Thursday, April 18, 2024

ప్రతిఘటనోద్యమ అక్షరాయుధాలు

- Advertisement -
- Advertisement -

Character Weapons

 

ఈ సహస్రాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమాలు వెల్లివిరిసాయి. ప్రధాన రాజకీయ స్రవంతిలోని రాజకీయ పక్షాలకు ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నందువల్ల ఏ పార్టీ, ఏ నాయకుడిడు పిలుపు ఇవ్వకపోయినా, జన సమీకరణ చేయకపోయినా జనం తమంత తాము వీధుల్లోకి వచ్చి నిరసన గళాలు గట్టిగా వినిపిస్తున్నారు. ఈ నిరసన ప్రజల రాజకీయాభిప్రాయాల వ్యక్తీకరణకు ప్రతిరూపంగా మారిపోయింది. ఈ పరిణామం మన ఒక్క దేశానికే పరిమితమైంది కాదు. అణచివేత, వివక్ష కొనసాగుతున్న ప్రతిచోటా నిరసన జ్వాలలు రేగుతూనే ఉన్నాయి.

2019 చివరిలో లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, హాంగ్ కాంగ్ తో సహా మన దేశంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం జనం మీద రుద్దిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు లోపల, బయట వ్యతిరేకించడంలో సకల ప్రతిపక్షాలు విఫలమైనాయి. ఈ పక్షాల వ్యతిరేకత ఏదైనా ఉందనుకున్నా అది లాంఛనప్రాయంగానే మిగిలిపోయింది. ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం కేవలం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకమైంది మాత్రమే కాదు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, చట్టాలను మోదీ ప్రభుత్వం ఇష్టానుసారం మార్చడం, హిందుత్వను సుప్రతిష్ఠితం చేయడానికి తీసుకొచ్చిన చట్టాలు, పౌరహక్కులను ఎమర్జెన్సీలో కన్నా హీనంగా అణచి వేయడం మొదలైన పరిణామాలన్నీ ప్రజల నిరసనకు దారి తీశాయి.

గత ఆరేళ్ల బీజేపీ పాలనలో జనాగ్రహం కుమ్మరి ఆవంలా రగిలి రగిలు ఇప్పుడు ఒక్క సారి భగ్గుమంది. ఈ ప్రతిఘటనలో కవులు, సాహితీవేత్తలు తమవంతు పాత్ర నిర్వర్తించి ప్రజల చైతన్య స్థాయిని పెంచుతున్నారు. కాన్పూర్ ఐ.ఐ.టి. విద్యార్థులు ఉద్యమించినప్పుడు ఫైజ్ అహమద్ ఫైజ్ రాసిన హమ్ దేఖేంగే గానం చేశారు. జె.ఎన్.యు. విద్యార్థుల మీద నిష్కారణంగా పోలీసు లాఠీ విరిగినప్పుడు బెంగాలీ కవి జోయ్ గోస్వామి రాసిన కవిత సామాజిక మాధ్యమాలలో ప్రతిధ్వనించింది. కల్లోల స్థితిలో నిశ్శబ్దం మారణ హోమం లాంటిదని ఆయన మరో మారు గుర్తు చేశారు. నామ్ దేవ్ ధసల్ అనే మరాఠీ కవి ముంబైలో దళితుల దుర్భర జీవితాల గుట్టు విప్పితే నారాయణ్ సుర్వే సాహిత్యం చేసిన పనే అది. మానవ జీవిత గర్షణల అంతస్సారమే సాహిత్య సారం. ప్రతిఘటన ఎప్పుడూ కొత్త గొంతులకు ఊతం ఇస్తుంది.

ప్రపంచంలోనూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్య వ్యతిరేక పరిణామాలు ప్రజలను ఆలోచింప చేశాయి. ఈ సమస్యల పరిష్కారం పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయలలో కూరుకుపోయిన వామపక్ష పార్టీలవల్ల కావడం లేదని, అవి నిష్క్రియాపరంగా మారిపోయాయని గ్రహించిన ప్రజానీకం తమంత తామే ఉద్యమించడం మొదలుపెట్టింది. మన దేశంలో హిందుత్వం ముసుగులో ఫాసిస్టు ధోరణులు ప్రబలి పోవడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. మోదీకి రెండో సారి అధికారం దక్కినట్టే అనేక దేశాలలో ప్రతీప శక్తులు అధికారంలోకి వచ్చాయి. అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద శక్తులు బలం పుంజుకున్నాయి.

