Thursday, April 25, 2024

ప్రచారంలో ‘కారు’ పరుగులు

- Advertisement -
- Advertisement -

TRS

 ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు
ఇన్‌ఛార్జీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని అధిష్ఠానం ఆదేశాలు
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న టిఆర్‌ఎస్ హైకమాండ్

హైదరాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికలప్రచార జోరు పతాకస్థాయికి చేరుకుంది. వార్డుల వారిగా గులాబి సేనల ప్రచారంతో హోరెత్తుతోంది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, శాసనసభ్యులు, మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు10 కార్పోరేషన్లలో ఎక్కడి కక్కడ ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

స్థానిక మేనిఫెస్టోల రూపకల్పన

వార్డుల వారిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు స్థానిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, తాము గెలిస్తే చేసే అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా స్థానిక అంశాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మున్సిపాలిటీ వార్డు సభ్యులుగా, కార్పొరేషన్ కౌన్షలర్లుగా గెలిస్తే చేసే పనులపై వాగ్దానాలు చేస్తున్నారు. అయితే రెవెన్యూకి సంబంధించిన ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్నాయనీ,మరిన్ని రోడ్లు, ఇంగ్లీషుమీడియం పాఠశాలల డిమాండ్ ప్రజలనుంచి ఉందని పోటీలో ఉన్న అభ్యర్థులు అధిష్ఠానానికి సమాచారం ఇస్తున్నారు.

అయితే టిఆర్‌ఎస్ ప్రభుత్వం పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనీ,సిఎం కెసిఆర్ పై అభిమానంగా ఉన్నారని తెలుపుతూ భారీ మెజారిటీతో గెలుస్తామని నివేదికల్లో టిఆర్‌ఎస్ అధిష్ఠానాకి నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు నివేదికలు సమర్పిస్తున్నారు. అయితే గెలుపు ఖాయం అయినప్పటికీ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ నిరంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని టిఆర్‌ఎస్ అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి అందరినీ కలుపుకొని ఎన్నికల ప్రచారం చేయాలని ఆధిష్ఠానం ఆదేశించింది. పోటీలో ఉన్న అభ్యర్థుల పక్షాన ఆశావాహులు ఎన్నికల ప్రచారం చేయాలని టిఆర్‌ఎస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఆదేశించింది.

ఎన్నికల ప్రచారంలోకి మంత్రులు

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను, స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ నియోజవర్గాల వారిగా మంత్రులు రంగ ప్రవేశం చేశారు. తొలుత తాము ప్రాతినిధ్యం విహిస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన మంత్రులు సమీప నియోజకవర్గాల్లో ఇంటింటికి ప్రచారం చేయడంతో పాటు రోడ్‌షోలు నిర్వహించి ప్రభుత్వ విధానాలను స్పష్టం చేస్తున్నారు. సిద్దిపేట నియెజకవర్గంలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో విష్తృతంగా పాల్గొని ఓటర్లకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పతకాలను వివరించారు. అలాగే మెదక్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని టిఆర్‌ఎస్ శ్రేణులను సంఘటితం చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ఇంటింటికి ప్రచారం చేశారు.

అలాగే టీ స్టాల్స్, ఐస్‌క్రీం పార్లర్లలో ఐస్‌క్రీం అమ్ముతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ గెలిస్తే కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తే సూర్యాపేటను దేశంలోనే అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దనున్నట్లు ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేటలోని 32,16, 10,25,07, 23,35 వార్డుల్లో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికలప్రచారంలో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపించడంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుబంధు, రైతు బీమా, పించన్లు పెంచారని ఆయన ప్రజలకు గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అఖండవిజయం సాధిస్తే ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 33,32 వార్డులతో పాటు చిన్నదప్పల్లిలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారం చేశారు.

జగిత్యాలతో మంత్రి కొప్పులఈశ్వర్ ఇంటింటికి ప్రచారం చేయడంతో పాటు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి రోడ్ షాలు నిర్వహించారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వైరాలోని 20,26 వార్డులతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదుమున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడం మీ బాధ్యత అభివృద్ధి చేయడం నాబాధ్యతని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పల్లెప్రగతిలో భాగంగా ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం భీంగల్ మండలంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొని ఓటర్లకు కారుగుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని మంజులాపూర్,వెంకటాపూర్, గాయత్రి నగర్ తదితర వార్డుల్లో అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలంపూర్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపి రాములు ఇంటింటికి ప్రచారం చేయడంతో పాటు ఆత్మీయసమ్మేళనాల్లో పాల్గొని టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సమన్వయ కమిటీతో సమీక్ష

మున్సిపాలిటీ,కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం, స్థానికంగా నెలకొన్న సమస్యలు, విజయావకాశాలపై ఎన్నికల సమన్వయకమిటీ సభ్యులతో శనివారం టిఆర్‌ఎస్ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆంతరంగికంగా సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ల వారిగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారసరళిని ఆయన సమీక్షించారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు,శాసనసభ్యులను సమన్వయం చేసుకుంటూ మంత్రులు ఎన్నికలప్రచారం చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.

ఎన్నికలు అయ్యేంతవరకు నియోజకవర్గాల్లోనే ఉండాలి

నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, శాసనసభ్యులు ఎన్నికలు అయ్యేంతవరకు కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండాలని టిఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశించింది. నివేదికల ద్వారా సమాచారం అధిష్టానానికి అందివ్వాలే కానీ నియోజకవర్గాలను వీడి వెళ్లవద్దని ఆధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మరో రెండురోజులే ప్రచారానికి సమయం ఉండటంతో ఆర్భాటాలకు వెళ్లకుండా ఇంటింటికి ప్రచారం చేయాలని ఆధిష్టానం ఇన్‌ఛార్జీలకు సూచించింది.

Telangana Municipal Elections 2020 Campaign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News