Saturday, July 27, 2024

గుండెలు మీటే తీగలు కిన్నెర కళాకారులు

- Advertisement -
- Advertisement -

Kinnera-arts

కిన్నెర లో ఏడు మెట్ల కిన్నెర, తొమ్మిది మెట్ల కిన్నెర, పన్నెండు మెట్ల కిన్నెర అని విభిన్న రకాలుగా ఉంటాయి.ఈ రకంగా కిన్నెర మెట్లలో తేడాలు ఉన్నప్పటికీ వాద్యం పలకడంలో మాత్రం పన్నెండు మెట్ల కిన్నెర శబ్దం ఎక్కువగా పలుకుతుందని, ఏడు,తొమ్మిది మెట్ల కిన్నెరలు కొద్దిగా తక్కువ మోతాదులో పలుకుతాయంటారు కళాకారులు. ఈ ఏడు, తొమ్మిది మెట్ల కిన్నెరలను టుక్రీ కిన్నెరలని, ఇక పన్నెండు మెట్ల కిన్నెరను బార కిన్నెర అని పిలుస్తారు.

జాం జాం దెబ్బ చూడు, పదహారేళ్ళ వయసు చూడు ,రాజు గాని తుపాకి చూడు ఆరు పెద్దపులుల చూడు……. లక్ష్మురాయుని బంగ్ల మీద పన్నెండు మెట్ల కిన్నెర పలికెచూడు…, ఈ రకంగా జానపద పాటల్లో కిన్నెర ప్రస్తావన కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రాచీన కావ్యాల్లో కూడా కిన్నెర ప్రస్తావన ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కిన్నెర కళాకారులు ఎక్కువగా ఉండటం విశేషం. కొల్లాపురం లోని జటప్రోలు సంస్థానంలోని సురభి మాధవ రాయుల వంశస్తుల పాలనలో కిన్నెర కళాకారులు శోభాయమానంగా వెలుగొందారంటారు.

కళాకారులు కిన్నెరను ఆది శక్తి రూపంగా భావిస్తారు. రాత్రిపూట కిన్నెర ను శ్రుతి మీద పెట్టకుండా శృతి తీసి ఉంచుతారు. లేకుంటే ఆదిశక్తి రాత్రి సమయంలో కిన్నెర మీద వాలి వాయిస్తుందని, రాత్రంతా నిద్రపోకుండా చేస్తుందని కళాకారులు విశ్వసిస్తారు. ఆదిశక్తికి ప్రీతి వంతమైన మంగళవారం మాత్రం తప్పక కిన్నెరశృతి మెట్టు తీసి ఉంచుతారు. ఇతర రోజుల్లో ఆదిశక్తి కిన్నెర మీద వాలి వాయించక పోయినా, మంగళవారం మాత్రం తప్పక వాలి వాయిస్తుందని కర్నే రంగన్న మాటల్లో తెలుస్తున్నది. ప్రతి దసరాకు కళాకారులు తప్పక కిన్నెరను పూజించుకుంటారు. అలాగే కళాకారులు మిరాశి గ్రామాలకు
వెళ్లినప్పుడు కూడా ఆదిశక్తిని పూజించుకొని మంగళవారం రోజున వెళ్తారు.

జానపదుల సామాజిక జీవనంలోని వినోదాలు, దుఃఖాలు, పండుగలు, పబ్బాలు, వేడుకలు, పెళ్లిళ్లు, చావుపుట్టుకలు, దేవతల కొలుపులు వంటి ప్రత్యేక సందర్భాల్లో వాద్యం కూడా ప్రతి ఆచారంలో భాగమైంది. ఆ జానపద సమూహంలో వా ద్యం పూజింపబడే స్థాయిని నిలుపుకుంది. అంతేగాక ఆ వా ద్యం వాయించే కొందరు కళాకారులు కూడా అదే వాద్యం పే రుతో కులంగా ఆవిర్భవించి, తరతరాలుగా మనుగడ సాగిస్తున్నారు. దీనినిబట్టి జానపద సమూహంలో వాద్యాలకు ఎంత టి ప్రాధాన్యం ఉందో తెలుస్తున్నది. వాద్య సంగీతం ఆయా సందర్భాన్నిబట్టి మనిషిలో అంతర్గతంగా ఉన్న ఉత్సాహం, ఆనందం, వినోదం, భయం, ఉద్రేకం, ప్రశాంతత మొదలైన ఏదో ఒక చలనాన్ని కలిగిస్తుంది. అందుకే సంస్కృతి పరంపరలో నేటికీ వాద్యం శుభ అశుభ కార్యాల్లో కొనసాగుతూ వా ద్యం లేని కార్యక్రమం నిర్వహించలేని స్థితి ఉంది.

