Monday, April 29, 2024

రష్యా దాడుల్లో 10 వేల మంది మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో 499 మంది పిల్లలున్నట్టు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయంలో యుద్ధ నేరాల విభాగం అధికారి యూరియ్ బెల్‌సోవ్ తెలిపారు. ఉక్రెయిన్ భూ భాగాలను తమ సేనలు తిరిగి అధీనం లోకి తెచ్చుకున్న తరువాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఈ యుద్ధంలో భాగంగా రష్యా సేనలు ఉక్రెయిన్‌లో చేసిన 98 వేల యుద్ధ నేరాలను తమ విభాగం నమోదు చేసిందని యూరియ్ తెలిపారు. “గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడిలో ఇప్పటివరకు 10, 749 మంది మరణించారు. 15,599 మంది గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క మరియుపోల్ లోనే 10 వేల మంది మరణించి ఉంటారని అంచనా వేస్తున్నాం ” అని ఆయన వెల్లడించారు.

గత నెలలో ఉక్రెయిన్‌లో మరణాలపై ఐక్యరాజ్యసమితి సైతం ఒక నివేదిక విడుదల చేసింది. రష్యా దాడుల్లో 500 మంది పిల్లలు సహా సుమారు 9 వేల మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెంది ఉంటారని ఆ నివేదిక అంచనా వేసింది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయ పడింది. మరోవైపు గురువారం ఉదయం ఉక్రెయిన్‌కు చెందిన ఆరు డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా రక్షణశాఖ ప్రకటించింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. బుధవారం ఉక్రెయిన్ నౌకాశ్రయాలే లక్షంగా రష్యా దాడులు చేసింది. ఉక్రెయిన్ రొమేనియా సరిహద్దు లోని ఇజ్మాయెల్ దగ్గర డాన్యూబ్ నదిపై ఉన్న నౌకాశ్రయాన్ని డ్రోన్లు ప్రయోగించి ధ్వంసం చేసింది. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News