారు. బ్రిటన్ ప్రధానితోను ఆయన సమావేశం అయ్యారు. విజయ్ మాల్యా భారత్‌లో రూ. 9 వేల కోట్ల మేర బ్యాంకులకు ఎగవేసి, 2016లో బ్రిటన్‌కు పారిపోయాడు. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)ని మోసగించినట్లు 2018లో వెలుగు చూసింది. అతనూ బ్రిటన్‌లో తల దాచుకుంటున్నాడు.

నీరవ్ మోడీ తమ దేశంలోనే నివసిస్తున్నాడని 2018 డిసెంబర్‌లో బ్రిటన్ ప్రకటించింది. వారిద్దరినీ తమకు అప్పగించాలని భారత్ ఎప్పటికప్పుడు బ్రిటన్‌ను కోరుతోంది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వంఐదు సంవత్సరాల క్రితంఆమోదం తెలిపింది. తనను భారత్‌కు అప్పగించే అంశాన్ని నీరవ్ బ్రిటన్ కోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆర్థిక నేరగాళ్లను అప్పగింతపై బ్రిటన్ సానుకూల ధోరణితోనే ఉన్నప్పటికీ న్యాయపరమైన అంశాల వల్ల ఆ ప్రక్రియ క్లిష్టంగా మారుతోంది. కాగా, నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొని తమ దేశంలో ఉంటున్న వారు భారత్‌లోనే విచారణను ఎదుర్కొనాలని తాము కోరుకుంటున్నట్లు బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. మరొక వైపు మాల్యా, నీరవ్ మోడీతో పాటు పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దళారి సంజయ్ భండారిని కూడా రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.

ఇది ఇలా ఉండగా, టెక్నాలజీ, హరిత ఇంధన శక్తి, భద్రత, సృజనాత్మకత వంటి రంగాల్లో బ్రిటన్‌తో సన్నిహితంగా కృషి చేసేందుకు ఆత్రుతతో ఉన్నామని స్టార్మర్‌తో భారత ప్రధాని చెప్పారు. ‘రియో డి జనీరోలో ప్రధాని కీత్ స్టార్మర్‌తో అత్యంత ఉత్పాదక సమావేశం జరిపాను. భారత్‌కు యుకెతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో ప్రాథమ్యం ఉన్నది’ అని మోడీ ఆయనతో సమావేశం అనంతరం ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. ‘రానున్న సంవత్సరాల్లో టెక్నాలజీ, హరిత ఇంధన శక్తి, భద్రత, సృజనాత్మకత వంటి రంగాల్లో సన్నిహితంగా సహకరించుకునేందుకు ఆత్రుతగా ఉన్నాం. వర్తకం, సాంస్కృతిక సంబంధాలను కూడా చేర్చాలని వాంచిస్తున్నాం’ అని ప్రధాని తెలిపారు.

యుకె ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతున్న, తమ సమావేశానికి సంబంధించిన చిత్రాలను కూడా మోడీ తన పోస్ట్‌లో పంచుకున్నారు. ద్వైపాక్షిక సమావేశం ‘భారత్ యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు ఇచ్చింది’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఇటలీ, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్ సహా పలు దేశాల నేతలతో సమావేశం అయ్యారు. ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్‌ను కూడా కలుసుకున్నారు. అంతరిక్షం, ఇంధన శక్తి, ఎఐ వంటి రంగాల్లో సన్నిహితంగా పని చేసేందుకు మార్గాలపై వారు ఇద్దరు చర్చించుకున్నారు. అంతకు ముందు మోడీ యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకుని, కొద్ది సేపు మాటా మంతి సాగించారు. ఆ ఇద్దరి మధ్య ఏ అంశాలు చోటు చేసుకున్నాయో వెంటనే తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News