తన ఇస్లాం వ్యతిరేకతను తెలపడానికి ఇరాకీ వలసజీవి సల్వాన్ మోమికాను భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూ స్వీడెన్ పోలీసులు 2023లో అనుమతించారు. అతను స్వీడెన్ సెంట్రల్ మసీదు బయట ఖురాన్‌ను కాల్చాడు. 29 జనవరి, 2025న మోమికాను రాజధాని స్టాక్‌హోంలో చంపారు. ఈ హత్యలో విదేశీ ప్రభావం ఉండచ్చని ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ అన్నారు. ఉప ప్రధాని ఎబ్బా బుష్ ఈ హత్యను ఖండించారు. ఇది మా పారదర్శక ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. నిందితులను అరెస్టుచేశారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో స్వీడెన్ రాయబారి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. స్వీడెన్ రాయబారిని నగరం నుంచి బహిష్కరించారు. ఇది 1988లో ‘సైతాను శ్లోకాలు’ నవల రాసినందుకు కక్షతో సల్మాన్ష్ద్రీ పై 2022లో ఇరాన్ హత్యా ప్రయత్నం లాంటిది.
స్వేచ్ఛావాద స్వీడెన్ సమాజంలో భావప్రకటన స్వేచ్ఛలో భాగమైనా మతద్వేషం అపాయమని, దాన్ని హింసతో అరికట్టాలని భావించారు. ఖురాన్ దహన నేరానికి స్వీడెన్ రాజ్యం శిక్షించే ముందు మోమికాను చంపారు. ఫిబ్రవరి 4 న మరో నిందితుడు సల్వాన్ నాజెమ్‌కు అప్పీల్ అవకాశంతో శిక్ష, 4 వేల క్రోనార్ల జరిమానా విధించారు. నిందితులు మతవిమర్శ పరిధి దాటారని కోర్టు వ్యాఖ్యానించింది. స్వీడెన్ 20 వ శతాబ్దంలో మతనింద వ్యతిరేక చట్టాలను వదిలేసింది. కొన్నేళ్ళుగా స్కాండినేవియన్ దేశాల్లో మతోన్మాదం పెరిగింది. ప్రభుత్వాలు భావప్రకటన స్వేచ్ఛను నియంత్రించాయి. గతేడాది డెన్మార్క్ మతనింద నిరోధ చట్టాలను పునరుద్ధరించింది. స్వీడెన్ మతవిద్వేష చట్టాలను అమలుచేస్తోంది. మత తాత్వికత, మత గ్రంథా లు, మత విమర్శలను అడ్డుకుంటోంది. ప్రపంచ మతవిద్వేష నియంత్రణ చట్టాలతో పోల్చితే స్వీడెన్ శిక్షలు తక్కువ. ఇరాన్ లాంటి దేశాల్లో మత విమర్శకు మరణదండనే. ఇంగ్లండ్ నిఘాను పెంచింది. 1984 లో పెద్దన్న మిమ్ము గమనిస్తున్నాడని టివిలలో ప్రజలను హెచ్చరించింది. అంతర్జాల ఆగడాలపై తీవ్ర చర్యలతో 2024లో సామాజిక మాధ్యమాలను కట్టడి చేసింది. యుకె పౌరుడు మార్టిన్ ఫ్రాస్ట్ కూతురును పాలస్తీనాపై యుద్ధంలో ఇజ్రాయెల్ చంపింది.
మోమికా హత్యకు నిరసనగా ఫ్రాస్ట్ ఖురాన్‌ను కాల్చాడు. అతనిపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. మతవిద్వేష నియంత్రణ చట్టాలను ఇంగ్లండ్ 2008లో రద్దు చేసింది. ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథం. దానిపై నీ ఇష్టా ప్రవర్తన వారికి తీవ్ర బాధను కలిగిస్తుంది. మనది సహనశీల దేశం. అయినా ఖురాన్ దహనాన్ని సహించదు అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నాజీలు ఆర్యేతర మత సాహిత్య, చరిత్ర పుస్తకాలను కాల్చిన పక్షపాత ధోరణి ఖురాన్ ప్రతుల దగ్ధంలో కనిపిస్తుంది. నాజీలు కాల్చిన పుస్తకాలు, భవనాలు, తీసిన ప్రాణాలు యూదులవి. ఇస్లాం- ద్వేషంతో ఇస్లామేతరులు కాలుస్తున్న పుస్తకాలు వారివే. కూలుస్తున్న మసీదులు, చర్చిలు, కట్టడాలు దేశచారిత్రక సంపద. బైబిల్, గాంధీ, అంబేద్కర్ విగ్రహాల అపవిత్రం, సంఘ్ జాతీయ పతాకాన్ని అవమానించడం ఉన్మాదాలే. ఏ ప్రేరణతో చేసినా ఆక్షేపణలే. ఉదారవాద సమాజాలు అపచారాలను నేరమయం చెయ్యవు. ప్రతి ప్రత్యామ్నాయ చర్యా సంఘ్ మనోభావాలను ‘నొప్పించినట్లు’ ఇతరుల ప్రతి చర్యా కొందరి అవమానం. మత భక్తులకు సమాజ చర్యలు తమ నమ్మకాల, గ్రంథాల, మతచిహ్నాల భంగాలు. మతచర్యలు నాస్తికులకు అస్తవ్యస్తమే. ఒక జాతీయతకు మరొక జాతీయత నియమప్రవర్తనలు అగౌరవాలు. స్త్రీ పురుషులకు పరస్పర అసభ్యకర సంభాషణలు అభ్యంతరాలు. పురుషాధిపత్య హాస్యాలు స్త్రీల అవమానాలు.
ఇవన్నీ సమాజంలో ఉదార రహిత, అసహన భాగాలు. విస్తృతంగా అనువర్తించే విద్వేష నియంత్రణ చట్టాలు హాస్యం, కళాత్మకత, సృజనాత్మకత, చర్చలేని ఆధిపత్యానికి దారితీస్తాయి. ద్వేషపూరిత, అవమాన ఉపన్యాసాల నియంత్రణ చట్టాలను కొందరి భావాలను నిరోధించడానికే ఉపయోగిస్తారు. ఐరోపా దేశాల్లోనూ ఇప్పుడు ముస్లిం వ్యతిరేక కార్యక్రమాలు పెరిగాయి. ఆ ప్రభుత్వాల ముస్లిం వ్యతిరేక మద్దతును పారదర్శక, ప్రజాస్వామ్య సమాజాలు సమర్థించవు. విద్వేష నియంత్రణ చట్టాలను మైనారిటీల, అణగదొక్కబడిన వర్గాల నోర్లు మూయించడానికి వాడిన ఉదంతాలు చరిత్రలో ఉన్నాయి. నియంత్రణ చట్టాల పక్షపాతంతో ద్వేషం, అసహనం తలెత్తుతాయి. బాధితులకే అన్యాయం జరుగుతుంది. పీడితుల ప్రశాంత నిరసనల నిరాకరణతో అశాంతి, హింస, అసాంఘిక చర్యలు పెరుగుతాయి. సామాజిక విభేదాల, సంఘర్షణల నిలుపుదలకు వాక్ స్వాతంత్య్రం తప్పనిసరని పరిశోధనలు నివేదిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల, ఇంటర్‌నెట్, స్మార్ట్ ఫోన్ల యుగంలో పాలకవర్గ ఆధిపత్య నియంత్రణ, పాలితవర్గ పక్షపాతం, మత సామరస్యం అవసరం.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 94902 04545