Saturday, April 20, 2024

ఎన్‌ఆర్‌ఐల వల.. రియల్ సంస్థ లీల!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్లాట్లు, విల్లాలు, ఇళ్ల విక్రయాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మోసాలు జరుగుతున్నాయి. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే హోర్డింగ్‌లతో ప్రజలను మభ్యపెడుతూ అందినకాడికి దండుకోవడానికి కొన్ని సంస్థలు రియల్‌ఎస్టేట్ పేరుతో రంగంలోకి దిగాయి. దీనికోసం ఏజెంట్లను నియమించుకొని వారికి అధిక కమీషన్ ఆశచూపి అందినకాడికి దండుకొని బోర్డు తిప్పేస్తున్నాయి. ప్రజలు ప్లాట్లు కొనడానికి వెళ్లినప్పుడు చదును చేసి ఉన్న స్థలం సంవత్సరం తరువాత వేరే సంస్థ మరోసారి ప్లాట్ల పేరుతో వేరే వారికి విక్రయించి ప్రజలను మోసం చేస్తున్నాయి.

ఈ సంస్థలు ఎక్కువగా విదేశాల్లో, వేరే రాష్ట్రాలు, వేరే జిల్లాలో ఉండే ప్రజలతో పెట్టుబడులు పెట్టించడంతో పాటు వారిని మోసం చేయడమే లక్షంగా పనిచేస్తున్నాయి. టి సంఘటనలు రెరా అథారిటీ దృష్టికి రావడంతో అధికారులు వాటిపై నజర్ పెట్టారు. అందులో భాగంగా అలాంటి సంస్థల వివరాలను సేకరించిన రెరా ఆ సంస్థ లు, ఆయా యజమానులపై చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అడ్రస్‌లు లేని సంస్థలను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడంతో వారికి ఫోన్‌లు చేసి ఆయా వెంచర్‌లలో ప్లాట్లను అమ్మవద్దని హెచ్చరించింది. అయినా పట్టించుకోని ఆయా సంస్థలు అందినకాడికి దోచుకుంటున్నాయి. మూడురోజుల క్రితం దారికి రాని 5 సంస్థల గురించి రెరా అథారిటీ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఆ సంస్థల నుంచి ఎలాంటి ప్లాట్లను కొనుగోలు చేయరాదని వాటితో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదని పేర్కొంది. అయితే ఈ 5 సంస్థలకు యజమాని ఒకరేనని, ఈ సంస్థ వివిధ పేర్లతో వివిధ ప్రాంతాల్లో లావాదేవీలు నిర్వహించినట్టుగా రెరాకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇలాంటి సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉన్నాయని గుర్తించిన రెరా వాటి గురించి కూడా ప్రజలకు తెలియచెప్పాలని నిర్ణయించింది.

నోటీసులు పంపించినా…..

ఇన్వెస్ట్ ఇన్ ఎకర్స్ అండ్ బెనిఫిట్ ఇన్ స్వ్కేర్ యార్డ్ (స్వ్కేర్ యార్డ్ ఫ్యాక్టరీ) అనే రియల్ సంస్థ మరో ఐదు ప్రాంతాల్లో వేర్వరు పేర్లతో అక్రమ వెంచర్‌లను చేసి ప్లాట్లను విక్రయించింది. ఈ సంస్థ చేవేళ్లలో 12 ఎకరాల్లో చేసిన గోల్డన్ పామ్స్ ఎన్‌క్లేవ్, గ్రీన్ స్క్వేర్, కిష్టాపూర్‌లో 10.5 ఎకరాల్లో ప్రైమ్ ఎవెన్యూ వెంచర్, రాకంచర్లలో 11.5 ఎకరాల్లో చేపట్టిన మెజెస్టిక్ విల్లాస్, రాకంచర్లలో 3.5 ఎకరాల్లో చేసిన స్టార్ కాలనీ వంటి వెంచర్లకు రెరాతో పాటు హెచ్‌ఎండిఏ, డిటిసిపి అనుమతులు లేవు. దీంతోపాటు వివిధ కంపెనీ పేర్లతో విదేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్న వారికి ఈ ప్లాట్లను విక్రయించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు ఈ సంస్థలపై ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

దీంతో రెరా అధికారులు ఆ సంస్థలకు నోటీసులు పంపించినా తీసుకోకపోగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలను మూసివేసినట్టుగా రెరా గుర్తించింది. ఈ వెంచర్లకు స్థానిక సంస్థల నుంచి రెరా చట్టం 2016 సెక్షన్ 3(1), 4 (1) ప్రకారం ఎలాంటి అనుమతుల్లేవని రెరా అథారిటీ పేర్కొంది. దీంతో ఈ సంస్థల నుంచి ఎలాంటి క్రయ, విక్రయాలను జరపవద్దని ప్రజలకు తెలిసేలా రెరా ప్రకటనను విడుదల చేసింది. ఇలాంటి సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉన్నాయని ప్రస్తుతం గుర్తించిన రెరా వాటి గురించి ఆరా తీయడంతో పాటు వాటికి కూడా నోటీసులు పంపించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇప్పటికే కొన్ని సంస్థలకు నోటీసులు పంపించడంతో పాటు మరికొన్నింటిపై చట్ట పరమైన చర్యలకు రెరా ఉపక్రమించినట్టుగా తెలిసింది.

అక్రమ వెంచర్లు,
ప్రాజెక్టులపై చర్యలు

అక్రమ వెంచర్లు, ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలని రెరా అథారిటీ నిర్ణయించింది. అందులో భాగంగా అనుమతి లేని వెంచర్లు, ప్రాజెక్టుల వివరాలను ఎప్పటికప్పుడు పత్రికల్లో ప్రచురించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పలు వెంచర్ల లో ప్లాట్లను కొనుగోలు చేయకూడదని రెరా తాజాగా వినియోగదారులను హెచ్చరించింది. ఈ క్రమంలో పలు సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఇక నుంచి రెరా అనుమతి లేని కొనుగోళ్లు చేయకూడదని పేర్కొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాల్లో కొనుగోలు చేసేవారు విషయాన్ని రెరా వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News