Thursday, March 28, 2024

ఇష్టం లేని పెళ్లి.. కండక్టర్ కు దొరికిన సూసైడ్ లెటర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు మానవత్వం చాటడంలోనూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ ఆర్టీసి) సిబ్బంది భేష్ అనిపించుకుంటున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహారించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ యువతి ప్రాణాలను కాపాడారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి నారాయణఖేడ్ డిపో బస్సును ఆదివారం పటాన్‌చెరువులో ఎక్కి జేబిఎస్‌లో దిగింది. ఆ సమయంలో తన పర్సును బస్సులోనే మరిచిపోయింది. ఆ పర్సును బస్సు కండక్టర్ పి.రవీందర్ గుర్తించారు. వివరాలు తెలుసుకునేందుకు పర్సును తెరవగా అందులో సూసైడ్ లెటర్ కనిపించింది. యువతి ఆధార్ కార్డుతో పాటు రూ.430 నగదు అందులో ఉంది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే చనిపోవాలని అనుకుంటున్నానని సూసైడ్ లెటర్‌లో రాసి ఉంది.

అది చదివిన కండక్టర్ రవీందర్ వెంటనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ దృష్టికి తీసుకువచ్చారు. సూసైడ్ లెటర్‌తో పాటు ఆధార్ కార్డు ఫొటోలను షేర్ చేశారు. వెంటనే స్పందించిన సజ్జనార్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. జేబిఎస్‌లో దిగిన ఆ యువతిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్టీసి ఎస్‌ఐ దయానంద్, ఇతర సిబ్బంది ఆ యువతిని గుర్తించారు. మారేడ్‌పల్లి పోలీసుల సాయంతో ఆమెను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు ఆర్టీసి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహారించి యువతి ప్రాణాలను కాపాడిన టిఎస్ ఆర్టీసి సిబ్బందిని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండి సజ్జనార్‌లు అభినందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చిన కండక్టర్ రవీందర్‌ను ఎండి ప్రత్యేకంగా ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News