Saturday, July 27, 2024

పర్యాటకానికి అంతరిక్షమే హద్దు!

- Advertisement -
- Advertisement -

మన దేశంలో అంతరిక్ష పర్యాటకానికి ఎనలేని క్రేజ్ ఉంది. భారత దేశంలో చాలా మంది రోదసీ యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశంలో తొలిసారి అంతరిక్ష పర్యాటకం ప్రారంభించాలని ఇస్రో ఆలోచన చేస్తోంది. ఈ రోదసీ యాత్ర చేసివచ్చిన వారు తమను తాము వ్యోమగాములుగా పిలుచుకోవచ్చు. కాగా ప్రపంచంలో సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవలికాలంలో పర్యాటకరంగం అభివృద్ధి చెందింది. ప్రజల్లో కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తే తొలి రోజుల్లో పర్యాటక రంగానికి పునాదిగా ఉండేది. అయితే రానురాను దేశ కాలమాన పరిస్థితులు మారిపోయాయి. రకరకాల కారణాలతో ప్రజలు వేర్వేరు కొత్త ప్రదేశాలకు వెళ్లడం మొదలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పెరిగింది. అయితే ఇప్పుడు ప్రజల ఆలోచనా ధోరణి మారింది. ఏకంగా అంతరిక్షంలోకి సరదాగా ఓ ట్రిప్ వేయాలన్న కుతూహలం ప్రజల్లోపెరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సర్వసాధారణం అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

తెలుగువాడి కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైంది. తెలుగు వ్యక్తి తోటకూర గోపీచంద్ విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేశారు. గోపీచంద్ ఒక పర్యాటకుడిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టి వచ్చారు. ఈ సందర్భంగా అంతరిక్ష పర్యాటకం హాట్ టాపిక్ అయింది. అంతరిక్ష పర్యాటకం అనేది ఒక కలలాంటిది. అయితే అసలు ఈ కల సాకారమవుతుందా లేదా అనే ప్రశ్న కూడా గతంలో తెరమీదకు వచ్చింది. అయితే కాలక్రమంలో ఈ కలను సాకారం చేశాయి అంతరిక్షంతో ముడిపడ్డ అనేక కంపెనీలు. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనుక ఆయా సంస్థల రాత్రింబవళ్ల కష్టం ఉంది. అంతరిక్ష నిపుణుల స్వేదం ఉంది. వారి తెలివి అలాగే క్రియేటివిటీ ఉంది.

‘వర్జిన్ గెలాక్టిక్’ అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ. అదేదో సాదాసీదా కంపెనీ కాదు. రోదసీ యాత్రలు చేపట్టే ఓ అపురూప కంపెనీయే ‘వర్జిన్ గెలాక్టిక్’. 2004లో రిచర్డ్ బ్రాన్సన్ అనే సంపన్నుడు ‘వర్జిన్ గెలాక్టిక్ ’ పేరుతో ఒక స్పేస్ టూరిజం కంపెనీని స్థాపించాడు. 2021 జులై నెలలో ఓ రోదసీ యాత్ర నిర్వహించింది ‘వర్జిన్ గెలాక్టిక్. సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్‌తోపాటు మరో ఆరుగురు ‘విఎస్‌ఎస్ యూనిటీ- 22’ అనే వ్యోమనౌక ద్వారా వినువీధుల్లో విహరించారు. వినువీధుల్లో విహారం తరువాత సురక్షితంగా భూమి మీదకు తిరిగివచ్చారు.

ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫె బెజోస్‌కు కూడా అంతరిక్ష పర్యాటకంతో సంబంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం 2021లో తన సొంత వ్యోమనౌకలో రోదసీ యాత్ర చేశారు. జెఫె బెజోస్ నెలకొల్పిన కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ ఈ రోదసీ యాత్ర నిర్వహించింది. స్పేస్ ఎక్స్.. ఇది అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన సంస్థ. వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం ఎలన్ మస్క్ స్వంత సంస్థ ఇది. అంతరిక్షంపై తన ఆలోచనలకు అనుగుణంగా ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్ అనే సంస్థను ప్రారంభించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎలన్ మస్క్ పేరు మార్మోగింది. స్పేస్ ఎక్స్… ఒక వినూత్న ప్రాజెక్ట్ అంటారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష యాత్ర పరిధి మారుతోంది. అంతరిక్ష యాత్ర మరింత విస్తృతమవుతోంది. రోదసీ యాత్ర కాస్తా స్పేస్ అడ్వెంచర్ మోడల్‌గా అభివృద్ధి చెందుతోంది. అయితే కొన్ని కారణాలతో అందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రాకెట్ ప్రయోగం చాలా ఖరీదైన పరీక్షగా మారింది. కొన్నేళ్లుగా రాకెట్లలో ఉపయోగించే ఇంధనం అలాగే వనరుల ఖర్చు పెరిగింది. రోదసీ యాత్రలు విలాసవంతంగానే కాదు, సాహస యాత్రలుగానూ ఉంటాయి. రోదసీ యాత్రల్లో ప్రయాణీకుల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాయి సదరు కంపెనీలు.

