Tuesday, December 10, 2024

మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సిసలైన మత విశ్వాసం లేకుం డా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలకోసం మతం మారడం ‘రాజ్యాంగంపై వం చనే’ అవుతుందని సుప్రీం కోర్టు ఒక కీలక తీ ర్పులో స్పష్టం చేసింది. సి సెల్వరాణి అనే మహిళ దాఖలు చేసిన కేసులో న్యాయమూర్తులు పంకజ్ మిత్తల్, ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ తీ ర్పు వెలువరించింది. క్రైస్తవ మతం స్వీకరించినా ఆ తరువాత ఉద్యోగ ప్రయోజనా లు సాధించేందుకు హిందువునని చెప్పుకు న్న ఒక మహిళకు షెడ్యూల్డ్ కులం (ఎస్‌సి) సర్టిఫికేట్ జారీని తిరస్కరిస్తూ మద్రాసు హై కోర్టు జనవరి 24న తీసుకున్న నిర్ణయాన్ని బెంచ్ ధ్రువీకరించింది. ఒక మతం సిద్ధాంతాలు, సూక్తులు, ఆధ్యాత్మిక భావనలకు ని జంగా స్ఫూర్తి పొందినప్పుడే ఎవరైనా ఆ మతానికి మారతారని బెంచ్ తరఫున 21 పేజీల తీర్పు రాసిన జస్టిస్ మహాదేవన్ స్ప ష్టం చేశారు. ‘అయితే, వేరే మతంలో వాస్తవంగా విశ్వాసం లేకుండా రిజర్వేషన్ ప్ర యోజనాలు పొందడమే మతం మార్పు ధ్యే యమైతే ఆ మతం మార్పును అనుమతించజాలం, అటువంటి స్వార్థ దృష్టితో ప్రజల కు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడం రిజర్వేషన్ విధానం సామాజిక నీతికి విరుద్ధం అవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

వాది క్రైస్తవాన్ని పాటిస్తున్నదని, క్రమం తప్పకుండా చర్చికి హాజరవుతూ ఆ మతాన్ని ఆచరిస్తున్నదని బెంచ్ ముందు సమర్పించిన సాక్షాధారాలు స్పష్టం చేస్తున్నాయి. అలా చేస్తున్నప్పటికీ ఆమె హిందువునని చెప్పుకుంటూ ఉద్యోగ ప్రయోజనం కోసం ఎస్‌సి కులం సర్టిఫికేట్ కోరుతున్నది’ అని బెంచ్ పేర్కొన్నది. ‘ఆమె చేసిన అటువంటి ద్వంద్వ ప్రకటనలు చెల్లవు, ఆమె క్రైస్తవం స్వీకరించిన తరువాత కూడా హిందువుగా తన గుర్తింపును కొనసాగించజాలదు’ అని బెంచ్ స్పష్టం చేసింది. మత విశ్వాసం మేరకు క్రైస్తవురాలు అయిన మహిళ ఉద్యోగంలో రిజర్వేషన్ ప్రయోజనార్థం హిందుత్వం స్వీకరించినట్లు చెప్పుకుని షెడ్యూల్డ్ కులం హోదా పొందడం ‘రిజర్వేషన్ అసలు ధ్యేయానికే విరుద్ధం, రాజ్యాంగాన్ని వంచించడమే అవుతుంది’ అని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. మారిన మతంలో నిజంగా విశ్వాసం లేకుండా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికే మతం మారడం కోటా విధానం మౌలిక సామాజిక ధ్యేయాలను దెబ్బ తీస్తాయని, ఆమె చర్యలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్షంగా ఉన్న రిజర్వేషన్ విధానాల స్ఫూర్తికి విరుద్ధమైనవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

హిందు తండ్రికి, క్రైస్తవ తల్లికి జన్మించిన సెల్వరాణి జననం అనంతరం కొద్ది కాలానికి క్రైస్తవురాలిగా బాప్టిజం స్వీకరించింది. కానీ ఆ తరువాత ఆమె హిందువునని చెప్పుకుని. 2015లో పుదుచ్చేరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ (యుడిసి) ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేందుకు ఎస్‌సి సర్టిఫికేట్ కోరింది. ఆమె తండ్రి షెడ్యూల్డ్ కులాల కింద వర్గీకరించిన వల్లువన్ కులానికి చెందగా, ఆయన క్రైస్తవానికి మారినట్లు డాక్యుమెంటరీ ఆధారాలు ధ్రువీకరించాయి. వాది క్రమం తప్పకుండా చర్చికి హాజరవుతుండడం దృష్టా క్రైస్తవాన్ని అనుసరిస్తూనే ఉందని, ఆమె హిందువునని చెప్పుకోవడం చెల్లదని కోర్టు తీర్పు పేర్కొన్నది. క్రైస్తవానికి మారిన వ్యక్తులు తమ కులం గుర్తింపు కోల్పోతారని, ఎస్‌సి ప్రయోజనాలు పొందేందుకు తిరిగి మతం మారినటు,్ల తమ అసలు కులం అంగీకరించినట్లు కచ్చితమైన సాక్షాధారాలు సమర్పించాలని బెంచ్ తెలిపింది. వాది తిరిగి హిందుత్వం స్వీకరించినట్లుగా గాని, వల్లువన్ కులం అంగీకరించినట్లుగా గాని చెప్పుకోదగిన సాక్షాధారాలు లేవని తీర్పు పేర్కొన్నది. ఆమె వాదనలకు బహిరంగ ప్రకటనలు, వేడుకలు లేవని, ఆమె ప్రకటనలను నిరూపించేందుకు విశ్వసనీయమైన పత్రాలు లేవని తీర్పు పేర్కొన్నది.

‘ఎవరైనా వేరే మతం సిద్ధాంతాలకు నిజంగా స్ఫూర్తి పొందినప్పుడే మతం మారతారు. నమ్మకం లేకుండా, రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే మతం మారడం అనుమతించదగినది కాదు’ అని బెంచ్ స్పష్టం చేసింది. ఏమైనా క్రైస్తవానికి మారగానే సదరు వ్యక్తి తమ కులం కోల్పోతారని, దాని ద్వారా గుర్తింపు పొందజాలరని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘తిరిగి మతం మారడం వివాదాస్పదం అయినందున వట్టి మాట కన్నా బలమైన ఆధారం ఉండాలి. ఏ వేడుక ద్వారా గాని, ‘ఆర్య సమాజ్’ ద్వారా గాని మతం మార్పు చోటు చేసుకోలేదు. ఆమె గాని, ఆమె కుటుంబం గాని హిందు మతానికి తిరిగి మారినట్లు చూపేందుకు రికార్డు ఏదీ లేదు, అందుకు భిన్నంగా వాది ఇప్పటికీ క్రైస్తవాన్ని ఆచరిస్తున్నట్లు వాస్తవ నిర్ధారణలో తేలింది’ అని బెంచ్ తెలిపింది. వాదికి వ్యతిరేకంగా సాక్షాధారాలు ఉన్నాయని, అందువల్ల మతం మారిన తరువాత కులం మాయం అవుతుందని, తిరిగి మతం మారిన తరువాత కులం పునరుద్ధరణ అవుతుందని అంటూ ఆమె చేసిన వాదన ‘చెల్లుబాటు కాదు’ అని బెంచ్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News