జానపదునికి వినోదం కలిగించే విషయంలో వాద్యాలు ఆయా జానపద కళారూపాల కళాకారులకు వాద్య సంగీతం ఆధారమై కథా గానాలు, పురాణాలు, నాటకాలు, ఇంద్రజాల విద్యలతో పాటు, శృంగార, తాత్విక, కౌటుంబిక గేయాల ప్రదర్శనలో వాద్యాలు కూడా ప్రధానంగా ఉపయోగపడుతూ ఆయా కళాకారులకు, ఆయా కళారూపాల మనుగడకు దోహదం చేస్తున్నవి. జానపద కళారూపాలు ప్రదర్శనలో ఉపయోగించే విభిన్న వాద్యాలు పలికే సంగీతం మనసుకు శ్రావ్యమైన, నిర్మలమైన సంగీతాన్ని అందిస్తూ ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇటువంటి శ్రావ్యమైన నిర్మలమైన సంగీతాన్ని పలికే వాద్యాల్లోతంత్రీ వాద్యాలు ప్రముఖమైనవి. ఈ తంత్రీ వాద్యానికి చెందినదే కిన్నెర వాద్యం. కిన్నెర వాద్యాన్ని కిన్నెర కింపురుషులు, దేవానుదేవతలు వాయించే వాద్యంగా కళాకారులు గొప్పగా చెప్పుకుంటారు.

జానపద కళాకారులు కాకుండా కిన్నెర వాద్యాన్ని ఆదివాసీలైన గోండులు, చెంచులు కూడా వాయిస్తారు. పూర్వం రోజుల్లో చెంచు తెగకు చెందిన కళాకారుడు కిన్నెర వాయిస్తుంటే అతని భార్య కూరగాయలు కోస్తూ, కిన్నెర సంగీత మై కంలో పడి ఆమె పక్కనే ఉన్న కొడుకును కూడా కోసిందని మౌఖికంగా ప్రచారంలో ఉన్న కథని కిన్నెర కళాకారుడు కరినె రంగన్న మాటల్లో వినిపిస్తున్నది. దీనిని బట్టి కిన్నెర శ్రావ్యమై న సంగీతానికి మైమర్చిపోవడం తప్పదని అర్థం చేసుకోవచ్చు.

జాం జాం దెబ్బ చూడు, పదహారేళ్ళ వయసు చూడు, రాజు గాని తుపాకి చూడు ఆరు పెద్దపులుల చూడు…. లక్ష్మురాయుని బంగ్ల మీద పన్నెండు మెట్ల కిన్నెర పలికెచూడు… ఈ రకంగా జానపద పాటల్లో కిన్నెర ప్రస్తావన కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రాచీన కావ్యాల్లో కూడా కిన్నెర ప్రస్తావన ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కిన్నెర కళాకారులు ఎక్కువగా ఉండటం విశేషం. కొల్లాపురం లోని జటప్రోలు సంస్థానంలోని సురభి మాధవ రాయుల వంశస్తుల పాలనలో కిన్నెర కళాకారులు శోభాయమానంగా వెలుగొందారంటారు.

కిన్నెర లో ఏడు మెట్ల కిన్నెర, తొమ్మిది మెట్ల కిన్నెర, పన్నెండు మెట్ల కిన్నెర అని విభిన్న రకాలుగా ఉంటాయి. ఈ రకంగా కిన్నెర మెట్ల లో తేడాలు ఉన్నప్పటికీ వాద్యం పలకడంలో మాత్రం పన్నెండు మెట్ల కిన్నెర శబ్దం ఎక్కువగా పలుకుతుందని, ఏడు,తొమ్మిది మెట్ల కిన్నెరలు కొద్దిగా తక్కువ మోతాదులో పలుకుతాయంటారు కళాకారులు. ఈ ఏడు, తొమ్మిది మెట్ల కిన్నెరలను టుక్రీ కిన్నెరలని, ఇక పన్నెండు మెట్ల కిన్నెరను బార కిన్నెర అని పిలుస్తారు.

