Thursday, May 2, 2024

ఉద్యోగం పోయిందని కక్ష పెంచుకుని జనరల్ మేనేజర్‌పై కాల్పులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః మియాపూర్ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. హోటల్ మేనేజర్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి పిస్తోలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి సందీప్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దేబాశిష్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కేరళ రాష్ట్రానికి చెందిన రితీష్ నాయర్ మేనేజర్‌గా పనిచేశాడు. ఇద్దరు మియాపూర్ సందర్శిని ఎలైట్ ఇన్ హోటల్‌లో మేనేజర్లుగా చేరారు. ఇద్దరు కలిసి పనిచేశారు, ఈ క్రమంలోనే అదే హోటల్‌లోని జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీగా ఉంది.

దానికి ఇద్దరు పోటీ పడ్డారు. దేబాశిష్ బాగా పనిచేయడం, యజమానితో మంచి సంబంధాలు ఉండడంతో అతడిని జనరల్ మేనేజర్‌గా నియమించారు. తనకు రాకుండా దేబాశిష్‌ను జనరల్ మేనేజర్‌గా నియమించడం రితీష్ నాయర్‌కు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అంతేకాకుండా ఓ యువతి విషయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో దేబాశిష్ హోటల్ యజమానికి ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న హోటల్ యజమాని రితీష్‌ను నెల క్రితం ఉద్యోగం నుంచి తొలగించాడు. దేబాశిష్ వల్లే తన ఉద్యోగం పోయిందని రితీష్ నాయర్ కక్ష పెంచుకున్నాడు. ఉద్యోగం పోయిన తర్వాత నిందితుడు కోల్‌కతా, బీహార్ రాష్ట్రం వెళ్లి కంట్రీమేడ్ పిస్తోల్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చాడు.

దేబాశిష్‌ను హత్య చేసేందుకు హోటల్ వద్ద రెక్కీ నిర్వహించాడు. బుధవారం రాత్రి 7.30 గంటలకు బైక్‌పై వెళ్లిన రితీష్ సందర్శిని హోటల్ పార్కింగ్ వద్ద వేచి చూశాడు. రాత్రి 9.30 గంటలకు దేబాశిష్ హోటల్ నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళ్లేందుకు వస్తుండగా రితీష్ ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. అక్కడి నుంచి తప్పించుకున్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు కేరళ వెళ్లేందుకు మెట్రో స్టేషన్ వద్దకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ ఎస్‌ఓటి ఇన్స్‌స్పెక్టర్ శివప్రసాద్, మియాపూర్ ఇన్స్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, ఇన్స్‌స్పెక్టర్లు రవి, నరేందర్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News