Sunday, December 3, 2023

మళ్ళీ తలెత్తకూడదు

- Advertisement -
- Advertisement -

పంజాబ్‌లో సిక్కు టెర్రరిస్టు పంజా మళ్ళీ పదునెక్కుతున్నదా? 1980 దశకం నాటి హింసాయుత తిరుగుబాటు రోజుల్లోకి ఆ రాష్ట్రం మళ్ళీ జారుకుంటున్నదా? పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో ఆనాటి భయంకర అధ్యాయం తిరిగి ఆరంభమవుతున్నదనే సూచనలు కనిపించడానికి ఎవరిని బాధ్యులను చేయాలి? ఏడాది క్రితం మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం అసమర్థతే ఇందుకు కారణమనుకోవాలా? భింద్రన్ వాలే అనుచరుడినని చెప్పుకుంటూ సునిశిత ఆయుధాలు చేపట్టిన అనేక మంది అనుచరులతో ఎదురు లేకుండా సంచరిస్తున్న 30 సం॥ అమృత్‌పాల్ సింగ్ ఎగరేసిన తిరుగుబాటు జెండా ఆ రాష్ట్రంలో ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను వెతకవలసిన అవసరం జాతి భద్రత రీత్యా ఎంతైనా వుంది.

గత నెల 23వ తేదీన పశ్చిమ పంజాబ్‌లోని అజ్నాలా పోలీసు స్టేషన్‌పై అమృత్‌పాల్ సింగ్ తన సాయుధ అనుచర గణంతో దాడి చేసి అక్కడ నిర్బంధంలో వున్న తన అనుచరుడు లౌప్రీత్ సింగ్‌ను విడిపించుకొన్న ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. పాకిస్తాన్‌తో గల అంతర్జాతీయ సరిహద్దుకు కొద్ది కి.మీ చేరువలో వున్న అజ్నాల్ ఉదంతం ఆప్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టింది. దాడి చేసిన వారిపై కేసు పెట్టలేకపోయిన పోలీసుల అసమర్థతను స్థానికులు ఎండగడుతున్నారు. సిక్కు తీవ్రవాదం తిరిగి ప్రబలితే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగి జన జీవనం అల్లకల్లోలమవుతుందని, తమ వ్యాపారాలు సజావుగా సాగవని వారు భయభ్రాంతులవుతున్నారు. కేంద్రంలోని బిజెపి పాలకులు ప్రోత్సహిస్తున్న హిందూత్వ శక్తుల అప్రజాస్వామిక పోకడలే పంజాబ్‌లో సిక్కు టెర్రరిజం తిరిగి తలెత్తుతూ వుండడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

హిందు రాష్ట్ర గురించి మాట్లాడుతున్న శక్తులను ప్రధాని గాని, కేంద్ర హోం మంత్రి గాని నిరోధించగలరా అని అమృత్‌పాల్ సింగ్ ప్రశ్నించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాడు. హిందు మతతత్వ శక్తులు నిరాటంకంగా తమ మత భావనలను వ్యక్తం చేస్తున్నప్పుడు సిక్కులు అలా వ్యవహరించడానికి గల అభ్యంతరం ఏమిటి అని అమృత్‌పాల్ సింగ్ ప్రశ్నిస్తున్నాడు. ఫిబ్రవరి 23 నాటి ఘటన తర్వాత ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడిన తీరు కూడా టెర్రరిజం తిరిగి చోటు చేసుకొంటున్నదనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నది. ఖలిస్తాన్ మద్దతుదార్లకు పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాల నుంచి సహాయం అందుతున్నదని ఆయన అన్నారు. అయితే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రజలు బలపర్చడం లేదని వారి వెంట అతి కొద్ది మాత్రమే వున్నారని ఆయన అన్నారు. వారి నుంచి ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులనైనా తమ పోలీసులు సునాయాసంగా ఎదుర్కోగలరని చెప్పుకొన్నారు. కాని ఆ రోజు అజ్నాలా పోలీసు స్టేషన్‌పై దాడిలో పాల్గొన్న అమృత్‌పాల్ సింగ్ అనుచరులు అత్యధిక సంఖ్యలో వుండడంవల్లనో, వారి చేతిలోని సిక్కుల పవిత్ర గ్రంథాన్ని చూసి నిగ్రహం పాటించినందువల్లనో పోలీసులు ఏమీ చేయలేకపోడం ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నది. తాము తమ ఉజ్వల భవిష్యత్తును, భద్రతను కోరి ఎన్నుకొన్న ప్రభుత్వం ఇటువంటి అరాచక మూకలను ఏమీ చేయలేకపోడం వారిలో భయాన్ని కలిగించడం సహజాతి సహజం.

ఆ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు కూడా. అందుకు బాధ్యులపై ఇప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. అయితే పోలీసులు గనుక ఆ మూకపై ఏమైనా చర్య తీసుకొని వుంటే అది మరింత తీవ్రమైన పర్యవసానాలకు దారి తీసి వుండేదనే అభిప్రాయం కూడా లేకపోలేదు. అదేమైనప్పటికీ ఆయుధాలు చేపట్టి చెలరేగిన శక్తులను అదుపు చేయడం ప్రభుత్వాలు, వాటి పోలీసుల బాధ్యత. ఈ మాటనే అక్కడి ప్రజలు కూడా అంటున్నారు. ఆప్ ఢిల్లీ మోడల్ పరిపాలన అంటే చవక విద్యుత్తు, నాణ్యమైన చదువు వంటి నగర ప్రజల అవసరాలను తీర్చడానికి, సరిహద్దు రాష్ట్రంలో భద్రతను కాపాడే సామర్థం కలిగి వుండడానికి తేడా వున్నది. ఈ ఘటన నుంచి భగవంత్ మాన్ ప్రభుత్వం పాఠాలు వీలైనంత తొందరగా నేర్చుకోవాలి.

2015లో ఫరీద్ కోటలోని బుర్జ్ జవహర్ సింగ్ వాలా అనే చోట గల గురుద్వారా నుంచి పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్‌ను తస్కరించిన ఉదంతం సిక్కుల మనోభావాలను దెబ్బ తీసిన మాట వాస్తవం. ఈ ఘటనకు నిరసనగా జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న కిషన్ భగవాన్ సింగ్ అనే వ్యక్తి పోలీసు కాల్పుల్లో మరణించడం మరిన్ని ఉద్రిక్త ఘటనలకు దారి తీసింది. ఇటువంటి నేపథ్యంలో అన్ని విధాలా మెరగైన పరిపాలనను అందించడం ద్వారా పంజాబ్‌ను మరో సిక్కు ఉగ్రవాద ఉత్పాతం నుంచి కాపాడవలసిన బాధ్యత ఆప్ ప్రభుత్వంపై వుంది. అలాగే దేశంలో హిందూత్వ శక్తుల అరాచకాలను అరికట్టడం ద్వారా ఇటువంటి మైనారిటీ మతోన్మాదం చెలరేగకుండా చూడవలసిన కర్తవ్యం కేంద్ర పాలకులది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News