Sunday, April 28, 2024

ఐసిసి టి20 ర్యాంకింగ్స్..రవి బిష్ణోయ్ టాప్

- Advertisement -
- Advertisement -

దుబాయి: అతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్‌లో భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న బిష్ణోయ్ 699 రేటింగ్ పాయింట్లతో ఈసారి ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో బిష్ణోయ్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచి జట్టుకు సిరీస్ అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఐదు మ్యాచుల్లో తొమ్మిది వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు.

ఇదే సమయంలో మెరుగైన ప్రదర్శనతో రేటింగ్ పాయింట్లను మెరుగు పరుచుకుని ఏకంగా టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. కొంత కాలం క్రితమే అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన బిష్ణోయ్ స్వల్ప సమయంలోనే నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుని చరిత్ర సృష్టించాడు. కాగా, అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. వనిందు హసరంగ (శ్రీలంక) మూడో, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) నాలుగో, మహీశ్ తీక్షణ (లంక) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. మరోవైపు టి20 బౌలింగ్‌లో టాప్10 ఉన్న ఏకైక బౌలర్ బిష్ణోయే కావడం గమనార్హం.

టాప్‌లోనే సూర్య..
మరోవైపు బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ 855 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) రెండో ర్యాంక్‌లో నిలిచాడు. సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మూడో, పాకిస్థాన్ మాజీ సారథి బాబర్ ఆజమ్ నాలుగో, రిలీ రొసొ (సౌతాఫ్రికా) ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. టీమ్ విభాగంలో భారత్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News