Friday, March 29, 2024

ప్లాసెంటా మూలకణాలతో బాలుని గుండెకు పునరుజ్జీవం

- Advertisement -
- Advertisement -

గుండె ఆపరేషన్‌కు గర్భస్థ మావి (ప్లాసెంటా) నుంచి సేకరించిన మూలకణాలు ఉపయోగించి ప్రపంచంలో మొట్టమొదటిసారి నెలల పసివాడికి పునర్జన్మను బ్రిటన్‌కు చెందిన హార్ట్ సర్జన్ అందించడం వైద్యచరిత్రలో సువర్ణాధ్యాయం. పుట్టిన నాలుగు రోజులకే ఓపెన్‌హార్ట్‌సర్జరీ చేయించుకున్న ఆ పసివాడు తరువాత మూలకణాల చికిత్సతో పునరుత్తేజితుడై ఇప్పుడు రెండేళ్లవాడయ్యాడు.

మూలకణాల చికిత్సతో వైద్యరంగంలో మరో మలుపు తిరిగింది. బ్రిటన్ హార్ట్ ఫౌండేషన్ ఈ మూలకణాల చికిత్సను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరింత ప్రోత్సాహం అందిస్తోంది. విల్ట్‌షైర్‌కు చెందిన ఫిన్లీ పాంట్రీ అనే బాలుడు పుట్టుకతోనే గుండె లోపంతో పుట్టాడు. అంటే ఆ బాలుని ఊపిరితిత్తులకు, శరీరం లోని ఇతర అవయవాలకు రక్తం ప్రసారం చేసే ప్రధానమైన రెండు ధమనులు పొరపాటు స్థానంలో ఉన్నాయి. పుట్టిన నాలుగు రోజుల్లోనే ఆ రెండు ధమనులను తిరిగి సరైన స్థానంలో పెట్టడానికి ఓపెన్‌హార్ట్ సర్జరీ జరిగింది.

గుండె అలా పనిచేయడం కోసం కొన్ని వారాలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్, మందుల సాయంతో ఉంచేశారు. ఇప్పుడు రెండేళ్ల బాలుడయ్యాడు. తనతల్లిదండ్రులతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నాడు. బ్రిస్టల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ మెస్సిమో కెపుటో ఫిన్లీ తల్లికి మూలకణాల ఆధారంతో గుండె లోని లోపాలను సరిజేయడానికి ప్రయత్నిస్తానని మొదట చెప్పారు. గర్భస్థ మావి (ప్లాసెంటా) బ్యాంకు నుంచి మూలకణాలు సేకరించి అందించడంతో ఈ వైద్యప్రక్రియ ముడిపడి ఉంది. ఆ మూలకణాలను నేరుగా బాలుడు ఫిన్లీ గుండెకు ఎక్కించడం ప్రారంభించారు.

గుండెలో దెబ్బతిన్న రక్తనాళాలు ఈ మూలకణాలతో తిరిగి పెరగడం ప్రారంభిస్తాయన్న ఆశతో చికిత్స సాగించారు. చెప్పుకోదగిన విశేషమేమంటే మందులు, వెంటిలేటర్ సహాయం ఫిన్లీకి అక్కర లేకపోయింది.“ ఫిన్లీకి రెండు నెలల వయసులో తాము ఆశలు వదులుకున్నాం. డాక్టర్లు కూడా మమ్మల్ని పిలిచి మేం చేయవలసిందంతా చేసాం. అని గదిలోకి మమ్మల్ని పిలిచి చెప్పేశారు ” అని ఫిన్లీ తల్లి మెలిస్సా హుడ్ గత అనుభవాన్ని చెప్పారు. “ఆ పరిస్థితిలో డాక్టర్ మెస్సిమో వచ్చి ఒకేఒక అవకాశం ఉందని, ఫిన్లీ గుండెకి ఎడమవైపు మూలకణాలు ఎక్కిస్తామని వివరించారు.

ఆయన ఫలితం ఏమవుతుందో చెప్పలేనని హెచ్చరించారు.కానీ మాలో ఇంకా ఆశ చావలేదు. ఫిన్లీ బతకడానికి ప్రతి అవకాశాన్ని చూశాం. ” అని ఆమె చెప్పారు. మూలకణాల చికిత్స ప్రారంభించిన రెండు వారాల్లోనే ఫిన్లీలో మార్పును కుటుంబీకులు గమనించారు. ఫిన్లీకి ఆరు నెలలు వచ్చాక మెషిన్ సహాయంతో మొట్టమొదటిసారి ఇంటికి పంపించారు. రాత్రుళ్లు శ్వాస తీసుకోడానికి మెషీన్ ఉపయోగపడేది. డాక్టర్ మెసిమోకు మేం సరిగ్గా కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మూలకణాల చికిత్స లేకుంటే ఈరోజు ఫిన్లీ మాతో ఉండేవాడు కాడు.

అని ఫిన్లీ తల్లి ఉద్వేగానికి గురైంది. భవిష్యత్ ఏం చేస్తుందో మాకు తెలీదు. మూలకణాల చికిత్స తరువాత ఫిన్లీకి పునర్జన్మ కలగడం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అని అన్నారు. గుండె లోపాలన్నవి సాధారణ వైపరీత్యం. బిడ్డ పుట్టకముందే ఇది అభివృద్ది అవుతుంది. గుండె లోపాలతో పుట్టే పసివాళ్లలో రోజూ 13 మందిని బ్రిటన్‌లో డాక్టర్లు గుర్తించడమౌతోంది. అలాంటి బిడ్డలకు చాలా మందికి ప్రస్తుతం ఓపెన్‌హార్ట్ సర్జరీ చేసి తాత్కాలికంగ ఆ సమస్యకు మరమ్మతు చేస్తున్నారు. కానీ ఆ ప్యాచెస్‌కు వాడిన పరికరాలు, లేదా గుండెలో తిరిగి అమర్చిన కవాటాలు పూర్తిగా జీవసంబంధంగా మారవు. బిడ్డతోపాటు పెరగలేవు. అంటే దీని అర్థం పసివాడు తిరిగి అనేకసార్లు గుండె ఆపరేషన్లు చేయించుకోవలసిన పరిస్థితి కొనసాగుతుంది.

బాల్యమంతా కొన్ని వారాల పాటు ఆస్పత్రుల్లోనే పిల్లలు గడపాల్సి వస్తుంది. ఫిన్లీకి మూలకణాల ఇంజెక్షన్ చికిత్సతో పునర్జన్మ కలగడంతో స్ఫూర్తి పొందిన ప్రొఫెసర్ కేపుటో , మూలకణాల ప్లాస్టర్స్‌ను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు.ఈ ప్లాస్టర్స్ పిల్లవానితోపాటు పెరుగుతుంటాయి. మళ్లీమళ్లీ గుండె ఆపరేషన్ చేయించుకోవలసిన గతి తప్పుతుంది. రోగులను పరీక్షించడానికి ఈ ప్లాస్టర్‌లను సిద్ధం చేయాలన్న లక్షం పెట్టుకున్న ప్రొఫెసర్ కెపుటోకు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ 750,000 పౌండ్లను అవార్డుగా అందించింది. అందువల్ల మరో రెండేళ్లలో దీనిపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమౌతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News