సహజంగా టూరిజం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే అంతరిక్ష పర్యాటకం అంటే మరింత ఆసక్తి ఉంటుంది. అయితే స్పేస్ టూరిజం అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కోటీశ్వరులకు మాత్రమే ఉంటుంది. అంతరిక్ష పర్యాటకానికి సంబంధించిన ధరలను సామాన్యులు ఏమాత్రం భరించలేరు. కేవలం సంపన్నులు అది కూడా కోటీశ్వరులు మాత్రమే రోదసీ యాత్ర టికెట్లు కొంటారు. సహజంగా అంతరిక్షంలోకి రానూపోనూ ఒక్కో టికెట్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. ‘వర్జిన్ గెలాక్టిక్’ కంపెనీ అమ్మిన అంతరిక్ష టికెట్ ఒక్కోటి భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1.86 కోట్లు. ‘వర్జిన్ గెలాక్టిక్’ కంపెనీ అమ్మిన రోదసీ టికెట్లను కొన్నవారిలో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు ఉండటం విశేషం. ముందుగా రోదసీ యాత్ర అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. భూమి పైనుంచి దాదాపు తొంభై కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి తిరిగి రావటాన్ని రోదసీలోకి వెళ్లి రావడంగా ప్రస్తుతం భావిస్తున్నారు. మౌలికంగా రోదసీ యాత్రలను అంతరిక్ష చట్టం నియంత్రిస్తుంది. అంతరిక్ష చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా రోదసీ యాత్రలకు అధికారులు అనుమతి ఇస్తారు.

మన దేశంలో అంతరిక్ష పర్యాటకానికి ప్రారంభ దశలోనే బోలెడంత క్రేజ్ వచ్చింది. భారత దేశంలో చాలా మంది రోదసీ యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారత దేశంలో తొలిసారి స్పేస్ టూరిజం ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది. ఈ రోదసీ యాత్రలో ఒక్కో టికెట్ ధర దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉండే అవకాశముంది. ఈ యాత్ర చేసివచ్చిన వారు తమను తాము వ్యోమగాములుగా పిలుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. దేశంలో రోదసీ యాత్రలకు మంచి భవిష్యత్ ఉందంటున్నారు అంతరిక్షరంగ నిపుణులు. అంతరిక్ష యాత్ర… నిస్సందేహంగా లాభదాయకమే అంటున్నారు.

రానున్న రోజుల్లో అంతరిక్షయానం అనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందన్నారు నిపుణులు. స్పేస్ టూరిజానికి వివిధ భారతీయ మంత్రిత్వ శాఖ లు కొత్త పథకాలతో ముందుకు వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పర్యాటకం ప్రధాన వనరుగా ఉంది. పర్యాటకం ద్వారా అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న భారత దేశం తాజాగా అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశం ఎదురు చూస్తున్న అత్యంత ఉత్తేజకరమైన పర్యాటక రూపాలలో ఒకటి అంతరిక్ష పర్యాటకం. ఇప్పుడు, అంతరిక్షం అందరికీ చివరి సరిహద్దుగా మారింది.

మన దేశఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష టూరిజం ఊతం ఇస్తుందంటున్నారు నిపుణులు. అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి భారత దేశం ముందుగా స్పష్టమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో జాతీయత, వ్యోమనౌక ఫిట్‌నెస్‌ను గుర్తించడం, వైద్య ప్రమాణాలు, అంతరిక్ష సిబ్బందికి లైసెన్సింగ్, భద్రతా జాగ్రత్తలు.. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. రోదసీ యాత్రలను విజయవంతం చేయడానికి భారత దేశం ముందుగా వీటిపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. అయితే అంతరిక్ష పర్యాటకం అనేది చిన్నవిషయం కాదు. కోట్లకు కోట్లు పెట్టుబడులు అవసరం. ఈ భారీ పెట్టుబడులను కేవలం ప్రభుత్వసంస్థలే పెట్టాలనుకోవడం అత్యాశే అవుతుంది. అంతరిక్ష పర్యాటకంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు కూడా అవసరమవుతాయి.

అయితే అంతరిక్ష పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తాయనేదే ప్రశ్న. ఈ విషయంలో ప్రైవేటు సంస్థలను అంతరిక్ష పరిశోధకులు ఒప్పించగలగాలి. ప్రైవేటు సంస్థల ఇన్‌వాల్వ్‌మెంట్‌తో స్పేస్ టూరిజాన్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. సమర్థవంతంగా నిర్వహిస్తే అంతరిక్ష పర్యాటకం ఒక లాభదాయక పరిశ్రమ అవుతుందంటున్నారు. అయితే స్పేస్ టూరిజానికి సంబంధించి మనదేశంలోని నియమాలు, చట్టాలు ఎలా ఉన్నాయన్న దానిపై ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. స్పేస్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే అందుకనుగుణంగా సంబంధిత చట్టాల్లో మార్పులు చేయడం తప్పనిసరి అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పుడు ఉత్తర దేశయాత్ర లాగా భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సర్వసాధారణం అవుతుందని భావిస్తున్నారు.

ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News