Monday, June 24, 2024

జయహో భారతీయ సినిమా!

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు సత్యజిత్ రే, మృణాల్ సేన్, శ్యామ్ బెనెగల్, రిత్విక్ ఘటక్ వంటి భారతీయ దిగ్దర్శకుల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వేనోళ్ల ప్రశంసలకు పాత్రులయ్యేవి. వాస్తవికతకు దగ్గరగా, సృజనాత్మకత ఉట్టిపడేలా మన దర్శకులు తీసిన ఎన్నో సినిమాలు ప్రపంచ వేదికలపై అవార్డులు, రివార్డులు అందుకున్నాయి. కాలక్రమంలో కమర్షియల్ సినిమాకు ఆదరణ పెరిగింది. గత దశాబ్దకాలంలో మన సినిమాలు దేశవిదేశాల్లో ఆదరణ పొందుతూ, అంతర్జాతీయ వేదికలపై పురస్కారాలు అందుకుంటున్నాయి. ఫ్రాన్స్‌లో తాజాగా జరిగిన కేన్స్ చలన చిత్రోత్సవంలోనూ భారతీయ సినిమాలు విజయకేతనం ఎగురవేసి, భారతీయ నటులు, దర్శకుల సృజనాత్మకతను, ప్రతిభాపాటవాలను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాయి. యువ దర్శకురాలు పాయల్ కపాడియా తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం కేన్స్ రెండో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ ప్రీని సొంతం చేసుకుంది.

ఇంత వరకూ ఏ భారతీయ చిత్రమూ ఈ అవార్డును గెలుచుకోకపోగా, ప్రఖ్యాత వార్తా సంస్థ బిబిసి ‘చక్కటి కథ, అలరించే భావోద్వేగాలతో మంత్రముగ్ధుల్ని చేసే సినిమా’ అంటూ కపాడియా సినిమాని ఆకాశానికెత్తటం ప్రస్తావనార్హం. ఇదే చిత్రోత్సవం ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ విభాగంలో ప్రదర్శితమైన ‘ది షేమ్ లెస్’ మూవీలో నటించిన అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటి అవార్డు గెలుచుకోగా, ఉత్తమ లఘు చిత్రంగా చిదానంద తెరకెక్కించిన 16 నిమిషాల నిడివి గల ‘సన్ ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో’ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. వీటితోపాటు ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ను కేన్స్ వేదికపై ప్రతిష్ఠాత్మక పియరె ఆంజెనియక్స్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించడం మరో విశేషం. అసలు సిసలైన నటికి అందచందాలతో, గ్లామర్ తో పనిలేదని, మొహంలో హావభావాలు అద్భుతంగా పలికించడమే నటన అని నమ్మి, నటననే వృత్తిగా చేసుకున్న అనసూయ సేన్ గుప్తాలోని ప్రతిభను పసిగట్టిన బల్గేరియన్ దర్శకుడు కాన్ స్టాంటిన్ బొజొనొవ్ ఆమెను ప్రధాన పాత్రలో పరిచయం చేస్తూ ‘ది షేమ్ లెస్’ను రూపొందించారు.

అనసూయ ఆ చిత్రంలో కనబరిచిన ప్రతిభకు కేన్స్ న్యాయనిర్ణేతలు అచ్చెరువొందారట. పాయల్ కపాడియా విషయానికొస్తే, కేన్స్ ఆమెకు కొత్త కాదు. గతంలో ఆమె తీసిన ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ అనే చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు అందుకుంది. విచిత్రమేమంటే కేన్స్ లో అవార్డులు అందుకున్న పాయల్ కపాడియా, చిదానంద (ఉత్తమ డాక్యుమెంటరీ), సంతోష్ శివన్.. వీరంతా పుణె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) పూర్వ విద్యార్థులు కావడం. పుణె సంస్థలో చదువుకుంటున్నప్పుడే పాయల్ సదరు సంస్థకు చైర్ పర్సన్‌గా నియమితులైన బిజెపి నాయకుడు గజేంద్ర చౌహాన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ముందు వరసలో నిలబడి పోరాడి, అనేక కష్టాలు కొనితెచ్చుకుంది. ఆమెకు స్కాలర్ షిప్‌ను నిలిపివేశారు. సంస్థ నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఎఫ్‌టిఐఐ ఆమెపై దాఖలు చేసిన కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది కూడా.

కానీ ఇవేవీ ఆమెలోని కార్యదీక్షను, లక్ష్యసాధనను దెబ్బతీయలేకపోయాయి. పాయల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని కేన్స్‌లో ప్రదర్శించినప్పుడు, ప్రేక్షకులు లేచి నిలబడి ఎనిమిది నిమిషాల సేపు చప్పట్లూ కొడుతూ అభినందించారంటే ఈ సినిమా కథాంశం, తీసిన తీరు ఎంత గొప్పగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఎప్పుడో 75 ఏళ్ల క్రితం చేతన్ ఆనంద్ తీసిన ‘నీచానగర్’ కేన్స్‌లో అత్యున్నత పామ్ డి ఓర్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఆ తరువాత భారతీయ సినిమా ఆ స్థాయిలో ఓ అవార్డు గెలుచుకోవడం ఇదే ప్రథమం.

నిన్న మొన్న దర్శకుడు రాజమౌళి తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని పాటకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు లభించగా, కార్తికి గొన్జాల్విస్ రూపొందించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది. ఇప్పుడు కపాడియా ప్రభృతులు కేన్స్‌లో మూడు అవార్డులు గెలుచుకుని ఆ ఒరవడిని మరింత ముందుకు తీసుకువెళ్లారు. దీన్ని బట్టి, భారతీయ సినిమాకు మహర్దశ పట్టినట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని కేన్స్ వేదికపై పాయల్ కపాడియా పరోక్షంగా ప్రస్తావించింది. ఇంకో భారతీయ సినిమా కోసం మరో 30 ఏళ్లు వేచి చూడవద్దంటూ కేన్స్ జ్యూరీని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలో.. రాబోయే కాలంలో భారతీయ సినిమాలు మరిన్ని విజయాలు సాధిస్తాయన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఆమె మాటలను నిజం చేస్తూ, భారతీయ సినిమాలు నూతన శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News