Sunday, June 16, 2024

మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసి పరిధిలో ఆయనో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్(ఎస్‌ఎఫ్‌ఎ). కార్మికులతో పారిశుద్ద పనులు చేయించి…వారి హాజరును ఉన్నతాధికారులకు పంపడం ఆయన విధి. కానీ, కుటుంబ పోషణ కోసం పారిశుద్ధ పనులు చేస్తోన్న మహిళా కార్మికురాళ్లను బెదిరించి కామ కలాపాలను కొనసాగిస్తున్నారు. తన‘దారి’కి వస్తే పనులు చేయకున్నా చేసినట్లుగా చూపించడం…ఎదురు తిరిగినా….‘దారి’కి రాకున్నా పనుల నుంచి తొలగించడం చేస్తోండటంతో సదరు ఎస్‌ఎఫ్‌ఎ బెదిరింపులకు కొందరు మహిళా కార్మికురాళ్లు తలొగ్గినట్లు తెలిసింది. అయితే, ఈ కామకలాపాలను వీడియోలు కూడా తీసి మహిళలను బెదిరింపులకు పాల్పడటం మరో విశేషం. ఇదంతా బహిరంగంగా సాగుతున్నా చేసేదిలేక సదరు బాధిత మహిళా కార్మికురాళ్లు బిక్కుబిక్కుమంటున్నట్లు తెలిసింది. ఈ వేధింపులు సాక్షాత్తూ ఓ మహిళా ఐఏఎస్ అధికారి ప్రాతినిత్యం వహిస్తున్న సర్కిల్‌లోనే జరుగుతుండటం కొసమెరుపు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కుత్బుల్లాపూర్‌లోని గాజుల రామారం సర్కిల్ 25లో ఓ ఎస్‌ఎఫ్‌ఎ ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. పనిచేసే మహిళా కార్మికురాళ్లను లైంగికంగా వేధిస్తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఆయన వేధింపులు మరింత తీవ్రతరం అవుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కింద పనిచేసే మహిళా కార్మికురాళ్లపై కన్నెసిన సదరు ఎస్‌ఎఫ్‌ఎ తను పిలిచిన చోటుకు రావాలని…లేదంటే వారి పనుల నుంచి తొలగించడం…గైర్హాజర్ పేరితో ఇబ్బందులు పెట్టడం చేస్తున్నట్లు తెలిసింది. కొందరిని భయపెట్టి….బెదిరించి తనదారిలోకి తెచ్చుకుని రాసలీలలు జరుపుతుండటం…ఈక్రమంలోనే వీడియోలు తీసి వారిని మళ్లీ బెదిరిస్తుండటంతో మహిళలు పనులకు రావాలంటేనే బిక్కుబిక్కుమంటున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులకు చెబితే తన పలుకుబడితో తమ ఉద్యోగాలను తొలగిస్తారన్న భయంతో అతని ఆగడాలను భరిస్తున్నట్లు తెలిసింది.

ఓ మహిళా కార్మికురాలిని బెదిరించి… తనదారిలోకి రప్పించి, కామకలాపాలను కొనసాగించిన ఆమె వీడియోలు తీసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. మాట వినకపోతే బండారం బయటపెడతానని బెదిరించి తరచూ తన కోరికలను తీర్చుకుంటున్నట్లు సమాచారం. ఈ ఆగడాలను ఎవరికీ చెప్పుకోలేక కొందరు నరకయాతన పడుతున్నట్లు తెలిసింది. కొందరు బాధితురాళ్లు తమ గోడును విన్నవించుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లు తెలిసింది. అయితే, అతని ఆగడాలు మరింత తీవ్రం అవుతుండటంతో వ్యూహాత్మకంగా అతని సెల్‌ఫోన్‌ను తీసుకుని వీడియోలను ఇతరుల ఫోన్‌లకు, ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిసింది.ఇంత జరిగినా ఉన్నతాధికారులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని బాధిత మహిళా కార్మికురాళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ వేధింపులు మహిళా ఐఎఎస్ అధికారి ప్రాతినిథ్యం వహిస్తున్న కూకట్‌పల్లి జోన్ పరిధిలో జరుగుతున్నా ఈ కామాందుడిపై ఎలాంటి చర్యలు చేపట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News