కళాకారులు కిన్నెర ను తయారు చేయడానికి మూడు చేదు గుండాలం ఆనపకాయలను ఉపయోగిస్తారు . కిన్నెరకు మధ్యలో ఉండే ఆనపకాయ బుర్ర మిగతా రెండు బుర్రలకంటే పెద్దగా ఉంటుంది.దీన్ని తల్లికాయ అని ,మిగతా రెండింటిని పిల్లకాయలు అని పిలుస్తారు. కిన్నెర కు పెట్టే మెట్లు ఒకప్పుడు (వాలుగజగ్గలు బొచ్చలు) అలుగు జంతువు పొలుసులను మెట్లకు ఉపయోగించుకునేవారు.కానీ ప్రస్తుతం ఎద్దు కొమ్ములను ఒక ఇంచు మందం వెడల్పు తో తయారు చేసుకుని వెదురుబొంగు పైభాగంలో మైనంతో అమర్చుకుంటున్నారు. ఈ పన్నెండు మెట్లలో ఒకదానిని చిలకమెట్టు, మరి రెండింటిని జమా మెట్టు, శృతి మెట్టు అని పిలుస్తారు. కిన్నెర కు వాడే వెదురు బొంగు కూడా పెంటి కట్టె అంటే ఆడ బొంగునే వాడతారు. దీన్ని వాడటం వల్ల శబ్దం బాగా వస్తుందంటారు. కిన్నెరకు మూడు ఉక్కు తీగలుంటాయి.

ఒకటి వెదురు బొంగు మీద మెట్లు గట్టిగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మిగతా రెండు తీగల్లో ఒకటి మృదువుగా పలికే ఆడ తీగ, మరొకటి పరుషంగా పలికే మగ తీగ.ఈ తీగలను వెదురు బొంగుకు ఉండే బుద్ధి మంతుని పుల్లకు చుడతారు. దీన్నే శృతి మెట్టు అని కూడా అంటారు. కిన్నెర అలంకరణ కోసం రకరకాల గురిగింజలు, అద్దాలు, నెమలీకలు ఉపయోగిస్తారు. వీటితో పాటుగా సిగ్గులొలికే ఒక చిలుకను కిన్నెర చివరన ఒక తీగకు కట్టి ఉంచుతారు. ఇది హాస్యం కోసం ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కళాకారులు కిన్నెరను ఆది శక్తి రూపంగా భావిస్తారు.

రాత్రిపూట కిన్నెర ను శ్రుతి మీద పెట్టకుండా శృతి తీసి ఉంచుతారు. లేకుంటే ఆదిశక్తి రాత్రి సమయంలో కిన్నెర మీద వాలి వాయిస్తుందని, రాత్రంతా నిద్రపోకుండా చేస్తుందని కళాకారులు విశ్వసిస్తారు. ఆదిశక్తికి ప్రీతి వంతమైన మంగళవారం మాత్రం తప్పక కిన్నెరశృతి మెట్టు తీసి ఉంచుతారు. ఇతర రోజుల్లో ఆదిశక్తి కిన్నెర మీద వాలి వాయించక పోయినా, మంగళవారం మాత్రం తప్పక వాలి వాయిస్తుందని కర్నే రంగన్న మాటల్లో తెలుస్తున్నది . ప్రతి దసరాకు కళాకారులు తప్పక కిన్నెరను పూజించుకుంటారు. అలాగే కళాకారులు మిరాశి గ్రామాలకు వెళ్లినప్పుడు కూడా ఆదిశక్తిని పూజించుకొని మంగళవారం రోజున వెళ్తారు.