మరో వేపు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన దేశంలోనూ ఆర్థిక మాంద్యం కోరలు సాచి సామాన్య జనజీవితాన్ని ఛిద్రం చేసింది. ఈ దశలోనే ప్రజలు మతతత్వ, ఫాసిస్టు, సామ్రాజ్యవాద విష సర్పాన్ని చలిచీమల్లాగా ఆవరించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వస్తు సేవల పన్ను, పెద్ద నోట్ల రద్దు జనం నడ్డి విరిచాయి. అయినా జనంలో తిరుగుబాటు తత్వం మందకొడిగానే సాగింది. అది సణగడానికి, రుసరుసలాడడానికే పరిమితమైంది. ముమ్మారు తలాక్, 370వ అధికరణం రద్దు తరవాత కూడా జనంలో ఉండాల్సినంత కదలిక కనిపించలేదు. పులిమీద పుట్రలా వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రజలను అమాంతం జాగృతం చేసింది. కుల, మత, ప్రాంత భేదాలను పక్కనపెట్టి జనం ఏకమై భుజం భుజం కలిపి ప్రతిఘటనోద్యమంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. సచేతనమైన విశ్వవిద్యాలయ విద్యార్థుల నిరసన గళాలు పాలకపక్షాల కుదుళ్లు కదిపాయి. ప్రతిపక్షాలను పునరాలోచనలో పడవేశాయి. సంఘ్ పరివార్ దాష్టీకాన్ని నిలవరించకపోతే తమకు బతుకే మృగ్యమవుతుందన్న స్పృహ కలిగింది.

సమాజంలో జరిగే ఈ పరిణామాలకు కవులు, సాహిత్యకారులూ నిరంతరం స్పందిస్తూనే ఉంటారు. తమ నిరసనను అక్షరబద్ధం చేస్తుంటారు. కాళహస్తీశ్వర శతక కర్త 16వ శతాబ్దంలోనే ‘రాజుల్ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు‘ అన్నారు.
ప్రపంచీకరణను, విచ్చలవిడి ప్రైవేటీకరణను ఇలాగే తూర్పారబట్టిన కవులు చాలా మందే ఉన్నారు. అనవరతంగా ఆ పని చేస్తున్నది జూకంటి జగన్నథం.

ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గేయంలో
‘…మాంసానికి మామంచి ధర పలుకుతుంది
నాగళ్లను ఎక్కడికక్కిడికి నరికి పొయ్యిలో పెట్టి
ఏదో పరిశ్రమ స్థాపించుకోండి
ఇంట్లో కడుపుల గుద్ది
బజార్లో వీపుమీద చెయ్యేసి శభాష్ అంటుంది రాజ్యం
హిందుస్తాన్ లివర్ లిమెటోడు
స్త్రీలకు బట్టలుతికే పోటీ నిర్వహిస్తాడు
మనం చొంగ కార్చి గుడ్లప్పగించి చూస్తాం.
మా చిన్నమ్మాయికి అన్నీ ప్రశ్నలే
మా పెద్దమ్మాయికి అడుగు తీసి అడుగు వేస్తే
అన్నీ సందేహాలే అన్నీ సందిగ్ధాలే
డంకెల్? ఐ.ఎం.ఎఫ్.?? అగ్రరాజ్యాలు???
’నీ కంట్లో నేను వేలు పెడతా
నీవు నా నోట్లో చెయ్యి పెట్టూ బాపతిగాళ్లే…
…మన అంగట్లో సరుకుల వ్యాపారం చేయరాని
మనం ప్రపంచ మార్కెట్లో పోటీపడి
అవయవాలను అమ్ముకోవాలి
టెలివిజన్లో
సర్వసత్తాక స్వతంత్ర సామ్యవాద లౌకిక గణతంత్ర దినోత్సవం
త్రివిధ దళాల వందన స్వీకారం
రాష్ట్రపతి భూతద్దం ప్రసంగం
అనంతరం ఒక ప్రకటన
’ఇంతవరకు మీరు చూసిన కార్యక్రమాన్ని
స్పాన్సర్ చేసినవారు
ప్రోఅక్టర్ అండ్ గ్యాంబుల్, గ్లాక్సో, నెస్లే అని ఈ పెడధోరణులకు జూకంటి తన కలం పోట్లతో ఎండగట్టారు.

