Tuesday, March 5, 2024

కుక్కతోక వంకర!

- Advertisement -
- Advertisement -

కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఎదురులేని శక్తిగా గెలుపొందడానికి గల కారణాల్లో బిజెపి చేజేతులా చేసుకొన్న తప్పులు ముఖ్యమైనవి కాగా, హస్తం పార్టీ ఐకమత్యంతో పోరాడడం ప్రధానమైన హేతువు. అదానీ విషయంలో ప్రధాని మోడీని పదే పదే ఎత్తిచూపి ఎండగట్టినందుకు రాహుల్ గాంధీపై కక్షగట్టి ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని ఊడబెరికించి వెనువెంటనే అధికారిక నివాస భవనం నుంచి కూడా ఖాళీ చేయించడం వంటి బిజెపి ఉడుకుమోతు చర్యలతో పాటు రాహుల్ ‘భారత్ జోడో’ యాత్ర వంటివి కూడా కాంగ్రెస్ విజయానికి కారణమై వుండవచ్చు. అందులోనూ ఊతకర్ర అవసరం లేకుండా సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్పష్టమైన మెజారిటీని దానికి కట్టబెట్టడానికి ఇంకెన్నో కారణాలున్నాయి.

సెక్యులర్ దేశానికి ప్రధాని అయి వుండి జై భజరంగ్‌భళీ అని మోడీ నినదించడం వంటి దృశ్యాలు జుగుప్స కలిగించి ఓటర్లు బిజెపికి గట్టి గుణపాఠం చెప్పి వుండవచ్చు. ఇటువంటి అనేక కారణాలతో పాటు పార్టీ అంతర్గత విభేదాలకు స్వస్తి చెప్పి కలిసికట్టుగా కృషి చేయడం కూడా కాంగ్రెస్ ఘన విజయానికి తోడ్పడింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి విషయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డి.కె శివకుమార్‌కు మధ్య తలెత్తిన పోటీని కూడా ఐకతను కాపాడుకొని వెళ్ళగలిగేలా చాకచక్యంగా పరిష్కరించుకోగలగడం కాంగ్రెస్ ముందున్న అతి పెద్ద సవాలు. కర్ణాటకలో అది పొందిన గత విజయాలతో పోల్చితే ప్రస్తుత గెలుపు కాంగ్రెస్‌కు అసాధారణమైనది. 1999లో 132 స్థానాలను, 2013లో 122 సీట్లను మాత్రమే గెలుచుకొన్నది. ఈసారి 42.9% ఓట్లు, 135 సీట్లు సొంతం చేసుకొన్నది. ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకపోడంతో పాటు పార్టీ అగ్ర నాయకులు ఒక్క త్రాటి మీద నిలబడడం ఇందుకు విశేషంగా ఉపయోగపడింది.

ఈ ఏడాదిలో జరగవలసి వున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్, తెలంగాణ ఎన్నికలకు పార్టీలో ఇదే మాదిరి ఐకమత్యాన్ని కాపాడుకోడం కాంగ్రెస్‌కు సాధ్యమేనా? ఆ పార్టీలో అందరూ కలిసి నడవడమనేది కుక్కతోక సామెతను గుర్తుకు తెస్తుంది. తెలంగాణలో దీనిని కళ్ళారా చూస్తూనే వున్నాము. అధికారంలో వున్నప్పుడు అధిష్ఠానం గోడ కుర్చీ వేయించినా మారుమాటడకుండా పాటించే ఆ పార్టీ నాయకులు అది కేంద్రంలో అధికారం కోల్పోయి అత్యంత అధ్వాన స్థితికి జారుకున్న ప్రస్తుత సమయంలో దాని ఆదేశాలను పాటించడం కష్టతరమే. కర్ణాటకతో కలిసి 4 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో వుంది. ఎన్నికలు జరగవలసి వున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బిజెపితో నేరుగా తలపడవలసి వుంది. కర్ణాటకలో బిజెపిని నేరుగా ఢీ కొట్టి అసాధారణ విజయం సాధించడం ఈ విషయంలో ఇంత వరకు కాంగ్రెస్‌లో గల భయాన్ని తొలగించి వుంటుంది. కాని కర్ణాటకలో మాదిరిగా ఇతర ఎన్నికల రాష్ట్రాలలో పార్టీలో ఐక్యతను సాధించి కాపాడుకోడం ఎలా? రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో వున్నది.

అయినప్పటికీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు, యువ నాయకుడు సచిన్ పైలట్‌కు మధ్య చిచ్చు ఇంకా రగులుతూనే వుంది. పైలట్ తన సొంత పార్టీ ప్రభుత్వంపైనే బాణాన్ని ఎక్కుపెట్టి జరిపిన 5 రోజుల పాదయాత్ర సోమవారంతో ముగిసింది. బిజెపి గత పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ పాద యాత్ర జరిపారు. వసుంధరా రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోడానికి గెహ్లాట్ ప్రభుత్వానికి 15 రోజులు వ్యవధి ఇస్తున్నానని ఆలోగా కదలిక లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతానని సచిన్ పైలట్ అల్టిమేటమ్ ఇచ్చారు. ఈ పాదయాత్ర తర్వాత ఆయన పట్ల రాజస్తాన్ పిసిసిలో పునరాలోచన కలిగిందని తాజా వార్తలు చెబుతున్నాయి. బహుశా కర్ణాటక పార్టీలో ఐక్యత వల్ల సాధ్యమైన విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పు అనివార్యంగా వచ్చిందనుకోవాలి.

పార్టీలో విభేదాలు వున్న మాట వాస్తవమేనని, అందరినీ దగ్గరకు చేర్చి వాటిని పరిష్కరిస్తానని రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సుఖ్‌జిందర్ సింగ్ రణధవా ఆదివారంనాడు ప్రకటించారు. అధిష్ఠానమే ఆయన చేత ఈ ప్రకటన చేయించి వుండవచ్చు. ఎన్నికల నాటికి గెహ్లాట్ పైలట్‌ల మధ్య ఏకీభావం సాధించితీరవలసిన బాధ్యత అధిష్ఠానంపై వుంది. అలాగే చత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భగేల్, రాష్ట్ర ఆరోగ్యమంత్రి సింగ్‌దేవో మధ్య తీవ్ర విభేదాలున్నాయి. చత్తీస్‌గఢ్‌ను 15 ఏళ్ళు పరిపాలించిన బిజెపి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన 5 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెసే గెలిచింది. కాని పార్టీలో అనైక్యత దాని విజయావకాశాలను 8 మాసాల్లో జరగనున్న ఎన్నికల్లో దెబ్బ తీయవచ్చు. అందుచేత కాంగ్రెస్ అధిష్ఠానం మీద వున్న ప్రధానమైన బాధ్యత పార్టీలో విభేదాలను పరిష్కరించుకోడమే. కుక్కతోక వంకరను సరిదిద్దడమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News