Saturday, April 27, 2024

పాక్ ప్రధానిగా మళ్లీ షెహబాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

వరుసగా రెండవ సారి ప్రధాని పదవి
పిఎంఎల్‌ఎన్, పిపిపి సంయుక్త అభ్యర్థి
201 వోట్లు వచ్చిన షెహబాజ్

ఇస్లామాబాద్ : షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు వరుసగా రెండవ సారి ప్రధాని అయ్యారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నినాదాల మధ్యషెహబాజ్ షరీఫ్ మెజారిటీ సాధించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన్), పాకిస్తాన్ పీ.పుల్స్ పార్టీ (పిపిపి) సంయుక్త అభ్యర్థి 72 ఏళ్ల షెహబాజ్ కు 201 వోట్లు వచ్చాయి. 336 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో సభా నాయకుడు కావడానికి అవసరమైన వోట్ల కన్నా 32 వోట్లు అధికంగా ఆయనకు వచ్చాయి.

షెహబాజ్ ప్రత్యర్థి, జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్‌కు 92 వోట్లు లభించాయి. జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిఖ్ ఈ ఎన్నిక ఫలితాలను ప్రకటించారు. పాకిస్తాన్ 24వ ప్రధానిగా షెహబాజ్‌ను నియమిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అధ్యక్ష ప్రాసాదం ‘ఐవనే సదర్’లో సోమవారం షెహబాజ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. పిటిఐ మద్దతు ఉన్న ఎంపిల నినాదాలు, రభస మధ్య కొత్త పార్లమెంట్ సెషన్ మొదలైంది. పిటిఐ మద్దతు ఉన్న ఎంపిలు ‘ఆజాదీ’, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను సూచిస్తూ ‘ఖైదీ నం 804’ అని నినాదాలు చేశారు.

పిటిఐ మద్దతు ఉన్న ఎంపిలు కొందరు ఇమ్రాన్ ఖాన్ పోస్టర్లను ప్రదర్శించారు. ఇమ్రాన్ అనుకూల నినాదాలకు ప్రతిగా పిఎంఎల్‌ఎన్ ఎంపిలు ‘లాంగ్ లివ్ నవాజ్’ అని నినాదాలు చేయడమే కాకుండా ఇమ్రాన్ ఖాన్‌పై గల తొషఖానా అవినీతి కేసును సూచిస్తూ రిస్ట్‌వాచీలను ప్రతిపక్షాల బెంచ్‌ల వైపు ప్రదర్శించారు. ప్రధాని పదవి ఎన్నికలో షెహబాజ్‌కు అనుకూలంగా వోటు వేసిన తొలి వ్యక్తి పిఎంఎల్‌ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్. పిఎంఎల్‌ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ ఓటమిని ఒప్పుకుని ఉంటే మర్యాదగా ఉండేదని ఎన్నికకు ముందు పిటిఐ వ్యాఖ్యానించింది.

‘కాని ఆయన హేయనీయమైన జీవితం సాగించేందుకు నిశ్చయించారు. ప్రతి రోజు ఈ పరాజితుల కూటమికి, ముఖ్యంగా నవాజ్ షరీఫ్, మరియంలకు గతంలో కన్నా హీనంగా ఉంటుంది’ అని పిటిఐ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం పార్లమెంట్‌ను రద్దు చేయడానికి ముందు 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు సంకీర్ణ ప్రభుత్వ ప్రధానిగా షెహబాజ్ వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News