Sunday, April 28, 2024

గాంధీభవన్‌లో గడబిడలు

- Advertisement -
- Advertisement -
ప్రతిరోజూ గాంధీభవన్ వద్ద నిరసనలు
మునుగోడు, భువనగిరిలో ముందుగా నిరసనలు ప్రారంభమై…
మరో 18 నియోజకవర్గాలకు పాకిన ఈ రగడ
శనివారం గాంధీభవన్‌కు వచ్చిన రేవంత్‌కు తప్పని నిరసనలు
పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెండ్ చేస్తామని
హెచ్చరించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్ష నియామకాలపై నిరసనలు చేపట్టిన కార్యకర్తలు, నాయకులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యల కింద వారిని సస్పెండ్ చేస్తానని ఆయన ప్రకటించారు. గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని రేవంత్ రెడ్డి సూచించారు. కొన్ని రోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఇదే విషయమై అనేక నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన గాంధీభవన్ వచ్చే సరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. దీంతో నిరసనలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు రేవంత్ సమాధానం ఇస్తూ ఆలేరు నియోజకవర్గంలో 8 ఉండగా అందులో 7 ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీర్ల ఐలయ్య, ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు చెప్పిన వాళ్లకే ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన ఒక్క మండలం మహిళకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఆందోళన విరమించకుంటే సస్పెండ్ చేసేందుకు వివరాలు సేకరించాలని గాంధీభవన్ ఇన్‌చార్జీ, పిసిసి ఉపాధ్యక్షుడు కుమార్ రావును రేవంత్ ఆదేశించారు.
శంకర్ నాయక్‌ను సస్పెండ్ చేయాలి
తుర్కపల్లి మండల నేతలు వెంటనే ధర్నా ఆపేయాలని నియోజవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్యకు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మొన్నటివరకు మండల కమిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న శంకర్ నాయక్‌ను సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పిసిసి క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి రేవంత్ సూచించారు.
ఏమైనా అభ్యంతరాలు ఉంటే…
కమిటీల నియామకంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డిలకు వినతి పత్రం ఇవ్వాలని రేవంత్ స్పష్టం చేశారు. ఆ వినతులపై పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. ఇదే విషయాన్ని ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరికి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలియజేశారు.
మునుగోడు, భువనగిరిలో ప్రారంభమై అన్ని నియోజకవర్గాల్లో…
ముందుగా కాంగ్రెస్ పార్టీలోని మండల కమిటీల నియామకాలు మునుగోడు, భువనగిరి నియోజకవర్గంలో కాకపుట్టించాయి. గత వారం చిన్నగా మొదలైన లొల్లి ఇప్పుడు తీవ్రసమస్యగా మారింది. ప్రస్తుతం ఈ సమస్య గజ్వేల్, ఖానాపూర్, ఖమ్మం, రామగుండ, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, మహేశ్వరం, కల్వకుర్తి, ఆలేరు, కోదాడ, సిద్దిపేట, నారాయణఖేడ్, జనగామ, పాలకుర్తి, ఎల్లారెడ్డి, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పెను దుమారాన్ని సృష్టించింది. ఈ నియోజకవర్గాల నాయకులు ప్రతిరోజూ గాంధీభవన్‌కు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News