Sunday, June 23, 2024

ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం

- Advertisement -
- Advertisement -

Economists

మళ్లీ పుంజుకునే సామర్థం ఉంది, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపైనే దృష్టి పెట్టండి
బడ్జెట్‌కు ముందు ఆర్థికవేత్తలతో సమావేశంలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, మళ్లీ పుంజుకునే సామర్థ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు అంచనాలు 11ఏళ్ల కనిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం ప్రధాని గత కొద్ది రోజులుగా పలు రంగాలకు చెందిన ఆర్థికవేత్తలు, నిపుణులతో 12 మేధోమధన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

గురువారం నీతి ఆయోగ్ వద్ద ఆర్థికవేత్తలు, ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ పెట్టుబడిదారులు, వ్యాపార నాయకులు, వ్యవసాయ నిపుణులతో ప్రధాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2024 నాటికి 5 ట్రిలయన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్షంగా పనిచేయాలని వారికి మోడీ సూచించారు. సమావేశం తర్వాత ప్రధాని ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి మనం కట్టుబడి ఉండాలి’ అని అన్నారు. వివిధ అంశాలపై ఆర్థికవేత్తలతో లోతైన చర్చలు జరిపామని, దేశ పురోగతి కోసం అనేక సూచనలు అందించారని అన్నారు.

బడ్జెట్ ప్రక్రియలో ప్రభుత్వం బిజీ

బడ్జెట్ ప్రక్రియలో బిజీగా ఉన్న ప్రభుత్వం, జిడిపి వృద్ధి క్షీణించడంపై ఆందోళన చెందుతోంది. ఈసారి బడ్జెట్ సన్నాహాల్లో మోడీ చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల ప్రణాళికకు బ్లూప్రింట్ సిద్ధం చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలను కూడా కోరారు. వాటిని సమీక్షించడానికి మోడీ చాలా సమయం ఇస్తున్నారు.

జిడిపి వృద్ధి 11ఏళ్ల కనిష్టం

ఫిబ్రవరి 1న రాబోయే సాధారణ బడ్జెట్ కోసం ప్రధాని ప్రజల నుండి సలహాలు కోరారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారు. జిడిపి వృద్ధి 11 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. 2019-20లో వృద్ధి కేవలం 5 శాతం మాత్రమే ఉంటుందని కేంద్ర గణాంక విభాగం అంచనా వేసింది. ఇది జరిగితే ఇది 2008-09 తర్వాత అతి తక్కువ వృద్ధి ఇదే అవుతుంది. అంతకుముందు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశమై దేశ ఆర్థిక స్థితిగతులపై చర్చించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ఉపాధి కల్పనను పెంచే మార్గాలపై ఈ భేటీలో చర్చించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన రెండో సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. దేశీయ జిడిపి పడిపోవడం, ఇతర సంకేతాలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

2 గంటలపాటు భేటీ

నీతి ఆయోగ్ వద్ద 40 మంది ఆర్థికవేత్తలు, పరిశ్రమ నిపుణులతో మోడీ గురువారం 2 గంటలపాటు సమావేశం నిర్వహించారు. మోడీ దృష్టి 5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యంపైనే ఉంది. వినియోగం, డిమాండ్ పెంచే చర్యలపై ఆయన సలహాలను కోరారు. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్యమంత్రి పియూష్ గోయల్ కూడా హాజరయ్యారు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లేకపోవడం దిగ్భ్రాంతి కలిగించింది.

మోడీ 13వ సమావేశం

ఈ సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సిఇఒ అమితాబ్ కాంత్, ఇతర అధికారులతో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, వృద్ధిని పెంచే చర్యలపై మోడీ చర్చించారు. ఈ కాలంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలతో ఇతర రంగాల సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబెక్ డెబ్రాయ్ కూడా పాల్గొన్నారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక వ్యవస్థపై సమావేశం మోడీకి ఇది 13వ సమావేశం. అయితే బిజెపి ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌కు ముందే సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో మోడీతో సమావేశానికి రాలేకపోయారు. తొలిసారిగా ఆర్థిక మంత్రి సమావేశాల నుంచి మోడీ వేరుగా సమావేశమవుతున్నారు.

PM Narendra Modi Meets Economists

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News