Friday, March 29, 2024

పొంగల్ ఇన్విటేషన్‌తో మళ్లీ వివాదం రేపిన గవర్నర్

- Advertisement -
- Advertisement -

చెన్నై:తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్. రవి , ఎంకె. స్టాలిన్ ప్రభుత్వం మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. గవర్నర్ రవి ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని తమిళనాడు అసెంబ్లీ ఇటీవల తీర్మానించడం, గవర్నర్ వాకౌట్ చేయడం సంచలనమైంది. తాజాగా గవర్నర్ ‘పొంగల్’ ఇన్విటేషన్ సరికొత్త వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఈనెల 12న పొంగల్ సెలబ్రేషన్ ఉందంటూ వివిఐపీలు, ఇతర ప్రముఖులకు గవర్నర్ రవి, ఆయన భార్య లక్ష్మీ రవి పేరుతో ఆహ్వానాలు పంపారు. ఈ ఆహ్వానంలో తమిళనాడు ప్రభుత్వం అనే పదానికి బదులు ‘తమిళగం’ అనే పదాన్ని ఉపయోగించారు. రాష్ట్ర చిహ్నం కూడా ఈ ఇన్విటేషన్‌లో చోటుచేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ చిహ్నాన్ని మాత్రమే ఉపయోగించారు. ఇంగ్లీషు వెర్షన్ ఆహ్వానంలో మాత్రం తమిళనాడు గవర్నర్ అనే పదాన్ని వాడారు.

రాష్ట్రానికి తమిళనాడు అనే పేరు కంటే ‘తమిళగం’ అనే పేరు సరైనదని గత వారం జరిగిన ఒక సమావేశంలో గవర్నర్ రవి చెప్పడాన్ని డిఎంకే, అన్నాడిఎంకే సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. గత ఐదు దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని గవర్నర్ వ్యాఖ్యానించడం, ‘తమిళనాడు’ను ‘తమిళగం’ అని పేరు మార్చాలని బహిరంగ సభల్లో ప్రకటించడం తదితరాలన్నీ గవర్నర్‌ పట్ల అధికారపక్షంలో ఆగ్రహం రేపుతున్నాయి.

గత సోమవారం అసెంబ్లీలో 48 పేజీల ఆంగ్ల ప్రసంగాన్ని చదివిన ఆయన ‘తమిళనాడు’, ‘ద్రావిడ’ అనే పదాలకు బదులుగా ప్రత్యామ్నాయ పదాలను వినియోగించారు. ఈ ప్రసంగ పాఠంలో 33 చోట్ల ఉన్న ‘తమిళనాడు ప్రభుత్వం’ అనే పదాలకు బదులుగా ‘ఈ  ప్రభుత్వం’ అంటూ ఉచ్ఛరించారు. దీంతోపాటు ద్రావిడ సిద్ధాంత కర్త పెరియార్‌, డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, డిఎంకే నేత కరుణానిధి, అంబేడ్కర్‌, కామరాజర్‌ల పేర్లున్న ఓ పేరాను పూర్తిగా వదిలేశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి’’, ‘‘ఎన్ని కష్టాలెదురైనా తమిళభాషను కాపాడుకుందామన్న మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడచుకుంటోంది’’ అనే వాక్యాలను కూడా వదిలేశారు.

గవర్నర్‌ తీరుతో తీవ్ర దిగ్ర్భాంతికి గురైన స్టాలిన్‌.. ఆ ప్రసంగం పూర్తయిన వెంటనే ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గవర్నర్‌ ఆమోదంతోనే ప్రసంగ పాఠాన్ని ముద్రించినా, ఆయన రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఆ పాఠాన్ని పూర్తిగా చదవకపోవడం రాష్ట్ర శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధమని దుయ్యబట్టారు. గవర్నర్‌ ఆమోదంతో సభ్యులందరికీ పంపిణీ చేసిన ఆంగ్ల ప్రసంగం యథాతథంగా సభ రికార్డుల్లో పొందుపరచాలని, అదే విధంగా ప్రసంగ పాఠంలో లేకుండా గవర్నర్‌ చదివిన వాక్యాలను సభ రికార్డుల్లో పొందుపరచరాదని తీర్మానంలో పేర్కొన్నారు. సీఎం ప్రసంగిస్తుండగానే తన కార్యదర్శిని పిలిపించుకుని విషయం తెలుసుకున్న గవర్నర్‌.. ఒక్కసారిగా పైకిలేచి రుసరుసలాడుతూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News