తెలంగాణలో కిన్నెర ను ఉపయోగిస్తూ మాదిగ మాష్టి, డక్కలి వారు కథలు చెప్తారు. ఈ రెండు కులాలు మాదిగ వారిని మాత్రమే ఆశ్రయించి వారికి కథలు చెప్పగా వచ్చిన ప్రతిఫలం తోనే జీవిస్తారు. వరంగల్, కరీంనగర్, జమ్మికుంట, సిద్దిపేట ప్రాంతంలో ఉన్న కళాకారులు మాత్రం మాదిగ వారిని ఆశ్రయించి పటం ఆధారంగా జాంబపురాణం కథా గానం చేస్తూ జీవిస్తూ వస్తున్నారు. కానీ మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్న డక్కలి వారు మాత్రం కిన్నెర సహాయంతో కథలు చెబుతూ జీవిస్తున్నారు. వీరికి వంశపారంపర్యంగా సంక్రమించిన మిరాశి గ్రామాలు ఉంటాయి. ఆయా గ్రామాలకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ తర్వాత బయలుదేరుతారు. ఆయా గ్రామాలకు నియమం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వెళ్లి మాదిగ కుల పెద్దలను కలిసి ప్రదర్శనకు ఒప్పించి రాత్రి పూట కథా గానం చేస్తారు. ఈ రకంగానే మాదిగ వారికి కూడా మిరాశి గ్రామాలుంటాయి.

ప్రదర్శన:

కళాకారులు చెప్పే కథల్లో పురాణాల్లోని దేవతలు కనిపించరు. కేవలం నేటి కాలంలో నలుగురికి మంచి చేసిన స్థానిక వీరుల కథలే కనిపిస్తాయి. కిన్నెర మీద చెప్పే కథల్లో దేవతలు లేకపోయినా సాటి మనిషి కష్టాలు తీర్చిన వీరులనే దేవతలుగా భావించి కీర్తించే ప్రధాన కథలే కనిపించడం గొప్ప విశేషం. వీరు చెప్పే కథల్లో పండుగ సాయన్న ,మియాసాబు ఎన్న మెట్ల ఫకీరన్న, కాపు వెంగళరెడ్డి, కాపు రాములమ్మ, కొత్తకోట వెంకటరామిరెడ్డి మొదలైన కథలను చెప్తారు. వీటితోపాటుగా శృంగార, కరుణ, తాత్విక, వీరరస గేయాలు, హాస్య గేయాలు పాడతారు. ప్రధానంగా శ్రోతలు కళాకారుల చేత పండుగ సాయన్న మరియు మియాసాబ్ కథలను ఎక్కువగా చెప్పించుకోవడం విశేషం.

కళాకారుడు కథను ప్రారంభించే ముందు మాదిగ వారి కులోత్పత్తికి చెందిన ఆది జాంబవంతుని పుట్టుక, ఆదిపరాశక్తి పుట్టుక, మొదలైన అంశాలను పాట రూపంలో పాడి, తాను చెప్పబోయే కథను ప్రారంభిస్తాడు. కళాకారుడు తన ఎద మీద కిన్నెర ఉంచుకొని, తన రెండు చేతి వేళ్ళ తో మీటుతూ ‘ పండుగ సాయన్న పుట్టింది పెరిగింది మెరగోని పల్లె, దేశంబులు చూస్తానని బయలెల్లిండు సాయన్న ,పాలమూరు జిల్లాలో పద్నాలుగు తాలూకాలు, నన్ను పట్టే మొనగాడు ఈ జిల్లాలో లేడని, అతనికి పిడికెడు నడుము ఉంటుంది మూడు జానల ఎద ఉంటుందని ‘ఈ రకంగా కిన్నెర మీద పండుగ సాయన్న వీరత్వాన్ని వర్ణనలతో గొప్పగా చిత్రీకరించి పాడతాడు.

