Tuesday, March 18, 2025

సుంకాలపై రణమా.. శరణమా?

- Advertisement -
- Advertisement -

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన నాటినుండీ దూకుడుగా వ్యవహరిస్తూ వాణిజ్య భాగస్వామ్య దేశాలు దిగుమతి సుంకాలు భారీగా తగ్గించకపోతే అమెరికా కూడా దీటుగా ప్రతీకార సుంకాలు విధిస్తుందని బెదిరించడం అనేక దేశాలకు కలవరం కలిగిస్తోంది. అమెరికాను మళ్ళీ గొప్పదేశంగా, ప్రబల ఆర్థికశక్తిగా రూపొందిస్తామని ట్రంప్ చెప్పడం శ్వేత జాతీయులకు, ఎలాన్‌మస్క్ వంటి ఆయన మద్దతుదారులకు శ్రవణ పేయంగా ఉన్నా సుంకాలపోరు వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందేమోనని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ట్రిలియన్ డాలర్ల ద్రవ్యలోటులో ఉన్న అమెరికా పారిశ్రామిక రంగం కూడా సమస్యలతో సతమతమవుతున్నది. అమెరికాలో ఆదాయపు పన్ను శాఖను అంతర్గత రెవెన్యూ శాఖగా వ్యవహరిస్తారు. ఇప్పుడు విదేశీ రెవెన్యూ శాఖను ఏర్పరచి విదేశీ కంపెనీలు, వాణిజ్య సంస్థలనుండి సుంకాల పెంపుద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జించి అమెరికా ఆర్థిక శక్తిని పెంచుతామని ట్రంప్ అంటున్నారు.

ఎగుమతులు చేస్తున్న అన్ని దేశాలకు అమెరికా అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా వుంది. అయితే ఇలా ఎగుమతులు చేస్తున్న దేశాలు అమెరికా నుండి వచ్చే వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తూ ఆదాయం పొందుతూ, లాభపడుతూ సొంత పరిశ్రమలను కాపాడుకుంటూ అమెరికాకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని, అమెరికా ఎగుమతిదార్ల ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నాయని ట్రంప్ ధ్వజమెత్తుతున్నారు. వివిధ దేశాల నుండి వచ్చే వివిధ రకాల వస్తువులపై వేర్వేరు సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధమే అయినా ట్రంప్ ఖాతరు చేయడం లేదు. దిగుమతి సుంకాలు పెంచడం వల్ల వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగినా ట్రంప్ పట్టించుకోవడం లేదు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సంపన్న దేశాల ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు విధించడం ద్వారా తమ సొంత పరిశ్రమలను రక్షించుకునే వెసులుబాటు ఉండేది. ఆదిలో ధనికదేశాలు వీటిని అంతగా పట్టించుకోలేదు. వర్ధమాన దేశాలలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉండటం, మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం, రుణసౌకర్యాలలేమి, వడ్డీరేట్లు అధికంగా ఉండటం, కార్మికుల ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వస్తూత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండి సంపన్న దేశాలతో పోటీపడలేవు. అందుకే గతంలో గాట్, ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల్లో బడుగు దేశాలకు అధిక దిగుమతి సుంకాలు విధించుకునే వెసులుబాటు కల్పించాయి.

యాంత్రీకరణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల సంపన్న దేశాల వస్తూత్పత్తి వ్యయం తక్కువ గనుక ధనిక దేశాలతో పేదదేశాలు పోటీపడలేకున్నాయి. వ్యవసాయేతర వస్తువులపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించాలని, లేదంటే ఆయా దేశాలపై దీటుగా సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌కే మిగులు ఉన్నందున మన దేశం అమెరికాకు అవసరమైన మరిన్ని వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా ఆ లోటును భర్తీ చేయవలసి వుంది. ఎగుమతులు పెరగాలంటే అమెరికా సుంకాలు సముచితంగా ఉండాలి. భారత్ దిగుమతి సుంకాలు ఎక్కువగా విధిస్తున్నందున దానికి దీటుగా సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఎగుమతి దిగుమతులలో ఉభయతారకమైన రీతిలో సంస్కరణలు చేపట్టి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. 2015 నుండి నాలుగైదు శాతం, వ్యవసాయేతర ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు 15% పెరిగాయి. అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతం వాణిజ్యం పెరిగింది. ఏప్రిల్, డిసెంబర్‌లో 45 బిలియన్ల వాణిజ్యం జరిగింది. భారత్‌కు 60 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుంది. సమాచార సాంకేతిక విజ్ఞానం, ఐటి సేవల ఎగుమతులు పెరిగాయి. భారత్ 17 శాతం దిగుమతి సుంకాలు విధిస్తుండగా, అమెరికా విధిస్తున్నది 3.3 శాతం. 60 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో అమెరికా తదితర దేశాలకు 30 బిలియన్ స్మార్ట్ ఫోన్‌లే ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి.

