Saturday, July 27, 2024

అందుకే నేను పోటీ చేయడం లేదు: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయకపోవడానికి గల కారణాన్ని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. దేశవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారం చేయడంపై దృష్టిని నిమగ్నం చేయాలన్న ఉద్దేశంతోనే తాను లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నానని ఒక జాతీయ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆమె తెలిపారు. తాను, రాహుల్ గాంధీ ఇద్దరం ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల బిజెపికి ప్రయోజనం చేకూరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. గత 15 రోజులుగా తాను రాయ్‌బరేలిలో ప్రచారం చేస్తున్నానని, రాయబరేలితో గాంధీ కుటుంబానికి చిరకాల బంధం ఉందని ఆమె తెలిపారు. దీంతో తాము ఇక్కడకు వచ్చి వారిని కలసి వారితో మాట్లాడతామని ప్రజలు కూడా ఆశిస్తారని, రిమోట్ కంట్రోల్‌తో ఎన్నికలను గెలవవడం సాధ్యం కాదని ప్రియాంక వ్యాఖ్యానించారు. కేరళలోని వయనాడ్‌తోపాటు ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కొనసాగుతోంది.

ఈ ఏడాది పారంభంలో రాయ్‌బరేలి నుంచి ఇక లోక్‌సభకు పోటీ చేయనని ప్రకటించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తాను, రాహుల్ గాంధీ ఇద్దరూ పోటీ చేస్తే తామిద్దరం ఆయా నియోజకవర్గాలకు ప్రచారం కోసం కనీసం చెరో 15 రోజులు కేటాయించాల్సి ఉంటుందని ప్రియాంక తెలిపారు. ఈ కారణంగానే తమలో ఒకరు దేశమంతటా ప్రచారం చేస్తే బాగుంటుందని భావించామని ఆమె వివరించారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం ఇవ్వలేదు. పార్లమెంట్ సభ్యురాలిని కావాలని లేదా ఎన్నికల్లో పోటీ చేయాలని నేను ఏనాడూ ఆలోచించలేదు. నాకు ఏ బాధ్యత అప్పగించినా పార్టీ కోసం పనిచేయాలని భావించాను. నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు భౠవిస్తే అప్పుడు పోటీ చేస్తాను అని ఆమె జవాబిచ్చారు. ఓడిపోతానన్న భయంతోనే ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ బిజెపి చేస్తున్న ఆరోపణ గురించి ప్రశ్నించగా బిజెపి వ్యూహంతో తమ పార్టీ నడవడం లేదని ప్రియాంక వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికల్లో ఓటమి పాలైన అమేథీ నుంచి రాహుల్ గాంధీ పారిపోయారంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణ గురించి ప్రశ్నించగా అమేథీ, రాయ్‌బరేలి స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వదులుకోదని ఆమె చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాలతో కాంగ్రెస్ అనుబంధం చాలా భిన్నమైందని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోడీ గుజరాత్‌లోని వడోర నుంచి ఎందుకు పోటీ చేయడం లేదని ప్రియాంక ప్రశ్నించారు. ప్రధాని మోడీ భయపడుతున్నారా?2014 తర్వాత ఆయన ఎందుకు వడోదర నుంచి పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి ఆయన పారిపోయారా? అని ప్రియాంక నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News