తాను మరణించినప్పటికీ, అతను ధనికుల దగ్గర ధనం ధాన్యం దోచుకొని పేదలకు పంచిన అసమాన ప్రతిభ గల వీరునిగా పాలమూరు జిల్లా అంతటా పేరుగడించిన వాడని,మరణించినప్పటికీ అతను చేసిన కిన్నెర కళాకారులకు మంచి కథా వస్తువై కిన్నెర మీద పలుకుతూ జానపదుల మనసును రంజింప చేస్తూ అతని ఔన్నత్యాన్ని చాటుతున్నారు కళాకారులు. కథలో సందర్భాన్ని బట్టి వచ్చే కరుణం, భీభత్సం, భయానకం, వీరత్వం వంటి హావ భావాలకు అనుగుణంగా, కిన్నెర ను మీటుతూ, కథకుడు తాను కథలో లీనమై, మైమరచిపోయి కథను సాగిస్తాడు. కథలో వచ్చే పలుకుబడులు, వర్ణనలు, పదబంధాలు, జంట పదాలు, సామెతలు కథను ఆద్యంతం శ్రోతలను అలరించేలా చేస్తాయి. కథను ఒక్కడే కళాకారుడు గానం చేస్తాడు కాబట్టి మధ్యమధ్యలో కథలో నిరాసక్తి లేకుండా ఉండేందుకు హాస్యం పాటలు, కొంటె పాటలు పాడుతూ ప్రదర్శన రక్తి కట్టిస్తాడు.

అంతేకాకుండా కిన్నెర మీది చిలుకను ఆడిస్తూ పాటలు పాడుతూ శ్రోతలను రంజింప చేయడం విశేషం. నేటి ఆధునిక కాలంలో కూడా కిన్నెర కళాకారులతో పండుగ సాయన్న కథ చెప్పించుకుంటారు. జానపదుల మస్తిష్కంలో అతను ఏ రకంగా నిలిచిపోయాడో అర్థం చేసుకోవచ్చు. నేటి యువ పరిశోధకులు పండుగ సాయన్న కథను నాటక రూపంలో మలుచుకొని, నాటకంగా కూడా ప్రదర్శించటం, అతని గొప్పతనం ఏమిటో గమనించవచ్చు. ఈ రకంగానే మియాసాబ్ కథతో పాటు మిగతా కథలను కూడా అత్యంత అద్భుతంగా ప్రదర్శించడం కిన్నెర కళాకారుల ప్రత్యేకత.

కిన్నెర కళాకారులైైన డక్కలి, మాదిగ మాష్టి వారు తమకు వంశానుగతంగా సంక్రమించిన మిరాశి గ్రామాలకే పరిమితమై ఆయా గ్రామాల్లోని మాదిగ వారికి మాత్రమే కథలు చెప్పుతూ, తమ సంస్కృతీ పరంపరను నేటికీ కొనసాగిస్తున్నారు. పాలమూరు జిల్లాలోని జానపదల వీరుల కథలను వారి గొప్పతనాన్ని కీర్తిస్తూ మౌఖిక సాహిత్యాన్ని భద్రపరుస్తూ, ప్రచారం చేస్తున్నారు. అయితే మిరాశి గ్రామాల్లోని మాదిగ వారు ఆదరిస్తేనే వీరి కళకు మనుగడ లేకుంటే కూటి కోసం కూలీ పనులు చేసుకోవడమే. ఆదరణ లేక పోయినా కళను బతికించుకోవడం కోసం కళాకారులు అనాదిగా పల్లెలకే పరిమితమై అష్టకష్టాలు పడుతున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కిన్నెర కళాకారులకు బహుళ ప్రాచుర్యం కల్పించారు. దర్శనం మొగులయ్య అనే కిన్నెర కళాకారుని ప్రతిభను గుర్తించి, ఆ కళారూపాన్ని డాక్యుమెంట్ చేసి భద్రపరిచారు. ఈ కళాకారునికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ జానపద కళాకారుని పురస్కారం అందించి కిన్నెర కళాకారులకు గౌరవాన్ని అందించారు. ఇదే కోవలో కిన్నెర కళాకారులను ఏకం చేసి అనేక ప్రదర్శనావకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా మామిడి హరికృష్ణ, డా.కెవి రమణాచారి(ఐఎఎస్ )ప్రోత్సాహంతో జానపద సాహిత్యం మీద పరిశోధన చేసిన డా.దాసరి రంగా, కిన్నెర కళాకారుల మీద ఉన్న పరిశోధనాభిలాషతో, ఆ కళాకారులను ప్రదర్శన పట్ల ప్రోత్సహిస్తూ , వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో తాను కిన్నెర మీద పరిశోధనా వ్యాసాలు రాయడమే కాక కళాకారులకు కూడా ఆయా సదస్సుల్లో ప్రదర్శనలు ఇప్పిస్తూ, వారి సంస్కృతీ గొప్పతనాన్ని, వారి మౌఖిక సాహిత్యాన్ని అనేక వేదికల మీద పరిచయం చేస్తూ వస్తున్నారు.