అమెరికా గనుక భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచితే మందులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్, ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల ధరలు పెరిగి పోటీకి నిలవలేకపోవడం, దేశీయంగా ఉత్పత్తి తగ్గించవలసి రావడం, లే ఆఫ్‌లు, పాక్షిక నిరుద్యోగానికి దారితీయవచ్చు. సానబట్టిన వజ్రాలు, శుద్ధిచేసిన చమురు ఉత్పత్తులు, వాటిలో వాడేందుకు దిగుమతులు ఎక్కువ గనుక పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అమెరికా నుండి మరింత ముడిచమురు కొనుగోలుపై చర్చలు జరుగుతున్నాయి. ఖరీదైన హార్లీ దేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు, బోర్బన్ విస్కీ దిగుమతులపై ప్రధాని మోడీ పర్యటనకు ముందే మన దేశం సుంకాలు తగ్గించి అమెరికాను ప్రసన్నం చేసుకుంది. అమెరికాకు భారత్ సాఫ్ట్‌వేర్ ఎగుమతులు ఎక్కువ గనుక వాటిపై దిగుమతి సుంకాలు పెంచితే భారత్‌కు నష్టం. అమెరికా పెద్ద సాఫ్టవేర్ కంపెనీలైన ఇవై, ఆక్సెంచర్, ఐబిఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్, జైన్ ప్యాక్ట్ తదితర కంపెనీలలో వేలాది మంది భారతీయులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె నగరాల్లో, అమెరికాలోని వివిధ నగరాలలో పని చేస్తున్నారు. భారత్ ఐటి ఇంజనీర్ల సామర్థ్యంపై అమెరికా కంపెనీలకు కొండంత నమ్మకముంది. న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, వర్జీనియా సహా పలు రాష్ట్రాలు, నగరాలలో వేలాది మంది భారతీయులు పని చేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు ఎంతో దోహదపడుతున్నారు.

ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, సూపర్ అధ్యక్షుడిగా పేరొందిన అమెరికా పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్ భారత్‌లో వాణిజ్య విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలలో 3.3 ట్రిలియన్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. చైనా 2.6 ట్రిలియన్లు, జర్మనీ 1.5 ట్రిలియన్ల వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాయి. నెదర్లాండ్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, భారత్, హాంకాంగ్, దక్షిణ కొరియాలది ఆ తర్వాత స్థానం. వాటికి కస్టమ్స్ సుంకాలను పెంచే శక్తి వుంది. అమెరికా 180 దేశాల నుండి వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల దిగుమతి సుంకాలు పెంచుతామని ట్రంప్ చేసే హెచ్చరికల అమలు సాధ్యం కాకపోవచ్చు. ఈలోగా బెదిరింపుల ద్వారా కొంతైనా ఫలితం సాధించాలని ట్రంప్ ఎత్తుగడ. సేవల ఎగుమతులపై ట్రంప్‌కు అంత పట్టింపులేదంటున్నారు. మన దేశం నుండి మందులు ఔషధాలు, టెలికాం, ఎలక్ట్రానిక్, జౌళి వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, కంప్యూటర్లు, ఆటో విడిభాగాలు, జౌళి వస్త్రాల తయారీ యంత్రాల ఎగుమతులు ఎక్కువ. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తి అమెరికాలో లేనందున వాటి దిగుమతులు తప్పవు. పూర్తిగా తయారైన వాహనాలపై ప్రస్తుతం భారత్ విధిస్తున్న 125 శాతం సుంకాన్ని 20 శాతానికి తగ్గించాలని అమెరికా డిమాండ్. అలా చేస్తే ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులకు మేలు. ట్రంప్ ప్రారంభించిన సుంకాల పోరు, వాణిజ్య యుద్ధాలకు సదా సంసిద్ధమని, వెనక్కు తగ్గేది లేదని చైనా ఇప్పటికే స్పష్టం చేసింది. మెక్సికో, కెనడా, చైనా తదితర దేశాలు కూడా ప్రతీకార సుంకాలు విధించాయి. భారత్ కూడా భారీగా సుంకాలు విధిస్తున్నందున దీటుగా చర్యలుంటాయని, మినహాయింపు లేదని ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మన వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ హుటాహుటిన అమెరికా వెళ్లి వాణిజ్య మంత్రితో, అధికారులతో వారం రోజులపాటు చర్చలు జరిపి వచ్చారు.

ప్రస్తుతం భారత పారిశ్రామిక ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, సహకారాన్ని పెంపొందించుకోవాలని సంయుక్త ప్రకటనలో ఆకాంక్షించారు. గ్రీన్‌లాండ్‌ను, గాజాను కొంటాం, పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం, కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేసుకుంటాం అని ట్రంప్ బెదిరిస్తూ, చైనాను కట్టడి చేసేందుకు యత్నిస్తూ భారత్ పై అప్పుడప్పుడూ ఉరుముతున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని, గాజా సంఘర్షణలను ఆపాలనే ఆకాంక్ష, ప్రయత్నాలు మంచివే. చైనా, రష్యాలు ఇప్పుడు ప్రబల శక్తులు. 143 కోట్ల జనాభా గల భారత్ అమెరికాకు అతిపెద్ద మార్కెట్. అలాంటి కీలకమైన భారత్ పై అమెరికా ఆచితూచి వ్యవహరిస్తేనే ఉభయతారకం. మునుపటి అధ్యక్ష ఎన్నికలలో ‘అబ్ కీ బార్.. ట్రంప్ సర్కార్’ అని ఊదరగొట్టినా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి బైడెన్ గెలిచారు. ప్రస్తుత పరిస్థితులలో సమస్యలపై రణమా? శరణమా? లేక రాజీమార్గమా అనే విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. భారత ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తూ అగ్రరాజ్యంతో ఉభయతారకంగా, ప్రపంచ శాంతికి దోహదపడేలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంది.

పతకమూరు
దామోదర్ ప్రసాద్
94409 90381

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News