హిందీ, ఉర్దూ కవులతో పాటు తెలుగు కవులు సైతం సమాజంలో నెలకొన్న అస్తవ్యస్త స్థితిని దునుమాడడానికి తమ కలాలకు పదును పెట్టారు.

ప్రసిద్ధ ఉర్దూ కవి, సినీ గేయ రచయిత జావేద్ అఖ్తర్ నిరంతరం క్రీయాశీలంగా ఉంటారు.
‘పలకడానికి ప్రతి ఒక్కడూ
భయపడే మాట,
నువ్వు అదే మాట రాయాలి
రాత్రి ఇంత చీకటిగా ఎప్పుడూ
లేదని రాయాలి
స్తోత్రపాఠాలు రాసిన
కలాన్ని విసిరికొట్టు…
…దినపత్రికలో ఎక్కడా చోటు
దొరకని, ప్రతిరోజు ప్రతి చోట జరిగే
సంఘటనను రాయాలి
సంకుచిత పరిధులన్నింటినీ విరగ్గొట్టు
ఇప్పుడు స్వేచ్ఛా వాతావరణంలోకి రా
నువ్వు విశ్వాన్ని రాయాలి
జరిగిన సంఘటనల ప్రస్తావనలు
చాలా ఉన్నాయి
జరగవలసిన సంఘటనలేమిటో
నువ్వు రాయాలి
ఈ తోటలో వసంతం మళ్లీ
చూడాలని ఉందా
కొమ్మకొమ్మకు పిలుపు ఇవ్వు
ఆకు ఆకుపై నువ్వు రాయాలి‘ అన్నారు.

హాస్య, వ్యంగ్య కవిత్వానికి ప్రసిద్ధుడైన అరుణ్ గ్రోవర్ ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి తనకు సహజమైన కవిత్వ ధోరణి విడనాడి
‘నిరంకుశులు వస్తారు పోతారు
మేం కాగితాలు చూపించం
మీరు బాష్పవాయువు వదులుతారు
విషపూరిత చాయ్ మరగబెడ్తారు
మేం అపేక్ష చక్కెర కలిపి
గట గటా తాగేస్తాం…
…ఈ నేలను ఎలా విడగొడ్తారు
ఇందులో అందరి రుధిరం ఉందిగా
మీరు పోలీసు లాఠీలు ప్రయోగిస్తారు
మీరు మెట్రో ఆపేస్తారు
మేం నడుస్తూ నడుస్తూ వస్తాం
మేం ఇక్కడే బిఛాణా వేస్తాం
మేం జనగణమన పాడతాం
మీరు కులమతాలుగా విడగొడ్తారు
మేం నిలదీస్తూనే ఉంటాం‘ అని పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌరుల జాబితాకూ తన కలంపోట్ల రుచి చూపించారు.

దృశ్యం గీతంలో దేవిప్రియ ఆవేదన చూడండి:
‘…విద్వేశ విషోదధి ఏదో
సప్త సహోదరీ ముంగురుల
భస్మ రాశులను ముంచెత్తుతూ ఉరికి వస్తోంది
సకల దేశ భాషలనూ, సర్వ ప్రార్థనలనూ,
గోపురాలనూ, మినారులనూ, చర్చీల
గురుద్వారాల
ఆరామాల ప్రాంగణ ప్రాణవాయువులనూ
ధ్వంసం చేస్తూ ఒక కొత్త అగ్నిగ్రహమేదో
నా దేశం మీదికి మహోధృతంగా దొర్లుకుంటూ
వస్తోంది.

ఎక్కడ నా అంబేద్కరులు?
ఎక్కడ నా భగత్ సింగులు?
ఎక్కడ నా కవచాలు?
ఎక్కడ నా ఆయుధాలు?