ప్రభుత్వపరంగా ప్రదర్శనావకాశాలు కొందరికి కల్పించినప్పటికీ, కళను నమ్ముకొని కళాకారులు పాలమూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఉన్నారు .అయితే కళకు ఆదరణ లేక, అవకాశాలు లేక తమ కళను పోషించుకుంటూ బతకలేని స్థితిలోనే ఉన్నారు. ప్రస్తుతం కళారూపం వృద్ధుల చేతుల్లోనే ఉంది. తమ కళని పిల్లలకు నేర్పించ లేక పోతున్నామని, మాకే ఆదరణ లేనప్పుడు మా పిల్లలకు నేర్పిస్తే బతుకుతెరువు కష్టమవుతుందని వాపోతున్నారు కళాకారులు. ప్రభు త్వం కొందరికి కళాకారుల పెన్షన్ అందిస్తుందని అలాగే అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించి, తమ భవిష్యత్తుకు భరోసా కలిగిస్తే, తమ పిల్లలు కూడా ఈ కళను నేర్చుకోవడానికి వెనుకాడబోరని, అప్పుడే మా ప్రాచీన కిన్నెర కళ బతుకుతుందని కళాకారుల మాటల్లో తెలుస్తున్నది. ఈ కోవలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వే డుకుంటున్నారు కళాకారులు.

గొంతు కిన్నెర బాలయ్య

నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ తాలూకా చుక్కాయ పల్లి గ్రామానికి చెందిన బాలయ్య గత యాభై సంవత్సరాలుగా తన గొంతుతో పన్నెండు మెట్ల కిన్నెరను అనుకరిస్తూ, కథలు, పాటలు పాడుతూ జానపదులను సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఈ విద్యను బాలయ్య తన ఇరవై ఒక్క ఏటనే కొల్లాపూర్ తాలూకా ప్రాంతంలోని చింత పెల్లి గ్రామానికి చెందిన కొలిపిలి చంద్రయ్య దగ్గర నేర్చుకుని అప్పటి నుండి పన్నెండు మెట్ల కిన్నెర మీద చెప్పే కథలను, పాటలను పాడటం ప్రారంభించాడు. ఇతను కిన్నెర వాద్యాన్ని అనుకరించేటప్పుడు చాలా సమయం ఊపిరిబిగబట్టి పలికిస్తాడు .ఈ సమయంలో అతను శారీరకంగా చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. నీటిలో మునిగిన వ్యక్తి ఎంతసేపు ఊపిరి బిగబట్టగలిగి ఉండగలడో అంతే రీతిలో బాలయ్య ఊపిరిని బిగబట్టి తన గొంతుతో కిన్నెరను పలికించడం అద్భుతంగా చెప్పుకోవచ్చు.

బాలయ్య కూడా తన గొంతుతో పండుగ సాయన్న కథ ,మియాసాబ్ కథతో పాటుగా హాస్యపు పాటలు, కోలాటం పాటలు పాడుతూ కొల్లాపురం పరిసర ప్రాంతాల్లో అనేక వేదికల మీద ప్రదర్శనలిస్తూ వస్తున్నాడు. ఇతనికి ఆనపకాయబుర్రలు ,వెదురుబొంగు,పన్నెండు మెట్లు, ఉక్కు తీగలు,అవసరం లేదు .తన గొంతునే కిన్నెర గా చేసుకొని కిన్నెర వాద్యమే మీటుతూ పాడినట్లుగా కిన్నెర కళాకారులకు దీటుగా ఈ మధ్యకాలంలో కన్యాకుమారి లో జరిగిన జాతీయ సదస్సులో కూడా తన కిన్నెర గొంతుకను వినిపించి ఆశ్చర్యం కలిగించడం గొప్ప విశేషం. ఇటువంటి అరుదైన కళాకారుడు ఇంకా అరుదైన కిన్నెర కళారూపాన్ని అనుకరించడం మరొక గొప్ప విశేషం.

Special Story On Kinnera Art And Palamuru Kinnera

                                                               డా.బాసని సురేష్, తెలుగు యూనివర్శిటీ, 99894 17299

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News