మరోవైపు నుంచి ప్రసాద మూర్తి ‘ ఇక్కడ యువకులున్నరు
ఇంటిని తగలబెడితే ఎలకలు పారిపోవచ్చు
దేశాన్ని తగలబెడితే యువకులు ఊరుకోరు
గుండెలు చీల్చి దేశం చుట్టూ కోట కట్టారు
రక్తం దోసిళ్లతో పట్టి రాజ్యాంగాన్ని
అభిషేకించారు… అని పుష్కర కాలం కింద అన్న మాట ప్రస్తుత పరిస్థితికీ వర్తిస్తుంది. కవి క్రాంతదర్శికదా!
‘విభజన మీ చట్టం కావొచ్చు
హింస మీ ఆయుధం కావొచ్చు
ఎరుపెక్కిన మీ కళ్ల నుండి
సైన్యాలు రాలొచ్చు
యువకులు పిరికి వారు కారు
వారి ముందూ వెనకా
ఆసేతుశీతాచలం
తరంగాల తురంగాల కదన కౌతూహలం…
…ఎవరి బతుకు వారు బతకడానికే కాదు
ఇక్కడ నలుగురూ కలిసి బతకడం కూడా యుద్ధమే
బతుకును బతికించడానికి మరణాన్ని ధిక్కరిస్తారు
యువకులు యుద్ధమే చేస్తారు
మీకు కోరలే కాదు తోకలూ ఉన్నాయని
వాటిని ముడుచుకుంటారని వారు
నిరూపిస్తారు.. అని ప్రసాద మూర్తి ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పడూ చెప్తున్నట్టే ఉన్నాయి.
‘…దేశమంటే హిందువులే కాదని
దేశమంటే జైనులు…బౌద్ధులు…
ఫారసీలు.. క్రైస్తవులు మాత్రమే కాదని
దేశమంటే ముస్లింలు కూడా అని
చరిత్ర ఛాతీ మీద దేహాలను
అక్షరాలుగా అచ్చొత్తిన
యువకులే భరోసా…యువకులే ఈ యుగ సందేశం‘ అని ఆయన ఎప్పుడో చెప్పిన మాటలు ప్రస్తుత సందర్భానికి అక్షరాక్షరం వర్తిస్తాయి.
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనను ఎదుర్కునే సత్తా మోదీ ప్రభుత్వానికి లేదు కనకే రాత్రికిరాత్రి షాహీన్ బాగ్ లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారి మీద విరుచుకుపడ్తోంది. యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలోని అలహాబాద్ లో ప్రసిద్ధ హిందీ కవి అంశు మాలవ్యా మీద కొందరు గూండాలు దాడి చేశారు. జామే మిలియా ఇస్లామియాలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను పోలీసులే ధ్వంసం చేసిన వైనం చూస్తే అలహాబాద్ లో దాడి చేసిన వారు యూనిఫారంలో లేని పోలీసులేమోనన్న అనుమానం కలగడం సహజం.

ఏ నియంతా శాశ్వతం కాదనడానికి చరిత్రే సాక్ష్యం. ఇక ముందూ అదే జరగక మానదు. హిట్లర్ ఆత్మ హత్య చేసుకుని ఉండొచ్చు. మన నియంతను కాళోజీ కాటేసి తీరాలి అన్నట్టు అదును పదును చూసి ఇ.వి.ఎం.లలో తమ పస ఏమిటో చూపక మానరు. సాహిత్యకారుల నిరసన దానికే సంకేతం.
ఇరాక్ లో అమెరికా, ఆ దేశానికి తద్దినం పెట్టేవాడికి తమ్ముడిగా వ్యవహరించే బ్రిటన్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా 2003 ఫిబ్రవరి 15న 800 నగరాలలో లక్షల మంది కదం తొక్కిన సందర్భాన్ని విస్మరించడానికి వీలులేదు. అప్పుడు ఆ దేశాల్లో ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకమైంది.

పదహారవ శతాబ్దం నాటి పురందర దాసు చెరకుగడ వంకర టింకరగా ఉన్నా చక్కెర తియ్యగానే ఉంటుంది/విల్లు వంపు తిరిగి ఉన్నా బాణం తిన్నగానే ఉంటుంది. నదీ ప్రవాహం వడి తిరిగినా నీటి రుచి బాగానే ఉంటుంది అన్నడు. అలాగే 2013లో నరేంద్ర దబోల్కర్, 2015లో గోవింద్ పన్సారేను హిందుత్వ వాదులు కిరాతంగా హతమార్చినప్పుడు మరాఠీ గాయని సచిన్ మాలి మనిషిని హతమార్చవచ్చు/ఆలోచనను అంతం చేయలేరు/ఓ మతోన్మాదులారా/ప్రగతి చక్రాన్ని ఆపగలరా అని నినదించారు. మీరు అన్ని పూలనూ చిదెమేయొచ్చు/కానీ పూలు పూయకుండా ఆపలేరు అన్న పాబ్లో నెరూడా వాక్కులు ప్రస్తుత సాహితీ జీవులకూ స్ఫూర్తి ప్రదాయకమే. రాజా రవివర్మ కిచక్ సైరంధ్రి సైతం తిరుగుబాటు బావుటానే.

Resistance Revolution Character Weapons
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News